కళ్లు కదిపి... మాటలు క‘లిపి’...!

మనలో ఎవరైనా సరే... సాధారణంగా నోటితో మాట్లాడతారు. కొందరు సైగల ద్వారా సమాచారాన్ని తెలియజేస్తారు. కానీ జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌లోని జిల్లా పరిషత్‌ పాఠశాల విద్యార్థులు కళ్లు, చెవుల కదలికలతో భావాలు పంచుకునేలా ఏకంగా ప్రత్యేక లిపినే రూపొందించారు.

Updated : 15 Aug 2023 05:38 IST

నేత్రాలు చూస్తాయి.... చెవులు వింటాయి... కానీ వీళ్లు కళ్లతో మాట్లాడతారు! చెవులతోనూ సమాచారాన్ని చేరవేస్తారు! అసలు ఇదంతా ఎలా సాధ్యం.. అనే అనుమానం వస్తోంది కదూ... అయితే ఇంకెందుకాలస్యం వెంటనే ఈ కథనం చదివేయండి.

మనలో ఎవరైనా సరే... సాధారణంగా నోటితో మాట్లాడతారు. కొందరు సైగల ద్వారా సమాచారాన్ని తెలియజేస్తారు. కానీ జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌లోని జిల్లా పరిషత్‌ పాఠశాల విద్యార్థులు కళ్లు, చెవుల కదలికలతో భావాలు పంచుకునేలా ఏకంగా ప్రత్యేక లిపినే రూపొందించారు. నోరు, ధ్వని, సైగలతో సంబంధం లేకుండా ఎదుటివారికి చెప్పాలనుకున్న విషయాన్ని కళ్లు, చెవుల కదలికలతోనే తెలియజేస్తూ అందరి ప్రసంశలూ పొందుతున్నారు. ఇటీవలే తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సైతం ఈ పిల్లలను అభినందించారు.  

వినూత్న ఆలోచన నుంచి...

ఏటా జరిగే సైన్స్‌ఫేర్‌కు విద్యార్థులు వినూత్న ఆలోచనతో వెళ్లేలా మహదేవపూర్‌ జడ్పీ ఉన్నత పాఠశాల సైన్స్‌ ఉపాధ్యాయుడు మధు ప్రోత్సహించేవారు. ఈ సంవత్సరం నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శనలో కొత్తగా ఏం చేస్తే బాగుంటుందని.. విద్యార్థులతో చర్చిస్తున్నప్పుడు వచ్చిన ఆలోచనే కళ్లు, చెవులతో మాట్లాడే కళ. ఆలోచనైతే వచ్చింది కానీ... దీన్ని అమలు చేయడం చాలా కష్టం. పదో తరగతి విద్యార్థినులైన ఎస్‌.దేవిక, ఎ.మల్లిక, ఎనిమిదో తరగతి విద్యార్థులైన ఎ.రాజశేఖర్‌, ఎం.శివ నవదీప్‌ ఇందుకోసం ముందుకు వచ్చారు.

సొంతంగా లిపి...

వీరికి ఉపాధ్యాయుడు మధు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. కళ్లు కదిలించడం తేలికే. కానీ చెవుల్ని కదిలించడం చాలా కష్టం. కానీ కొందరు తేలిగ్గా చెవులనూ కదిలించగలరు. తమ విద్యార్థుల్లో అటువంటి వారిని గుర్తించి వారికి ఇందులోనూ ప్రత్యేక శిక్షణ అందించారు. తర్వాత సొంతంగా లిపిని రూపొందించారు. ఈ కళలో కళ్లు లేదా చెవులను అటూ ఇటూ కదిలిస్తారు. ఒక్కో కదలికకు కోడింగ్‌ రూపంలో ఒక్కో ఆంగ్ల అక్షరాన్ని కేటాయించారు. ఈ కోడింగ్‌ తెలిసిన వారు చెవులు, కళ్ల కదలికలతో విషయం అర్థం చేసుకుంటారు.

ప్రశంసలే... ప్రశంసలు..

వీళ్లు చేసిన వినూత్న ప్రయోగానికి జిల్లా, రాష్ట్ర స్థాయి సైన్స్‌ఫేర్‌లలో ప్రశంసలు దక్కాయి. చూసిన వాళ్లంతా ముందు అవాక్కయ్యారు. తర్వాత అభినందనలతో ముంచెత్తారు. ప్రస్తుతం గారడీ విద్య, ఐబ్రోస్‌ కోడింగ్‌, లిప్‌ రీడింగ్‌ వంటి వాటిలో శిక్షణ పొందుతున్నారు. ఇటీవలే వీరు గవర్నర్‌ను కలిసి తమ ప్రాజెక్టు గురించి వివరించారు. విద్యార్థుల తెలివికి గవర్నర్‌ ముచ్చటపడ్డారు. భవిష్యత్తులో మరింతగా రాణించాలని ఆశీర్వదించారు. ఎంతైనా మహదేవపూర్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు గ్రేట్‌ కదూ!

సోగల స్వామి, ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని