బోలెడన్ని.. చాక్లెట్‌ కొండలోచ్‌!

ఆగండి.. ఆగండి.. నేస్తాలూ! చాక్లెట్‌ కొండలు అనగానే ఎంచక్కా తినేయొచ్చు అనుకోకండి. ఎందుకంటే, అవి నిజంగా చాక్లెట్లు కావు.

Updated : 20 Aug 2023 05:12 IST

ఆగండి.. ఆగండి.. నేస్తాలూ! చాక్లెట్‌ కొండలు అనగానే ఎంచక్కా తినేయొచ్చు అనుకోకండి. ఎందుకంటే, అవి నిజంగా చాక్లెట్లు కావు. ‘మరి ఇంతకీ అవేంటి? చాక్లెట్లు కానప్పుడు అలా అనడం ఎందుకో?!’ అనే అనుమానం మీకు ఈపాటికే వచ్చి ఉంటుంది కదూ! అయితే ఇంకెందుకాలస్యం? ఈ కథనం చదివేయండి.. మీకే తెలుస్తుంది, అసలు విషయం ఏంటో... ఇంకా ఈ విశేషాలేంటో!

ఫిలిప్పీన్స్‌లోని బోహెల్‌ ప్రావిన్స్‌లో ఉన్నాయీ  చాక్లెట్‌ కొండలు. 50 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దాదాపు 1,776 కొండలున్నాయి. వీటిని చూడడానికి దేశవిదేశాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. కనుచూపుమేర అంతా పచ్చదనం పరచుకొని ఉంటుంది. కోన్‌ ఆకారంలో ఉన్న ఈ కొండలు కనువిందు చేస్తాయి. వేసవిలో మాత్రం వాటి మీద ఉన్న గడ్డి ఎండిపోయి ఈ కొండలు గోధుమ రంగులోకి మారతాయి. అందుకే వీటికి ‘చాక్లెట్‌ హిల్స్‌’ అనే పేరు వచ్చింది.

వేల ఏళ్ల క్రితం...

ఈ కొండలు దాదాపు 30 నుంచి 50 మీటర్ల ఎత్తు ఉంటాయి. వీటిలో ఓ కొండైతే ఏకంగా 120 మీటర్లు ఉంది. ఈ చాక్లెట్‌ హిల్స్‌లో ఇదే అత్యంత ఎత్తైనది. నిజానికి ఈ కొండలన్నీ సున్నపురాయితో ఏర్పడ్డాయి. కొందరు శాస్త్రవేత్తల అంచనా ప్రకారం... ఇవి నిజానికి కొన్ని వేల సంవత్సరాల క్రితం పగడపు దిబ్బలు. భూ ఫలకాల కదలికల వల్ల ఇలా పైకి వచ్చాయి. కాలక్రమేణా వాన, వాతావరణ ప్రభావం వల్ల ఇలా కోన్‌ ఆకృతిని పొందాయట.

తవ్వకాలతో చేటు...

ఈ ప్రకృతి సిద్ధమైన చాక్లెట్‌ కొండల్ని జాతీయ సంపదగా ప్రకటించినప్పటికీ వాటికి ముప్పు తప్పడం లేదు. ఈ కొండల్లో విపరీతమైన మైనింగ్‌ వల్ల అవి తమ అందాన్ని కోల్పోతున్నాయి. అలాగే 2013లో వచ్చిన ఓ భూకంపానికి ఈ చాక్లెట్‌ కొండలు ప్రభావితమయ్యాయి. స్థానిక ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు వెచ్చించి నష్ట నివారణ చర్యలు తీసుకుంది. అలాగే పెద్ద సంఖ్యలో వచ్చే పర్యాటకుల కోసం నడక దారులు, పార్కింగ్‌ స్థలాలు, నీటి సౌకర్యం, మెట్లు, ఫుడ్‌ కోర్టులు ఏర్పాటు చేసింది. ఓ మ్యూజియాన్నీ అందుబాటులోకి తెచ్చింది. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ చాక్లెట్‌ కొండల విశేషాలు.. భలే ఉన్నాయి కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు