ఇది ఇంద్రభవనం కాదు..!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మనం సినిమాకో, షాపింగ్‌ మాల్‌కో వెళ్తుంటాం కదా.. వాటిల్లో టాయిలెట్లు ఎలా ఉంటాయో మీకు తెలిసే ఉంటుంది. ఒకటీ రెండు బాగున్నా... చాలావరకూ అధ్వానంగానే ఉంటాయి.

Updated : 19 Aug 2023 06:34 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మనం సినిమాకో, షాపింగ్‌ మాల్‌కో వెళ్తుంటాం కదా.. వాటిల్లో టాయిలెట్లు ఎలా ఉంటాయో మీకు తెలిసే ఉంటుంది. ఒకటీ రెండు బాగున్నా... చాలావరకూ అధ్వానంగానే ఉంటాయి. ఇక పబ్లిక్‌ టాయిలెట్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదనుకుంటాం. అయితే, ఓ చోట మాత్రం వాటికి భిన్నంగా ఇంద్రభవనాన్ని తలపించేలా నిర్మించారు. ఇంతకీ అదెక్కడో, దాని విశేషాలేంటో తెలుసుకుందాం రండి..!

ఇప్పుడంటే చైనా అనగానే మనకు కరోనా గుర్తుకొస్తుంది కానీ, మొన్నటివరకూ తక్కువ ధరలో లభించే ఎలక్ట్రానిక్‌ వస్తువులే మనకు స్ఫురించేవి. ఇప్పుడు మరో విషయంలోనూ మన పొరుగు దేశం వార్తల్లో నిలిచింది. అదేంటంటే.. ఓ షాపింగ్‌ మాల్‌లో ధగధగలాడేలా టాయిలెట్‌ నిర్మాణం.

  • నాన్జింగ్‌ నగరంలోని ఓ బహుళ అంతస్తుల షాపింగ్‌ మాల్‌లో అడుగుపెట్టిన వారిలో ఎక్కువమంది నేరుగా ఆరో ఫ్లోర్‌కే వెళ్తున్నారట. అక్కడ ఇటీవలే రాజభవనాన్ని తలపించేలా జిగేల్‌ జిగేల్‌మనే ఓ టాయిలెట్‌ను నిర్మించారు మరి. ఆ అంతస్తులోకి అడుగు పెట్టగానే ఓ పెద్ద కారిడార్‌ కనిపిస్తుంది. దానికి రెండువైపులా మొక్కలు ఉండి, పైన భాగంతోపాటు చుట్టుపక్కల నుంచి ఎల్‌ఈడీ లైట్ల వెలుగులు విరజిమ్ముతుంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఆ కారిడార్‌లో నడుచుకుంటూ వెళ్తుంటే.. గార్డెన్‌లో ఉన్నట్లే అనిపిస్తుందట. కొంతదూరంలో పువ్వుల రేకుల మాదిరి డిజైన్‌ చేసిన సోఫాలు కనిపిస్తాయి. టాయిలెట్‌కి వెళ్లిన వారు బయటకు వచ్చే వరకూ ఇక్కడ కూర్చొని హాయిగా ఎదురుచూడొచ్చట. పురుషులకూ, మహిళలకూ వేర్వేరు థీమ్‌లతో డిజైన్‌ చేశారు. అంతేకాదు.. చిన్న పిల్లలూ ఉపయోగించుకునేలా ఫ్లెక్సిబుల్‌ వాష్‌బేసిన్లను ఏర్పాటు చేశారు. అంటే.. వారి ఎత్తుకు అనుగుణంగా వాటిని పైకీ, కిందకూ జరుపుకోవచ్చన్నమాట. అంతేకాదు.. ఈ వాష్‌బేసిన్ల డిజైన్‌ కూడా ఫౌంటెయిన్లను పోలి ఉంటుంది. ‘నిత్యం వివిధ రకాల పని ఒత్తిళ్లతో సతమతమయ్యే వారు సేదతీరేలా ఈ టాయిలెట్లను రూపొందించాం. ఎవరైనా వీటిని ఉయోగించుకోవచ్చు. షాపింగ్‌ మాల్‌కు వచ్చే కస్టమర్లకు సౌకర్యవంతంగా ఉండేలా, నిర్వాహకుల సూచన మేరకు ఇంత భారీగా తీర్చిదిద్దాం’ అని దీన్ని డిజైన్‌ చేసిన సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. నేస్తాలూ.. ఇక్కడ ఫొటోలు చూస్తుంటేనే కళ్లు మిరుమిట్లుగొలుపుతున్నాయి కదూ.!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు