హరివిల్లు పక్షిని నేను!

హాయ్‌ ఫ్రెండ్స్‌ బాగున్నారా! నేను రంగురంగులతో చూడ్డానికి భలే ముద్దుగా ఉన్నాను కదూ! నాకు తెలిసి మీకు తెగ నచ్చేసి ఉంటాను. ఎందుకంటే పిల్లలైన మీకు పక్షులంటే ఇష్టం.

Published : 28 Aug 2023 00:32 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌ బాగున్నారా! నేను రంగురంగులతో చూడ్డానికి భలే ముద్దుగా ఉన్నాను కదూ! నాకు తెలిసి మీకు తెగ నచ్చేసి ఉంటాను. ఎందుకంటే పిల్లలైన మీకు పక్షులంటే ఇష్టం. ఇంకా నాలా రంగురంగుల్లో ఉండే పక్షైతే మీకు మరింత ఇష్టం కదా! అందుకే నా గురించి చెప్పిపోదామని ఇదిగో ఇలా వచ్చాను.

నా పేరు గౌల్డియన్‌ ఫించ్‌. నాకు రెయిన్‌బో ఫించ్‌ అనే పేరు కూడా ఉంది. నాకుండే రంగురంగుల ఈకలే నాకీ పేరు రావడానికి కారణం. ఇప్పటికే మీకు ఓ అనుమానం వచ్చి ఉంటుంది. ‘ఇంత అందంగా ఉన్న పక్షి... మాకెప్పుడూ కనిపించలేదేంటబ్బా’ అని! నేను కేవలం ఆస్ట్రేలియాలోనే ఉంటాను మరి. అందుకే మీరెప్పుడూ నన్ను చూసి ఉండరు.

ఎన్నెన్నో వర్ణాలు...

నేను చాలా చిన్న పక్షిని. 125 నుంచి 140 మిల్లీమీటర్ల పొడవు ఉంటానంతే. నా ఈకలు నలుపు, ఆకుపచ్చ, పసుపు, ఎరుపు రంగుల్లో ఉంటాయి. మాలో ఆడపక్షులు కాస్త తక్కువ రంగుతో ఉంటాయి. మళ్లీ మాలో కొన్ని రకాలూ ఉన్నాయి. వాటి ఈకల రంగుల్లో కొన్ని చిన్న చిన్న మార్పులుంటాయి. నేను చాలా అరుదైన పక్షిని. మేం దాదాపు అంతరించిపోయే స్థితిలో ఉన్నాం. మేం చాలా అందంగా ఉండే పక్షులం కదా... అందుకే మమ్మల్ని అక్రమంగా రవాణా చేస్తుంటారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం మా రక్షణ కోసం కఠిన చర్యలు తీసుకుంటోంది.  

కేవలం వేలల్లోనే...

ప్రస్తుతం మేం కేవలం 2,500 కన్నా తక్కువ సంఖ్యలోనే ఉన్నాం. మా సంఖ్య పెరగకపోవడానికి అక్రమ రవాణాతోపాటు, బుష్‌ఫైర్లు అని పిలిచే కార్చిర్చులు కూడా కారణం. ఇంకా తుపాన్లు, వాతావరణ మార్పులు కూడా బుజ్జి పక్షులమైన మా మీద తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

విత్తనాలంటే ఇష్టం...

మిగతా కొన్ని పక్షుల్లానే మాకు కూడా విత్తనాలంటే భలే ఇష్టం. వాటితోనే మా బుజ్జి బొజ్జ నింపుకొంటాం. మేం రోజులో మా శరీర బరువులో దాదాపు 30 శాతం వరకు ఆహారాన్ని తీసుకుంటాం. మరో విషయం ఏంటంటే మేం గడ్డి విత్తనాలను ఎక్కువగా తింటాం. మేం కీటకాలు ఆహారంగా తీసుకుంటామో లేదో... ఇంకా మీ శాస్త్రవేత్తలు నిర్ధారించలేదు. అందుకే ఆ విషయం నేను కూడా ఇప్పుడు మీకు చెప్పడం లేదోచ్‌! నేస్తాలూ... మొత్తానికి ఇవీ నా విశేషాలు. ఇక ఉంటామరి... బై.. బై..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని