ఇది ఆకలి తీర్చే బ్యాంకు!

హలో ఫ్రెండ్స్‌.. ‘అదేంటి.. బ్యాంకు అంటున్నారు.. ఆకలి తీరుస్తుందంటున్నారు’ అని ఆశ్చర్యపోతున్నారు కదూ..! సాధారణంగా బ్యాంకుల్లో డబ్బులకు సంబంధించిన లావాదేవీలు, పాఠశాలల్లో తరగతులూ జరుగుతుంటాయి.

Updated : 10 Aug 2023 00:54 IST

హలో ఫ్రెండ్స్‌.. ‘అదేంటి.. బ్యాంకు అంటున్నారు.. ఆకలి తీరుస్తుందంటున్నారు’ అని ఆశ్చర్యపోతున్నారు కదూ..! సాధారణంగా బ్యాంకుల్లో డబ్బులకు సంబంధించిన లావాదేవీలు, పాఠశాలల్లో తరగతులూ జరుగుతుంటాయి. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే పాఠశాల మాత్రం నిజంగా పేద పిల్లల ఆకలి తీర్చే బ్యాంకే.. మరి ఆ వివరాలేంటో తెలుసుకుందామా..!!

రియాణా రాష్ట్రంలోని కురుక్షేత్ర పట్టణంలో ‘డీఏవీ పోలీస్‌ పబ్లిక్‌ స్కూల్‌’ పేరిట ఓ పాఠశాల ఉంది. ఆ బడిలో చదువుకునే విద్యార్థులంతా తమ లంచ్‌ బాక్స్‌లో రోజూ ఒక రెండు చపాతీలను అదనంగా తీసుకొస్తారట. స్కూల్‌ ఉపాధ్యాయులు, స్థానిక పోలీసులు వాటన్నింటినీ తీసుకెళ్లి సమీపంలోని మురికి వాడల్లో ఉండే పిల్లల ఆకలి తీరుస్తుంటారు.

ఓ చిన్న ఆలోచనే..

ఆరేళ్ల క్రితం అంటే 2017లో కురుక్షేత్రలో పనిచేసే ఓ పోలీసు అధికారి ఏదో పని నిమిత్తం పట్టణ శివారుల్లో ఉన్న ఇటుక బట్టీల వద్దకు వెళ్లారట. అక్కడి కూలీలతో మాట్లాడుతుండగా వారి ఆకలి బాధలు ఆయనకు తెలిశాయి. ఆ మరుసటి రోజే కొన్ని చపాతీలను తీసుకెళ్లి ఆ కూలీలకు పంచిపెట్టారట. వెంటనే ఎక్కడి నుంచో కొందరు చిన్నారులు గుంపుగా వచ్చి.. ఆ అధికారి కారు చుట్టూ చేరి, ‘మాకూ ఆకలిగా ఉంది’ అని అడిగారట. దాంతో ఆ పిల్లల కోసం ఏదో ఒకటి చేయాలని అనుకున్నారాయన. ఆ ఆలోచనే ‘రోటీ బ్యాంకు’. అక్కడే ఉన్న స్కూల్‌లో పనిచేసే ఉపాధ్యాయులకు తన ఆలోచనను చెప్పడంతో వారూ సరేనన్నారు.

ఇంట్లో అడిగి మరీ..

మరుసటి రోజే ఆ స్కూల్‌ ఉపాధ్యాయులు.. విద్యార్థుల తల్లిదండ్రులతో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. రోటీ బ్యాంకు ఆలోచనను వారికి వివరించారు. పేద పిల్లల ఆకలి తీర్చే కార్యక్రమం కావడంతో వారూ సానుకూలంగా స్పందించారు. అప్పటి నుంచి ఆ స్కూల్‌ విద్యార్థులు ఇంటి నుంచి వచ్చేటప్పుడు రోజూ రెండు చపాతీలను అదనంగా తీసుకొచ్చి, బడి ఆవరణలో ఉంచిన డబ్బాలో పెట్టడం ప్రారంభించారు. అలా సేకరించిన ఆహారం మొత్తాన్ని వాహనంలో తీసుకెళ్లి అనాథలు, పేద పిల్లలకు పంచిపెడుతుంటారు. గత ఆరేళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. ఒకవేళ ఇంట్లో చపాతీలు అదనంగా పెట్టడం మర్చిపోతే, పిల్లలే గుర్తు చేసి మరీ అడిగి తీసుకొస్తారట. నేస్తాలూ.. మొత్తానికి పేదల కడుపు నింపుతున్న ఈ విద్యార్థులు నిజంగా గ్రేట్‌ కదూ! వారి స్ఫూర్తితో మనమూ పేదలు కనిపించినప్పుడు, వారికి చేతనైన సహాయం చేద్దాం.. సరేనా!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు