అరుదైన పక్షిని నేను...!

హాయ్‌ నేస్తాలూ... బాగున్నారా?! ఏంటి నన్ను అలా వింతగా చూస్తున్నారు. నేనెవరో మీకు తెలిసి ఉండకపోవచ్చు. అందుకే నా గురించి మీకు చెప్పి పోదామనే ఇదిగో ఇలా వచ్చాను.

Updated : 13 Aug 2023 06:36 IST

హాయ్‌ నేస్తాలూ... బాగున్నారా?! ఏంటి నన్ను అలా వింతగా చూస్తున్నారు. నేనెవరో మీకు తెలిసి ఉండకపోవచ్చు. అందుకే నా గురించి మీకు చెప్పి పోదామనే ఇదిగో ఇలా వచ్చాను. మరి నేనెవరు? నా పేరేంటి? నేను ఎక్కడ ఉంటాను? నా ప్రత్యేకతలేంటో తెలుసుకుంటారా?

నా పేరు పశ్చిమ కాపెర్‌కైల్లీ. ఇదొక్కటే కాదు.. యురేషియన్‌ కాపెర్‌కైల్లీ, వుడ్‌ గ్రౌస్‌, హీథర్‌ కాక్‌, కాక్‌ ఆఫ్‌ ది వుడ్స్‌ అనే పేర్లు కూడా ఉన్నాయి. ఎక్కువగా కాపెర్‌కైల్లీ అని పిలుస్తుంటారు. నేను యూరప్‌ ఖండానికి చెందిన పక్షిని. మాలో ఆడ పక్షుల కన్నా.. మగవే అందంగా ఉంటాయి. మగ నెమలికి ఉన్నట్లే మాకు కూడా పింఛం ఉంటుంది. కానీ మరీ అంత అందంగా ఏమీ ఉండదు. మాలో ఆడవాటికైతే ఆ మాత్రం పింఛం కూడా ఉండదు. చూడ్డానికి వేరే పక్షుల్లా కనిపిస్తాయి. ఎందుకంటే మాలో ఆడ, మగ వాటికి అసలు పోలికే ఉండదు.

బరువు ఘనం...

నేను పేరుకు పక్షినే కానీ.. పెద్దగా ఎగరలేను. ఏదైనా ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు మాత్రం రెక్కలు ఆడిస్తూ వేగంగా పరిగెత్తే ప్రయత్నం చేస్తాను. అంటే మీ దగ్గర కోడిలా అన్నమాట. నేను దాదాపు 7.2 కిలోగ్రాముల బరువుంటాను. నా రెక్కలు కూడా 90 నుంచి 125 సెంటీమీటర్ల వరకు పొడవుంటాయి. మరో విషయం ఏంటంటే.. మాలో ఆడపక్షుల కంటే మగవే బరువెక్కువ. ఆడవి 4 కిలోలు మాత్రమే తూగుతాయి. రెక్కల పొడవు కేవలం 50 నుంచి 64 సెంటీమీటర్లు ఉంటుంది. మాలో మళ్లీ దాదాపు ఎనిమిది రకాలు ఉన్నాయి. ఇవన్నీ కొన్ని చిన్న చిన్న మార్పులతో ఉంటాయి.

అప్పుడెప్పుడో...

మమ్మల్ని అప్పుడెప్పుడో 1758 సంవత్సరంలోనే కనుగొన్నారు. రష్యా, మంగోలియా, చైనాలోనూ మా ఉనికి ఉంది. అన్నట్లు చెప్పడం మరిచిపోయా... మాకో ప్రత్యేకత ఉంది తెలుసా! అదేంటంటే శీతాకాలంలో మా కాళ్ల దగ్గర కూడా ఈకలు వస్తాయి. చలి నుంచి మమ్మల్ని మేం రక్షించుకోవడానికి మాకు ప్రకృతి ప్రసాదించిన వరమన్నమాట ఈ ఏర్పాటు. శీతాకాలం ముగియగానే కాళ్ల దగ్గర ఉన్న ఈకలు రాలిపోతాయి. మాలో ఆడపక్షులు పెట్టే గుడ్లు అచ్చం కోడి గుడ్లంత పరిమాణంలో ఉంటాయి. వాటి నుంచి వచ్చే పిల్లలన్నీ తల్లిని పోలి ఉంటాయి. కాస్త పెద్దయ్యాక అందులో మగవాటికి రంగురంగుల ఈకలు, బుజ్జి పింఛం వస్తుంది. మా సంఖ్య కొన్ని దేశాల్లో ఎక్కువగా ఉంటే... మరి కొన్ని దేశాల్లో చాలా తక్కువగా ఉంది.

ఏం తింటామంటే...

మేం మొక్కల ఆకులు, మొలకలు, చిగుర్లు, బెర్రీలను తింటాం. అలా అని పూర్తి శాకాహారులం అనుకోకండి. మేం చిన్న చిన్న పురుగుల్ని కూడా తింటాం తెలుసా. మా పిల్లలకు మాత్రం మేం ఎక్కువగా పురుగుల్నే ఆహారంగా ఇస్తాం. ఎందుకంటే ఇందులో ప్రొటీన్‌ ఎక్కువగా ఉంటుంది. అవి తొందరగా పెరగాలి కదా మరి. తోడేళ్లు, నక్కలు, అడవి పిల్లులు, గద్దలు మాకు ప్రధాన శత్రువులు. మీ మనుషులతో కూడా మాకు ప్రమాదమే. ఎందుకంటే మీరు కూడా మమ్మల్ని వేటాడుతున్నారు కాబట్టి. మా సంఖ్య బాగా తగ్గిపోతుండటంతో కొన్ని దేశాల్లో మమ్మల్ని వేటాడటం నిషేధం. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ మా విశేషాలు. ఇక ఉంటామరి... బై..బై..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని