ఆరేళ్లకు రచయిత.. ఎనిమిదేళ్లకు వక్త..!

గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన మనిత్‌ ఛాబ్రాకు ఎనిమిది సంవత్సరాలు. ప్రస్తుతం తను నాలుగో తరగతి చదువుతున్నాడు. ఈ వయసులో పిల్లలు స్కూల్‌ నుంచి ఇంటికి వచ్చాక హోంవర్క్‌ చేయడానికే చాలా బద్ధకిస్తారు.

Updated : 30 Aug 2023 05:05 IST

హాయ్‌ నేస్తాలూ..! ఎనిమిదేళ్ల వయసులో కొత్త వాళ్లతో గానీ, స్కూల్లో టీచర్లతో గానీ మాట్లాడటానికి చాలా భయపడతాం.. పాఠాల గురించి అడినా సరిగ్గా చెప్పలేం.. కానీ, ఓ నేస్తం మాత్రం ఎంతోమంది ప్రముఖులు ప్రసంగించిన వేదిక మీద ధైర్యంగా మాట్లాడాడు. మరి తను ఎవరు.. ఆ వివరాలేంటో తెలుసుకుందామా..!

గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన మనిత్‌ ఛాబ్రాకు ఎనిమిది సంవత్సరాలు. ప్రస్తుతం తను నాలుగో తరగతి చదువుతున్నాడు. ఈ వయసులో పిల్లలు స్కూల్‌ నుంచి ఇంటికి వచ్చాక హోంవర్క్‌ చేయడానికే చాలా బద్ధకిస్తారు. కానీ మనిత్‌ మాత్రం అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ‘టెడ్‌ ఎక్స్‌’ వేదిక మీద ఎంతో బాగా మాట్లాడాడు. ప్రస్తుతం పిల్లలంతా టెక్నాలజీని ఎలా ఉపయోగించుకుంటున్నారో వివరించి అందరి దృష్టిని ఆకర్షించాడు. తన ప్రతిభను గుర్తించిన ‘ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ వారు అందులో స్థానం కల్పించారు.

రచయిత కూడా..!

మన మనిత్‌ ధైర్యంగా మాట్లాడటమే కాదు నేస్తాలూ.. ఆరేళ్ల వయసులో ‘స్పూకీ డ్రీమ్స్‌’ అనే పుస్తకాన్ని కూడా రాశాడు. ఆన్‌లైన్‌లో ఆ పుస్తకాలను అమ్మడం ప్రారంభించాడు. చాలా తక్కువ రోజుల్లో వాటికి మంచి ఆదరణ లభించింది. పుస్తకాలు చదవడం వల్ల మనకు చాలా విషయాలు తెలుస్తాయని, మంచి జ్ఞానం వస్తుందని స్కూల్లో టీచర్లు చెప్తూనే ఉంటారు కదా..! మనిత్‌కు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టమట. అందులోనూ కథలు చదవడం ఇంకా నచ్చుతుందట. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా పుస్తకాలే చదువుతానని చెబుతున్నాడు. అందుకేనేమో.. అంత పెద్ద వేదిక మీద ధైర్యంగా మాట్లాడగలిగాడు.

ఆటలపై ఆసక్తి..!

ఆటలు ఆడటమన్నా మనిత్‌ చాలా ఆసక్తి చూపిస్తాడు. చెస్‌, ఫుట్‌బాల్‌ ఎక్కువగా ఆడుతుంటాడు. ఇంకో విషయం ఏంటంటే.. తనకు తబలా వాయించడం కూడా వచ్చట. అతి చిన్న వయసులోనే ఒక గొప్ప వేదిక మీద ప్రసంగించిన మనిత్‌ ఛాబ్రా విశేషాలివీ.. మరి మనమూ తనలాగా పుస్తకాలు చదవడం అలవాటు చేసుకుందామా..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు