రాస్తే ‘ముత్యాలు’ రాలాయి!

కరీంనగర్‌కు చెందిన వైద్య దంపతులు  నరేంద్ర పటేల్‌, దివ్యశ్రీల ప్రథమ కుమారుడే స్నితిక్‌ పటేల్‌. ప్రస్తుతం అయిదో తరగతి చదువుతున్నాడు. పదకొండేళ్ల పసిప్రాయంలోనే ఏకంగా పన్నెండు ముత్యాల్లాంటి కథలు రాశాడు.

Published : 21 Aug 2023 00:03 IST

పసిప్రాయంలోనే కలం కదిలించాడు... తన ఊహలకు రెక్కలు తొడిగాడు... ఆలోచనలతో అడుగులు వేయించాడు... భావాలకు అక్షర రూపం ఇచ్చాడు... తల్లి కష్టాన్నే కథగా మలిచాడు ‘నవ్వితే ముత్యాలు రాలు’ అన్నట్లు... ఈ బుడతడు రాస్తే రాలాయి!! మరి ఆ చిరు రచయిత ఎవరో... ఏంటో.. తెలుసుకుందామా!!

కరీంనగర్‌కు చెందిన వైద్య దంపతులు నరేంద్ర పటేల్‌, దివ్యశ్రీల ప్రథమ కుమారుడే స్నితిక్‌ పటేల్‌. ప్రస్తుతం అయిదో తరగతి చదువుతున్నాడు. పదకొండేళ్ల పసిప్రాయంలోనే ఏకంగా పన్నెండు ముత్యాల్లాంటి కథలు రాశాడు. పాఠశాలలో జరిగే కథల పోటీల్లో పాల్గొన్న ప్రతిసారీ ప్రతిభ కనబరిచి, అందరి అభినందనలు పొందేవాడు. అదే స్ఫూర్తితో అప్పటి వరకూ తాను గ్రహించిన విషయాలనే కథల రూపంలోకి మార్చాడు. ఒక్కో కథను ఒక్కో భావజాలంతో రాశాడు.

అమ్మకు ప్రేమతో...

అమ్మ దివ్యశ్రీ ఆసుపత్రిలో వైద్యురాలిగా విధులు నిర్వహిస్తూనే, ఇంటిని ఎలా చక్కదిద్దుతుందో, పిల్లలను ఎలా చూసుకుంటుందో వివరిస్తూ ‘ఏ హ్యాండ్‌ వర్కింగ్‌ మదర్స్‌ లవ్‌’ కథ రాశాడు. దీని ద్వారా ఉద్యోగం చేస్తూ పిల్లలను చూసుకునే ప్రతి తల్లి కష్టాన్ని తెలియజేశాడు. ది అర్బన్‌, సాల్ట్‌ ఇష్యూ, సాల్ట్‌ ఇష్యూ-2, ది జస్టిస్‌, అడ్వంచర్‌ ఆఫ్‌ రాంసింగ్‌, ఏ వారియర్‌, 3070, ది డాక్టర్‌, ఏ హ్యాండ్‌ వర్కింగ్‌ మదర్స్‌ లవ్‌, అవర్‌ నేచర్‌, ది మ్యాంగో ట్రీ, ది రైట్‌పుల్‌ కింగ్‌... వంటి కథలను ‘‘ది 12 పెరల్స్‌’’ పేరుతో పుస్తకంగా మలిచాడు. ఈ కథలను చదివిన ప్రముఖులు ఇంత చిన్న వయసులోనే చేయి తిరిగిన రచయితలా, ఎంతో ఉన్నతంగా రాశాడంటూ అభినందించారు.

ప్రశంసలే... ప్రశంసలు!

ఇలా స్నితిక్‌ చిన్న వయసులోనే అందరినీ ఆలోచింపజేసే రచనలు చేస్తూ.. ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ‘బాలరత్న’ అవార్డును సైతం సొంతం చేసుకున్నాడు. అలాగే ఓ సంస్థ తరఫున రాష్ట్ర స్థాయి ‘బాలమేధావి’ అవార్డునూ కైవసం చేసుకున్నాడు. కరీంనగర్‌ జిల్లా పూర్వ పాలనాధికారి ఆర్వీ కర్ణన్‌ ‘ది 12 పెరల్స్‌’కు ముందు మాట రాశారు. పుస్తకాన్ని మొత్తం చదివి ‘భవిష్యత్తులో ఎన్నో మంచి రచనలు నీ నుంచి ఆశిస్తున్నాం’ అన్నారు. ఈ పుస్తకాన్ని పూర్వ అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌ ఆవిష్కరించారు.

‘అమ్మమ్మే ఆదర్శం’

‘మా అమ్మమ్మ పత్తెం వసంత. ఆమె ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ ఎన్నో రచనలు చేశారు. ఆవిడ రచనలు, పుస్తక సమీక్షలు చదువుతున్నప్పుడు నాకు కథలపై ఆసక్తి ఏర్పడింది. అంతే కాకుండా అమ్మమ్మ తన వెంట పుస్తకావిష్కరణలకు నన్ను తీసుకెళ్లేవారు. ఎంతోమంది ప్రముఖ సాహితీవేత్తలను చూసి నాకూ అలా రాయాలి అనిపించింది. అమ్మ, నాన్న ఇద్దరూ వైద్యులు కావడంతో కరోనా సమయంలో నన్ను, తమ్ముణ్ని అమ్మమ్మ దగ్గర వదిలిపెట్టారు. ఆ సమయంలో రాయడం మొదలు పెట్టాను. అమ్మమ్మ అవి చదివి నన్ను ఎంతో మెచ్చుకున్నారు. అప్పుడే నాలో ఇంకా మంచి కథలు రాయాలనే ఆరాటం మెదలైంది. కరోనా సమయంలో అమ్మమ్మ దగ్గర ఉంటూ దాదాపు 20 కథలు రాశాను. వాటిలో 12 కథలను అమ్మమ్మ ఎంపిక చేసింది. వాటినే పుస్తకంగా ప్రచురించారు. నాకు రచనలు చేయడంపై ఆసక్తిని కలిగించింది, ఆదర్శంగా నిలిచింది అమ్మమ్మ. మా అమ్మ, నాన్న నన్ను ఎంతగానే ప్రోత్సహించేవారు. భవిష్యత్తులో సమాజానికి సేవ చేసే పోలీస్‌ కావాలని నిర్ణయించుకున్నా. ఖాళీ సమయంలో మాత్రం రచనలు చేస్తూ ఉంటాను.’ అని స్నితిక్‌ తన ముద్దు ముద్దు మాటలను ‘హాయ్‌బుజ్జీ’తో పంచుకున్నాడు. మరి ఈ చిన్నారి ఆశయం నెరవేరాలని మనమూ మనసారా కోరుకుంటూ... తనకు ఆల్‌ ది బెస్ట్‌ చెబుదామా నేస్తాలూ!

కొర్ను సాయి,ఈనాడు పాత్రికేయ పాఠశాల


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు