అనగనగా ఓ వింత అడవి!

పోలాండ్‌లోని నౌవే సజర్నోవో అనే గ్రామానికి సమీపంలో ఈ విచిత్రమైన అడవి ఉంది. ఈ అరణ్యంలోని కొన్ని వందల పైన్‌ చెట్లు 90 డిగ్రీల వరకు వంపు తిరిగి ఉంటాయి

Updated : 27 Aug 2023 05:11 IST

అనగనగా ఓ అడవి. అది కాకులు దూరని కారడవి కాదు.. చీమలు దూరని చిట్టడవీ కాదు. అలా అని సాదాసీదా అరణ్యం అంతకన్నా కాదు. అదో ప్రత్యేకమైన వనం. ఈ అడవిలో కొన్ని వందల చెట్లు దాదాపు ఒకేలా వంపు తిరిగి ఉంటాయి. ప్రపంచంలో ఇంకెక్కడా ఇలా పెరిగిన వృక్షాలు లేవు. పోనీ ఇక్కడే ఎందుకు ఇలా ఈ చెట్లు ప్రత్యేకంగా పెరిగాయంటేే... ప్చ్‌...! ఎవరికీ సరిగ్గా తెలియదు. ఇప్పటికీ ఇది ఒక మిస్టరీయే. నేస్తాలూ... మరి మనం ఆ విశేషాలేంటో తెలుసుకుందామా!

పోలాండ్‌లోని నౌవే సజర్నోవో అనే గ్రామానికి సమీపంలో ఈ విచిత్రమైన అడవి ఉంది. ఈ అరణ్యంలోని కొన్ని వందల పైన్‌ చెట్లు 90 డిగ్రీల వరకు వంపు తిరిగి ఉంటాయి. ఈ ప్రకృతి వింతను చూడ్డానికి దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు.

అప్పుడెప్పుడో...

రెండో ప్రపంచయుద్ధం ప్రారంభానికి ముందు, 1930 సంవత్సరంలో ఈ పైన్‌ మొక్కలను నాటినట్లు చెబుతారు. వృక్షాలు ఇలా వంపు తిరిగి పెరగడంతోనే ఈ అడవికి క్రూకెడ్‌ ఫారెస్ట్‌ అనే పేరు కూడా వచ్చింది. ఈ అరణ్యంలో మామూలుగా నిటారుగా పెరిగిన చెట్లు కూడా ఉన్నాయి. కానీ ఓ ప్రాంతంలో మాత్రం కొన్ని వందల సంఖ్యలో ఇలా చెట్లు వంపు తిరిగి పెరిగాయి.

అంతా రహస్యమే....

ప్రపంచంలో ఇంకెక్కడా లేని విధంగా ఈ అడవిలోని చెట్లు ఇలా వింతగా పెరిగాయి. ఈ మొక్కలను నాటేటప్పుడే ఇలా వంపు తిరిగి పెరిగేలా ఒక ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారని స్థానికులు చెబుతుంటారు. కానీ, ఆ విధానం ఏంటో ఎవరికీ తెలియదు. చెట్లు మెలిక తిరగడంతోపాటు అవన్నీ ఒకే దిశలో ఇలా ఉండటం మరింత విస్మయం కలిగిస్తుంది.

కనుల విందే...

కారణం ఏంటో తెలియకపోయినా.... ఈ వంపు తిరిగిన చెట్లు మాత్రం చాలా చూడముచ్చటగా ఉంటాయి. అందుకే ఈ అడవిలో ఫొటోలు, సెల్ఫీలు దిగడానికి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తుంటారు. భూమి గురుత్వాకర్షణ శక్తి వల్ల వృక్షాలు ఇలా వంపు తిరిగి ఉంటాయనే ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. ఇతర మూఢనమ్మకాలు కూడా స్థానికంగా ప్రచారంలో ఉన్నాయి. శాస్త్రసాంకేతిక రంగాలు ఇంత అభివృద్ధి చెందినప్పటికీ ఈ అడవి వెనక ఉన్న మర్మమేంటో శాస్త్రజ్ఞులు ఇప్పటికీ సరిగా తేల్చలేకపోతున్నారు. నేస్తాలూ.. మొత్తానికి ఈ వింత అడవి సంగతులు భలే ఉన్నాయి కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని