రోడ్లపైన ఈ గీతలేంటబ్బా?

హలో ఫ్రెండ్స్‌.. మనకు రహదారులపైన ఉండే జీబ్రా క్రాసింగ్‌ గురించి తెలిసే ఉంటుంది కదా. అలాగే రోడ్ల మధ్యలో తెలుపు రంగులో ఉండే గీతలనూ చూసే ఉంటారు.

Updated : 29 Aug 2023 05:41 IST

హలో ఫ్రెండ్స్‌.. మనకు రహదారులపైన ఉండే జీబ్రా క్రాసింగ్‌ గురించి తెలిసే ఉంటుంది కదా. అలాగే రోడ్ల మధ్యలో తెలుపు రంగులో ఉండే గీతలనూ చూసే ఉంటారు. ఆ ప్రాంతం, రహదారి స్థితిగతుల ఆధారంగా వాటిలోనూ మొదటి నుంచి చివరి వరకు ఒకే గీత, ఒకే గీతకు మధ్యమధ్యలో ఖాళీలు, రెండు గీతలవి ఉంటాయి. వాహనాల వేగం తగ్గించి, ప్రమాదాల నివారణే వీటి ఉద్దేశం. ఒక దగ్గర మాత్రం వీటికి భిన్నంగా ప్రయత్నించారు. ఆ వివరాలే ఇవీ..

పశ్చిమ ఫ్రాన్స్‌లో బౌనే అనే చిన్న పట్టణం ఉంది. వాహనదారుల వేగం తగ్గించి, ప్రమాదాలను అరికట్టేందుకు రోడ్లపైన గజిబిజిగా తెల్లటి గీతలను గీయించారు. ఆ సరికొత్త ప్రయత్నమే ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

వేగం తగ్గించాలని..

బౌనే పట్టణ జనాభా దాదాపు 1700. ఈ ప్రాంతంలో నివసించే వారి సంఖ్య తక్కువే అయినా, రెండు ప్రధాన రహదారులు కలిసే చోటు కావడంతో ఇక్కడి రోడ్లు నిత్యం రద్దీగా ఉంటాయట. ఇక్కడ వేగ పరిమితి గంటకు 30 కిలోమీటర్లే. అయితే చాలా వాహనాలు వందకుపైగా వేగంతో దూసుకెళ్తున్నాయట. దీంతో ఇక్కడ ప్రతిరోజూ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఆ ప్రమాదాల్లో స్థానికులే ఎక్కువ శాతం గాయపడుతున్నారట. అయితే, దీనికి పరిష్కారం కనిపెట్టాలని పట్టణ ప్రజలు ఒక సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో వచ్చిందే ఈ గజిబిజి గీతల ఆలోచన.

ఉపాయం ఫలించింది..

ప్రమాదాలు జరగకుండా చూసేందుకు ఆచరణలోకి తీసుకొచ్చిన ఈ ఆలోచన బాగా పనిచేస్తోందట. అంతకుముందుతో పోలిస్తే వాహనాల వేగంతోపాటు ప్రమాదాలూ తగ్గాయని అక్కడి వారు సంబరపడుతున్నారు. ఈ రోడ్లకు సంబంధించిన ఫొటోలు గత నెల ఫ్రెంచ్‌ సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. అంతే.. కొద్దిరోజుల్లోనే అవి వైరల్‌గా మారాయి. ఈ గజిబిజి గీతల రోడ్లను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘ట్రాఫిక్‌ లైట్లు, కూడళ్లు ఏర్పాటు చేయాల్సింది’ అని ఒకరు.. ‘ఈ ప్రయోగం మొదట్లో మంచి ఫలితాలనే ఇచ్చినా, కొద్దిరోజుల తర్వాత మళ్లీ మామూలే అవుతుంది’ అంటూ ఇంకొకరు.. ‘ఆలోచన మాత్రం వింతగా ఉంది’ అని మరొకరు కామెంట్లు పెడుతున్నారు. ఏదిఏమైనా రోడ్లపైన వంకరటింకర గీతల ఆలోచన భలే ఉంది కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని