ఇది ‘కొండ మీది కొట్టు’!

హలో ఫ్రెండ్స్‌.. మనం ఏదైనా పార్కుకో, సినిమాకో వెళ్లినపుడు ఆటపాటలే కాకుండా అక్కడ నోరూరించే రకరకాల స్నాక్స్‌నీ కచ్చితంగా కొనుక్కొని తింటాం. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే దుకాణానికి వెళ్లాలంటే మాత్రం వెనకడుగేస్తాం.

Published : 24 Aug 2023 00:02 IST

హలో ఫ్రెండ్స్‌.. మనం ఏదైనా పార్కుకో, సినిమాకో వెళ్లినపుడు ఆటపాటలే కాకుండా అక్కడ నోరూరించే రకరకాల స్నాక్స్‌నీ కచ్చితంగా కొనుక్కొని తింటాం. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే దుకాణానికి వెళ్లాలంటే మాత్రం వెనకడుగేస్తాం. ఇంతకీ ఆ షాప్‌ ఎక్కడో, ఆ విశేషాలేంటో తెలుసుకుందామా..!

చైనా అంటేనే బోలెడన్ని వింతలకూ, విశేషాలకూ ప్రసిద్ధి. వాళ్ల ఆహార అలవాట్లూ అంతేననుకోండి. ఇప్పుడిదంతా ఎందుకూ అంటే.. కొండను ఆనుకొని అంతెత్తున ఏర్పాటు చేసిన దుకాణంతో మన పొరుగు దేశం మళ్లీ వార్తల్లో నిలిచింది మరి.

స్నాక్స్‌, డ్రింక్స్‌..

హునన్‌ ప్రావిన్స్‌ పరిధిలో షింన్జ్‌హై నేషనల్‌ జియోలాజికల్‌ పార్క్‌ ఉంది. అందులో ఓ పెద్ద కొండ కూడా ఉంది. ఆ కొండను ఆనుకొనే, దాదాపు 393 అడుగుల ఎత్తులో చెక్కతో చేసిన ఓ చిన్న గది ఉంది. అదేంటంటే.. ఒక చిన్న దుకాణం. అందులో స్నాక్స్‌, డ్రింక్స్‌, ఇతర ఆహార పదార్థాలు అమ్ముతారట. ‘అక్కడ ఏం అవసరం?. అంత ఎత్తుకు వెళ్లి మరీ ఎవరు కొంటారు?’ అనే అనుమానం మీకు వచ్చే ఉంటుంది కదా.. ఆ భారీ కొండను ఎక్కే పర్వతారోహకులు రిఫ్రెష్‌ అయ్యేందుకు చేసిన ఏర్పాటు అట. మౌంటెనీర్స్‌కు మధ్యమధ్యలో దాహం వేసినా, ఆకలైనా.. ఈ దుకాణంలో, వారికి కావాల్సినవి కొనుక్కోవచ్చన్నమాట. వెంటనే ‘ఇంతకీ అక్కడి వరకూ సరకులు ఎవరు తీసుకెళ్తారు రోజూ?’ అనే సందేహమూ మీకు వచ్చే ఉంటుంది కదా.. ఆ పార్కు సిబ్బందే రోజూ తీగ మార్గం (జిప్‌ లైన్‌) ద్వారా సామగ్రిని తీసుకెళ్తుంటారట.

అందరూ అవాక్కయ్యేలా..

ఇటీవల ఓ పర్యాటకుడు కొండ అంచును ఆనుకొని ఉన్న ఆ దుకాణం ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. దాంతో క్షణాల్లోనే ఈ విషయం వైరల్‌గా మారింది. ఈ దృశ్యాలు చూసిన వారంతా అవాక్కవుతూ కామెంట్ల రూపంలో రకరకాలుగా స్పందిస్తున్నారు. భయం సంగతి ఎలా ఉన్నా, వింతగా ఉండటంతోపాటు ఆ ప్రకృతి అందాలు చూసేందుకు ఆ పార్కుకు ఒక్కసారిగా పర్యాటకుల తాకిడి పెరిగిపోయిందట. మనకు ఫొటోలు చూస్తుంటేనే.. బాబోయ్‌ అని అనిపిస్తోంది కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని