ఇది విచిత్రమై‘నది’!

నది అనగానే మనకు గలగలపారే నీళ్లు గుర్తుకు వస్తాయి. పరుచుకున్న ఇసుక తిన్నెలు మదిలో మెదులుతాయి. కానీ ఓ నదిలో ఇవేమీ ఉండవు. కేవలం రాళ్లే కనిపిస్తాయి.

Updated : 18 Aug 2023 03:56 IST

నది అనగానే మనకు గలగలపారే నీళ్లు గుర్తుకు వస్తాయి. పరుచుకున్న ఇసుక తిన్నెలు మదిలో మెదులుతాయి. కానీ ఓ నదిలో ఇవేమీ ఉండవు. కేవలం రాళ్లే కనిపిస్తాయి. మరి విచిత్రమైన ఆ నది పేరేంటి? అది ఎక్కడుందో తెలుసుకోవాలని ఉందా?! ఇంకెందుకాలస్యం... చకచకా ఈ కథనం చదివేయండి.

దుల్లో అక్కడక్కడా రాళ్లు కనిపించడం మామూలే. కానీ ‘బిగ్‌ స్టోన్‌ రివర్‌’ మాత్రం, ఓ ఆరు కిలోమీటర్ల వరకు మొత్తం రాళ్లతోనే నిండి ఉంటుంది. అది కూడా ఎవరో పేర్చినట్లు! ఈ నది రష్యాలో యూరల్స్‌లోని టాగనేయ్‌ పర్వతాల్లో పుట్టి కొన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఆ ఆరు కిలోమీటర్లలో ఒక్కో చోట 200 మీటర్ల వెడల్పు ఉంటుంది. మరి కొన్నిచోట్ల 700 మీటర్ల వరకు ఉంటుంది. కనుచూపు మేర రాళ్లు తప్ప గ్లాసుడు నీళ్లు కూడా సరిగా కనిపించవు.

గలగల పారుతూ...

నీటి ప్రవాహం ఈ రాళ్ల కిందుగానే సాగుతుంది. దగ్గరికి వెళ్తే గలగలమనే నీటి శబ్దమూ మనకు వినిపిస్తుంది. కానీ ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఈ నదిలో నీళ్లు రాళ్లను దాటి బయటకు రాలేదు. నిజంగా ఇది ప్రకృతి వింతే. అందుకే ఈ విచిత్ర నదిని వీక్షించడానికి ఏటా వేలసంఖ్యలో పర్యాటకులు వెళ్తుంటారు.

కొన్ని వేల ఏళ్ల క్రితం...

ఈ నదిలో కొన్ని వేల ఏళ్ల క్రితమే రాళ్లు ఏర్పడ్డాయి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం... అప్పట్లో టాగనేయ్‌ పర్వతాలు పూర్తిగా మంచుతో కప్పబడి ఉండేవి. ఆ పర్వతాల ఎత్తు దాదాపు 15 వేల అడుగులకు పైనే ఉండేది. మంచు బరువు వల్ల రాళ్లు, ముక్కలు ముక్కలయ్యాయి. కాలక్రమంలో మంచు కరగడం ప్రారంభమైన తర్వాత రాళ్లన్నీ బయట పడ్డాయి. నీటి ప్రవాహ వేగానికి అవన్నీ జారుతూ నదిలో పేర్చినట్లుగా పేరుకుపోయాయి.

మెరుస్తూ... కనిపిస్తాయి!

చూడ్డానికి మొత్తం రాళ్లే కనిపిస్తే ఈ నది ఎండిపోయిందేమో అనుకునేరు. ఇప్పటికీ ఈ రాళ్ల మధ్య నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. కొన్ని చోట్ల చాలా పెద్ద పెద్ద రాళ్లు సైతం ఉన్నాయి. వాటి బరువు ఏకంగా టన్నుల్లోనే ఉంటుంది. ఈ రాళ్లలో సిలికా, ఐరన్‌ ఉంది. అందుకే ఇవి మెరుస్తూ కనిపిస్తాయి. దూరం నుంచి చూస్తే నదిలో రాళ్లు ప్రవహిస్తున్న అనుభూతి కలుగుతుంది. కానీ నిజానికి రాళ్లు కదలకుండా అలాగే స్థిరంగా ఉంటాయి. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ ‘బిగ్‌ స్టోన్‌ రివర్‌’ విశేషాలు. భలే ఉన్నాయి కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని