భలే... భలే.. వింత చేప!

చూడ్డానికి కాస్త మనిషి ముఖంలా కనిపిస్తున్న ఈ జీవి నిజానికి ఓ చేప. సముద్రం అట్టడుగున జీవిస్తుంది ఇది. అందుకే ఇది ఎక్కువగా బాహ్య ప్రపంచానికి కనిపించదు.

Published : 07 Aug 2023 00:03 IST

చూడ్డానికి కాస్త మనిషి ముఖంలా కనిపిస్తున్న ఈ జీవి నిజానికి ఓ చేప. సముద్రం అట్టడుగున జీవిస్తుంది ఇది. అందుకే ఇది ఎక్కువగా బాహ్య ప్రపంచానికి కనిపించదు. అంతే కాదు నేస్తాలూ...! ఈ చేప చాలా పొదుపరి. తన శక్తిని ఈత కోసం ఎక్కువగా ఖర్చు చేయదు. మరి ఈ వింత మీనం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందామా ఫ్రెండ్స్‌. అయితే ఇంకెందుకాలస్యం చకచకా ఈ కథనం చదివేయండి.

ఈ అరుదైన చేప పేరు ‘సైక్రోల్యూట్స్‌ మార్సిడస్‌’. పలకడానికి చాలా ఇబ్బందిగా ఉంది కదూ! మనలాంటి చిన్నారులకైతే మరింత కష్టం. మరేం నిరుత్సాహపడకండి. దీనికి ‘స్మూత్‌ హెడ్‌ బ్లాబ్ఫిష్‌’ అనే పేరు కూడా ఉంది. వాడుకలో ఈ చేపను బ్లాబ్‌ఫిష్‌ అని పిలుస్తారు. మనం కూడా ఎంచక్కా దీన్ని ఇలాగే పిలుద్దాం సరేనా.

సముద్రపు లోతుల్లో....

ఈ బ్లాబ్‌ఫిష్‌లు లోతైన సముద్ర జలాల్లో జీవిస్తాయి. అదికూడా ఆస్ట్రేలియా, టాస్మానియా చుట్టుపక్కల జలాల్లో నివసిస్తాయి. న్యూజిలాండ్‌ జలాల్లోనూ వీటి ఉనికి ఉంది. సాధారణంగా ఈ చేపలు కేవలం 30 సెంటీమీటర్ల వరకు మాత్రమే పొడవు పెరుగుతాయి. ఇవి విషపూరితం కావు కానీ.. ఇవి తినదగిన చేపలు కాదు. ఎందుకంటే ఇవి చూడ్డానికి కూడా కాస్త అసహ్యంగా కనిపిస్తాయి. పైగా ఇవి అంతరించిపోయే స్థితిలో ఉన్నాయి.

పీడనాన్ని తట్టుకుని...

బ్లాబ్‌ఫిష్‌లు 600 నుంచి 1,200 మీటర్ల మధ్య లోతులో నివసిస్తాయి. ఇక్కడ పీడనం సముద్రమట్టం కంటే 60 నుంచి 120 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇంత ఒత్తిడిని కూడా తట్టుకుని ఇవి అక్కడ మనుగడ సాగిస్తాయి. ఈ చేపలు నీటికంటే కాస్త తక్కువ సాంద్రత కలిగి ఉంటాయి. అందుకే ఇవి ఈతకోసం తమ శక్తిని ఎక్కువగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. సముద్రపు అడుగు భాగాన పైన తేలుతూ ఉంటాయి. ఇలాగే తన ఆహారాన్ని అన్వేషించుకుంటాయి.

పాపం.. బతకలేవు...

బ్లాబ్‌ఫిష్‌ జాతిని ఆస్ట్రేలియా న్యూజిలాండ్‌ మధ్య ఉన్న దీవుల చుట్టూ శాస్త్రవేత్తల బృందం మొట్టమొదట కనిపెట్టింది. ఈ చేపలు సముద్రపు అడుగు భాగంలోనే జీవించగలవు. ఉపరితలానికి వస్తే మాత్రం బతకలేవు. కొంతసేపటికే ఇవి తమ ప్రాణాలు కోల్పోతాయి. మరో విశేషం ఏంటంటే.. మిగతా చేపలతో పోల్చుకుంటే, ఈ బ్లాబ్‌ఫిష్‌లలో ఎముకలు, కండరాలు చాలా తక్కువగా ఉంటాయి. నేస్తాలూ... మొత్తానికి ఇవీ ఈ అరుదైన చేప విశేషాలు. భలే ఉన్నాయి కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని