పిట్ట కొంచెం... ధైర్యం ఘనం!

గుప్పెడంత పిట్ట... బుల్లి పిట్ట... బుజ్జి పిట్ట... కానీ.. దమ్మున్న పిట్ట... ధైర్యమున్న పిట్ట... మొసలితో స్నేహంగా మసలే.. లౌక్యమున్న పిట్ట... ఏకంగా మకరం నోట్లోకి వెళ్లి, దర్జాగా బయటకు వచ్చే పిట్ట..! ఇంతకీ ఆ పిట్ట పేరేంటో.. దాని సంగతులేంటో...? తెలుసుకుందామా నేస్తాలూ!

Published : 23 Aug 2023 01:02 IST

గుప్పెడంత పిట్ట... బుల్లి పిట్ట... బుజ్జి పిట్ట... కానీ.. దమ్మున్న పిట్ట... ధైర్యమున్న పిట్ట... మొసలితో స్నేహంగా మసలే.. లౌక్యమున్న పిట్ట... ఏకంగా మకరం నోట్లోకి వెళ్లి, దర్జాగా బయటకు వచ్చే పిట్ట..! ఇంతకీ ఆ పిట్ట పేరేంటో.. దాని సంగతులేంటో...? తెలుసుకుందామా నేస్తాలూ!

నకు మొసలి అంటే భలే భయం కదూ! దాని పేరు విన్నా చాలు ఒంట్లో వణుకు పుడుతుంది. అది దాడి చేస్తే, బతకడం దాదాపు అసాధ్యం. పెద్ద పెద్ద ఏనుగులు సైతం మొసలంటే బెంబేలెత్తుతాయి. మరి అలాంటి మకరంతో ఓ పక్షి స్నేహం చేస్తోంది. అదేం విచిత్రమో... కొన్నిసార్లు పొరపాటునో, గ్రహపాటునో తన తోటి మకరాన్నీ తినకుండా వదలని మొసలి... ప్లోవర్‌ పక్షిని మాత్రం ఏమీ చేయదు. నీట్లోంచి ఒడ్డుకు వచ్చి సేదతీరే మొసలి నోట్లోనే ఎంచక్కా... ఈ పిట్ట మకాం వేస్తుంది. అయినా... మొసలి ఆ నేస్తానికి ఏ హానీ చేయదు సరికదా.. అది తిరిగి ఎగిరిపోయేంత వరకూ బుద్ధిగా నోరు తెరుచుకునే ఉంటుంది.

ఇదో డెంటిస్టు...!

అసలు నీటిలోని మొసలికి, గాల్లోని ప్లోవర్‌ పక్షికి స్నేహం ఎలా కుదిరిందో తెలుసా...! మొసలి మాంసాహారి కదా.. అది ఏదైనా జంతువుపై దాడి చేసి తిన్నాక, కొంత మాంసం దాని దంతాల్లో చిక్కుకుపోయి ఉంటుంది. దాన్ని అలాగే వదిలేస్తే మొసలికి చిక్కులే. అలా అని అది మనలా బ్రష్‌ చేసుకోలేదు. కానీ ప్లోవర్‌ పక్షి ఎంచక్కా తన నేస్తమైన మొసలి పళ్లను తన పొడవైన ముక్కుతో శుభ్రం చేస్తుంది. అదే సమయంలో ఆ చిన్న చిన్న మాంసం ముక్కలతో తన కడుపూ నింపుకుంటుంది. అందుకే ఈ పక్షి తన ముక్కుతో మొసలి నోట్లో పొడుస్తున్నా... అది కదలకుండా, మెదలకుండా ఉంటుంది. కోళ్లు, కొంగలు, బాతుల్లాంటి పక్షులు కనబడితే మాత్రం కరకరలాడించేస్తుంది. తనకు మేలు చేసే ప్లోవర్‌ పక్షికి మాత్రం కృతజ్ఞతాభావంతో ఏ హానీ చేయదు. అంటే ఒక రకంగా ఈ పక్షి, మొసలికి డెంటిస్టులా సేవలు అందిస్తుందన్నమాట.

మొసలి పక్షి...

ప్లోవర్‌ పక్షిని ముద్దుగా ‘క్రొకొడైల్‌ బర్డ్‌’ అని పిలుస్తారు. ఈ మొసలి పక్షుల్లో మళ్లీ కొన్ని రకాలున్నాయి. మరో విషయం ఏంటంటే... ఈ పక్షులు ఆహారం కోసం కేవలం మొసళ్ల మీదే ఆధారపడవు. సొంతంగా కూడా సంపాదించుకుంటాయి. ఇవి ఎక్కువగా నీరున్న ప్రాంతాలకు దగ్గరగానే నివసిస్తుంటాయి. చిన్న చిన్న కీటకాలను తిని తమ బుజ్జి బొజ్జను నింపుకొంటాయి. ఈ పక్షులు 19 నుంచి 21 సెంటీమీటర్ల వరకు పొడవు పెరుగుతాయి.

కర్ర్‌... కర్ర్‌...  

‘పిట్ట కొంచెం.. కూత ఘనం’ అనే సామెత కూడా ఈ ప్లోవర్‌ పక్షికి సరిపోతుంది. ఎందుకంటే ఇది హై పిచ్‌లో ‘కర్ర్‌.. కర్ర్‌.. కర్ర్‌...’ అనే శబ్దం చేస్తుంది. ఈ అరుపు చాలా దూరం వరకు వినిపిస్తుంది. ఈ పక్షులకు మరో ప్రత్యేకత ఉంది తెలుసా..! వీటిలో ఆడవి రెండు లేదా మూడు గుడ్లు పెడతాయి. కానీ వాటిని పొదగనే పొదగవు. మరి వాటి నుంచి పిల్లలు ఎలా వస్తాయంటే... గుడ్లను వెచ్చని ఇసుకలో కప్పెడతాయి. అప్పుడప్పుడు మాత్రం పక్షి నీటిలో మునిగి వచ్చి, గుడ్లను కప్పెట్టిన చోట ఇసుక మీద కాసేపు కూర్చుని వస్తుంది. తన గుడ్లకు మరీ ఎక్కువ ఉష్ణోగ్రత వల్ల నష్టం కలగకుండా ఉండేందుకే ఇలా చేస్తుంది. ఈ గుడ్లలో నుంచి వచ్చిన పిల్లలు కూడా ఎక్కువగా తల్లి మీద ఆధారపడవు. వచ్చీరాగానే వేగంగా పరిగెత్తగలవు. చాలా తక్కువ సమయంలో సొంతంగా ఆహారం సంపాదించుకోవడమూ నేర్చుకుంటాయి. ఇతర జీవులతో పిల్ల పక్షులకు ఏమైనా ముప్పు ఉందనిపిస్తే తల్లి వాటిని ఇసుకతో కప్పేస్తుంది. ఇక ప్రమాదమేమీ లేదని నిర్దారించుకున్నాక, తిరిగి బయటకు తీస్తుంది. నేస్తాలూ... మొత్తానికి ఇవీ ప్లోవర్‌ పక్షి విశేషాలు. భలే ఉన్నాయి కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని