చిన్ని దేహం... పే...ద్ద చెవులు!

హాయ్‌ నేస్తాలూ... బాగున్నారా! నేనో బుజ్జి నక్కను. నా చెవులు మాత్రం చాలా పెద్దగా ఉంటాయి. మామూలు నక్కలతో పోల్చుకుంటే నేను కాస్త భిన్నంగా ఉంటా.

Updated : 25 Aug 2023 05:03 IST

హాయ్‌ నేస్తాలూ... బాగున్నారా! నేనో బుజ్జి నక్కను. నా చెవులు మాత్రం చాలా పెద్దగా ఉంటాయి. మామూలు నక్కలతో పోల్చుకుంటే నేను కాస్త భిన్నంగా ఉంటా. అందుకే నా విశేషాలు చెప్పిపోదామని ఇదిగో ఇలా పరుగుపరుగున వచ్చాను.

నా పేరు ఫెన్నెక్‌ ఫాక్స్‌. నన్ను మీరు ముద్దుగా చెవుల నక్క అని పిల్చుకోండి సరేనా. నేను ఆఫ్రికాకు చెందిన జీవిని. అది కూడా సహారా ఎడారిలో మాత్రమే కనిపిస్తాను. ఆ వేడిని తట్టుకుని మనుగడ సాగించడం కోసమే నా చెవులు ఇలా పే..ద్దగా ఉంటాయి. మీకు మరో విషయం తెలుసా.. నాకు పెద్ద చెవులుండటం వల్ల భూమి లోపల బొరియల్లో ఉండే జీవులు చేసే శబ్దాలు కూడా చక్కగా వినగలను. దీంతో నాకు వాటిని వేటాడటం సులువవుతుంది. నేను కేవలం పదిహేను సెంటీమీటర్ల పొడవు పెరుగుతాను. దాదాపు కిలోన్నర వరకు మాత్రమే బరువు తూగుతాను. అంటే మీరు ఇంట్లో పెంచుకునే పిల్లి కన్నా కూడా చిన్నగా ఉంటానన్నమాట.

ఎడారికి తగ్గట్లు....!

‘ప్చ్‌... ఇంత బుజ్జి నక్క పాపం ఆ ఎడారిలో ఎలా బతుకుతుందో ఏంటో..!’ అని మీరు నా మీద జాలి చూపించాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్‌. ఎందుకంటే నా శరీర నిర్మాణం అందుకు తగ్గట్లుగానే ఉంటుంది. ముఖ్యంగా నా మూత్రపిండాల పనితీరు మిగతా నక్కలతో పోల్చుకుంటే చాలా భిన్నంగా ఉంటుంది. చాలా తక్కువ నీటిని మాత్రమే మూత్రం రూపంలో విసర్జిస్తాను. ఈ ఏర్పాటే నన్ను నీరు దొరకని ఎడారిలోనూ ఎంచక్కా బతికేలా చేస్తోంది. తీసుకునే ఆహారం నుంచే నాకు కావాల్సిన నీటిని సేకరించుకుంటాను. నీరు దొరికినప్పుడు మాత్రం గటగటా తాగేస్తాను.

కరకరలాడించేస్తా...  

నేను బల్లులు, కీటకాలు, చిన్న చిన్న జంతువులు, పక్షులు, వాటి గుడ్లను ఆహారంగా తీసుకుంటాను. కేవలం మాంసాహారమే కాకుండా.. కొన్ని రకాల పండ్లు, ఆకులు, వేర్లను కూడా తింటాను. ఇలా ఎంచక్కా నా బుజ్జి బొజ్జను నింపుకొంటాను. నేను సాధారణంగా పదేళ్ల వరకు జీవిస్తాను. అన్నీ అనుకూలిస్తే మాత్రం 14 సంవత్సరాల వరకూ బతకగలను. గద్దలు, గుడ్లగూబలంటే నాకు చాలా భయం. ఎందుకంటే నేను కనిపిస్తే చాలు అవి నామీద దాడి చేస్తాయి. అందుకే ఇసుకలో బొరియలు తవ్వుకొని వాటిలో జీవిస్తాను. నేను నిజానికి పెంపుడు జంతువును కాదు. కానీ నన్ను పెంచుకుంటున్న వాళ్లూ ఉన్నారు. నేను మచ్చిక అయితే మాత్రం బుజ్జి కుక్క పిల్లలా మీ చుట్టూనే తిరుగుతూ ఉంటాను తెలుసా. నా పెద్ద చెవులు, బొచ్చు, కుచ్చు తోక మీకు భలే ముద్దొస్తాయి అనుకోండి. అన్నట్లు హైనాలు, పెద్ద నక్కలు, కుక్కలు కూడా నాకు ప్రధాన శత్రువులే. నేస్తాలూ... మొత్తానికి ఇవీ నా విశేషాలు. ఇక ఉంటామరి... బై.. బై..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు