బుడి బుడి అడుగులు.. ప్రతిభతో మెరుపులు!

అలవోకగా పద్యాలు చెబుతుంది.. చక్కగా పాటలు పాడుతుంది.. అందుకు తగినట్లు డ్యాన్సూ చేసేస్తుంది.. మంచేదో చెడేదో కూడా తానే  వరిస్తుంది.. అంతా చేస్తే.. ఆ చిన్నారి వయసు మూడున్నరేళ్లే.

Updated : 16 Aug 2023 06:07 IST

అలవోకగా పద్యాలు చెబుతుంది.. చక్కగా పాటలు పాడుతుంది.. అందుకు తగినట్లు డ్యాన్సూ చేసేస్తుంది.. మంచేదో చెడేదో కూడా తానే  వరిస్తుంది.. అంతా చేస్తే.. ఆ చిన్నారి వయసు మూడున్నరేళ్లే. ఇంతకీ ఆ నేస్తం ఎవరో, ఆ విశేషాలేంటో తెలుసుకుందామా..!!

హైదరాబాద్‌కు చెందిన ఆవుల నీలమేఘనాథ్‌, అనిత దంపతుల కూతురు ఆయు చార్వి. ఆ పాపకు ప్రస్తుతం మూడున్నరేళ్లు. వచ్చీరాని పదాలతో ముచ్చటగా మాట్లాడే ఈ చిరుప్రాయంలోనే అద్భుత ప్రతిభ చూపుతోంది. రైమ్స్‌, శ్లోకాలు, పద్యాలు, పాటలు.. ఇలా ఒక్కటేమిటి.. వివిధ అంశాలపైన అవగాహనతో ప్రతి ఒక్కరినీ అబ్బురపరుస్తోంది. సోషల్‌ మీడియా వేదికగా తన ప్రతిభను చూపుతూ.. లైకులూ, లక్షలాది వ్యూస్‌తోపాటు ప్రశంసలూ అందుకుంటోంది.

తండ్రి చొరవతో..

ఏడాది వయసున్నప్పుడే పాపలోని చలాకీతనాన్ని తల్లిదండ్రులు గుర్తించారు. ఏ అంశాన్నైనా ఒక్కసారి చెబితే చాలు.. టక్కున గుర్తుంచుకుంటున్నట్లు వాళ్లు గమనించారు. దాంతో తమ కూతురికి జ్ఞాపకశక్తి కూడా ఎక్కువేనని తెలుసుకున్నారు. తనలోని ప్రతిభను అందరికీ తెలియజేయాలని నిర్ణయించుకున్నారు. తండ్రి ప్రత్యేక చొరవ తీసుకొని మరీ.. చిన్న చిన్న పద్యాలు, ఆధ్యాత్మిక శ్లోకాలు, పాటలు నేర్పించడం ప్రారంభించారు. అలా తక్కువ సమయంలోనే వాటన్నింటినీ గడగడా నేర్చేసుకుందీ నేస్తం.

మిలియన్లలో వ్యూస్‌..  

ప్రస్తుతం ఎల్‌కేజీ చదువుతున్న చార్వి.. ఏడాది నుంచి సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటోంది. ఏదైనా అంశాన్ని పిల్లలతో చెప్పిస్తేనే, చిన్నారులు వింటారని చార్వి తల్లిదండ్రులు నమ్మారు. దాంతో చిన్నపిల్లలకు ఏది మంచో, ఏది చెడో అవగాహన కల్పిస్తూ.. నృత్యాలు, రైమ్స్‌తో తెలుగు, ఆంగ్లంలో వీడియోలు చేయించడం ప్రారంభించారు. వాటిన్నింటినీ ఇన్‌స్టాలో పోస్టు చేయసాగారు. శుక్లాంబరధరం, మృత్యుంజయ మంత్రాలను టకటకా చెప్పేస్తుంది. వందేమాతరం, జనగణమన గుక్కతిప్పుకోకుండా ఆలపిస్తోంది. ఏడాది కాలంలోనే ఈ చిన్నారి తన బోసి నవ్వులతో 1.14 లక్షల మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకుంది. పిల్లలతోపాటు పెద్దలూ చార్వి వీడియోలను ఆసక్తిగా చూస్తుంటారు. కొన్ని వీడియోలకు మిలియన్ల కొద్దీ వ్యూస్‌ ఉన్నాయి.

రోజూ బడికెళ్తూనే..

‘సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటుంటే, మరి చదువు సంగతేంటి?’ అనే సందేహం మీకు వచ్చే ఉంటుంది. చదువుపైన పూర్తి శ్రద్ధ చూపే చార్వి.. క్రమం తప్పకుండా స్కూల్‌కి వెళ్తుందట. పాఠశాల నుంచి ఇంటికొచ్చాక.. ప్రతి రోజూ రెండు గంటలపాటు గ్రాఫిక్‌ డిజైనర్‌గా పనిచేసే తండ్రే, ఆమెకు ఏ అంశాలపైన వీడియోలు చేస్తే బాగుంటుందో చెప్తుంటారట. అంతేకాదు.. ఆ విషయాలన్నీ ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా గమనించిన తర్వాత, తానే స్వయంగా చేసేస్తుంది. బెల్లంపల్లిలోని టేకులబస్తీలో ఉండే అమ్మమ్మ వాళ్ల ఇంటికి వచ్చినప్పుడు కూడా అక్కడి విషయాలపైన రీల్స్‌ చేస్తుంది. తల్లి కూడా స్వయం ఉపాధి పొందుతూనే.. పాప కాస్ట్యూమ్‌, మేకప్‌ విషయాలన్నీ చూసుకుంటుంది. చిన్న వయసులోనే అంత ఫాలోయింగ్‌ సంపాదించిన చార్వి గ్రేట్‌ కదూ!  

ముత్తె వెంకటేశం, న్యూస్‌టుడే, బెల్లంపల్లి పట్టణం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని