ఇది ‘గోల్డెన్‌ ఈగల్‌’..!

నా పేరు ‘బంగారు గద్ద’ అంటే ‘గోల్డెన్‌ ఈగల్‌’ అన్నమాట. ఎక్కువగా ఉత్తర అమెరికా, ఉత్తర ఆఫ్రికా ప్రాంతాల్లో కనిపిస్తుంటాను.

Published : 12 Aug 2023 00:10 IST

హాయ్‌ నేస్తాలూ..! ‘గద్ద’ను పక్షులకు రాజుగా పిలుస్తుంటారని మీకు తెలిసే ఉంటుంది. వాటిల్లోనూ బోలెడు రకాలు ఉంటాయి కదా.. ఇప్పుడు మనం అందులో ఒక రకమైన జీవి గురించి దాని మాటల్లోనే తెలుసుకుందాం.. సరేనా!!

నా పేరు ‘బంగారు గద్ద’ అంటే ‘గోల్డెన్‌ ఈగల్‌’ అన్నమాట. ఎక్కువగా ఉత్తర అమెరికా, ఉత్తర ఆఫ్రికా ప్రాంతాల్లో కనిపిస్తుంటాను. నా తల పైభాగంతోపాటు శరీరం మీద అక్కడక్కడా బంగారు వర్ణంతో మెరుస్తుంటాను. అందుకే, నాకు ఆ పేరు వచ్చింది. మిగతా శరీరం మొత్తం బ్రౌన్‌ కలర్‌లో ఉంటుంది. సాధారణంగా మేం ఎక్కువ ఎత్తులో ఎగురుతుంటామని మీరు చదువుకునే ఉంటారు. మాలో ఉన్న అన్ని రకాల్లో కంటే నేను మరింత ఎత్తుకు వెళ్లగలను. ఎలాంటి వాతావరణంలోనైనా అలవాటు పడిపోతాను. కొండ ప్రాంతాలైతే కాస్త ఎక్కువ ఇష్టం అనుకోండి. మా జాతి పక్షులన్నీ నదీ తీర ప్రాంతాల్లోనే గూళ్లను నిర్మించుకుంటాయి. 

 

మనుషులకు దూరంగా..  

మా జాతిలో మొత్తం దాదాపు 60 రకాలు ఉంటాయి. అందులో ఎక్కువ వేటాడే స్వభావం కలిగిన వాటిల్లో నేను ఒకదాన్ని. వేగం కూడా ఎక్కువే. మనుషులు నివసించే ప్రాంతాలకు దూరంగా ఉండేలా చూసుకుంటాం. మాలో ఆడ గద్దలు మగ వాటి కంటే పెద్దగా ఉంటాయి.  

జింకలనూ వేటాడగలం..  

పగలంతా ఆహారం కోసం అన్వేషిస్తూనే ఉంటాం. రాత్రయితే ఎంచక్కా నిద్రపోతాం. మేము ఎక్కువగా గుంపులుగా వేటాడటానికి ఇష్టపడతాం. ఆ సమయంలో ఒకదానికి ఒకటి సహకరించుకుంటాం. పాములు, కుందేళ్లు, ఎలుకలు కనిపించడమే ఆలస్యం.. హాంఫట్‌ చేసేస్తాం. మీకో విషయం తెలుసా.. బలమైన గోళ్లతో జింకలను కూడా వేటాడి చంపగలం. మా కాలి గోళ్లు అంత దృఢంగా ఉంటాయి మరి.

జాతీయ పక్షిని కూడా..

రెక్కలు పూర్తిగా విప్పి, ఆకాశంలో ఎగురుతున్నప్పుడు నా శరీరం దాదాపు ఓ చిన్నపిల్లాడంత పొడవు ఉంటుంది. నా రెక్కల్లో సుమారు ఏడు వేల వరకు ఈకలు ఉంటాయి. యూరప్‌లో నన్ను ‘రాయల్‌ ఈగల్‌’ అని పిలుస్తుంటారు. వివిధ కారణాల వల్ల మా సంఖ్య చాలా వరకు తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గంటకు 128 కిలోమీటర్ల వేగంతో ఎగరగలను. మా బరువు 3.6 నుంచి 5 కిలోల వరకు ఉంటుంది. పొడవేమో 66 నుంచి 102 సెంటీమీటర్లు పెరుగుతాం. సాధారణంగా అయితే 32 ఏళ్ల వరకు, నాకు రక్షణ కల్పించి జాగ్రత్తగా చూసుకుంటే 46 ఏళ్ల వరకు బతుకుతాను. ఇంకో విషయం ఏంటంటే.. నేను మెక్సికో, జర్మనీ దేశాల జాతీయ పక్షిని కూడా. పిల్లలూ.. ఇవీ నా విశేషాలు.. మీకు నచ్చే ఉంటాయి కదూ.. ఉంటా మరి.. బై.. బై..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని