నేత్రపర్వం... ఈ పర్వతాలు!

హాయ్‌ నేస్తాలూ! మీకు ఈ వింత పర్వతాలను చూస్తుంటే... అవతార్‌ సినిమాలోని పండోరా గ్రహం గుర్తుకు వస్తోంది కదూ. నిజానికి ఆ సినిమాలో చూపించిన తేలియాడే పర్వతాలకు ఇవే స్ఫూర్తట.

Published : 14 Aug 2023 00:21 IST

హాయ్‌ నేస్తాలూ! మీకు ఈ వింత పర్వతాలను చూస్తుంటే... అవతార్‌ సినిమాలోని పండోరా గ్రహం గుర్తుకు వస్తోంది కదూ. నిజానికి ఆ సినిమాలో చూపించిన తేలియాడే పర్వతాలకు ఇవే స్ఫూర్తట. ఇంతకీ ఈ పర్వతాల పేరేంటి? ఇవి ఎక్కడున్నాయి? వీటి ప్రత్యేకతలేంటో తెలుసుకుందామా మరి. అయితే ఇంకెందుకాలస్యం... చకచకా ఈ కథనం చదివేయండి సరేనా!

పచ్చదనం అల్లుకుని, మేఘాలను తాకేలా ఉన్న ఈ పర్వతాల పేరు తియాంజీ. ఈ మౌంటెన్స్‌ చైనాలోని హునాన్‌ ప్రావిన్స్‌లో ఉన్నాయి. ఇవి సున్నపురాయితో ఏర్పడ్డాయి. మంచుతెరల మధ్య ఇవి మైమరిపిస్తాయి. అందుకే వీటిని వీక్షించేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తుంటారు. హుయాంగ్‌ షీ గ్రామం నుంచి కేబుల్‌ కార్‌లో విహరిస్తూ ఈ తియాంజీ పర్వతాలను చూడొచ్చు. వీటికి 1992లో యునెస్కో గుర్తింపు లభించింది. ఈ పర్వతాల్లో ఎత్తైన శిఖరం కున్‌లున్‌ పీక్‌ సముద్ర మట్టం నుంచి సుమారు... 1,262.5 మీటర్ల ఎత్తులో ఉంది. శిలన్యు అనే శిఖరం దాదాపు 534 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ పర్వతాల్లో ఇదే అతి తక్కువ ఎత్తైన శిఖరం. తియాంజీ మౌంటెన్స్‌ సుమారు 67 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్నాయి.

అప్పుడెప్పుడో..

తియాంజీ పర్వతాలు సుమారు 300 మిలియన్‌ సంవత్సరాలకు పూర్వమే ఏర్పడ్డాయి. ఈ ప్రాంతమంతా చాలా అందంగా కనువిందు చేస్తుంది. ముఖ్యంగా వర్షాలు పడ్డ తర్వాత ఈ పర్వతాల్లో పొగమంచు కమ్ముకుంటుంది. అప్పుడు భూలోక స్వర్గంలా కనిపిస్తుంది. ఇంతకీ తియాంజీ అంటే ఏంటో తెలుసా... ‘స్వర్గలోకపు కుమారుడు’ అని అర్థం.

ఎటు చూసినా... పచ్చదనం

ఇక్కడ అత్యధికంగా 30 డిగ్రీల ఉష్ణోగ్రత, అత్యల్పంగా 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. అందుకే ఎటు చూసినా పచ్చదనమే అల్లుకుని ఉంటుంది. ఇంకా ఈ పర్వతాల్లో బోలెడన్ని జలపాతాలు, సున్నపురాయి గుహలు, సరస్సులూ ఉన్నాయి. ఏప్రిల్‌, మే, సెప్టెంబర్‌, అక్టోబర్‌ మాసాల్లో ఈ పర్వతాలు మరింత అందంగా కనిపిస్తాయి. అందుకే దేశవిదేశాల నుంచి పర్యాటకులు వచ్చి సందడి చేస్తుంటారు. నేస్తాలూ మొత్తానికి ఇవీ తియాంజీ విశేషాలు. భలే ఉన్నాయి కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని