అడవి కాని అడవి!

అదో అడవి... అలా అని అది కారడవి కాదు... చిట్టడవి అంతకన్నా కాదు. నిజానికి అది అసలు అడవే కాదు. కానీ దాన్ని అడవి అంటారు.

Updated : 31 Aug 2023 04:42 IST

అదో అడవి... అలా అని అది కారడవి కాదు... చిట్టడవి అంతకన్నా కాదు. నిజానికి అది అసలు అడవే కాదు. కానీ దాన్ని అడవి అంటారు. కాస్త అయోమయంగా, ఇంకాస్త గందరగోళంగా ఉంది కదూ! అయితే చకచకా ఈ కథనం చదివేయండి. అసలు విషయం ఏంటో మీకే తెలుస్తుంది.. సరేనా!

కొనలు మొనదేలి కనుచూపుమేర శిలలు పరుచుకుని కనిపిస్తున్న ఈ ప్రకృతి వింతను ‘స్టోన్‌ ఫారెస్ట్‌’ అని పిలుస్తారు. ఈ శిలావనం మన పొరుగు దేశమైన చైనాలోని యున్నాన్‌ ప్రావిన్స్‌లో ఉంది. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 400 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో భూమి నుంచి పొడుచుకు వచ్చినట్లుగా శిలలున్నాయి.

అప్పుడెప్పుడో!

ఈ శిలావనం అప్పుడెప్పుడో సుమారు 27కోట్ల సంవత్సరాల పూర్వమే ఏర్పడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇసుక, సున్నపురాయి మిశ్రమాలతో ఈ స్టోన్‌ఫారెస్ట్‌ రూపుదిద్దుకుంది. గాలి, నీటిప్రవాహాల వల్లనే ఈ రాళ్లు ఇలా పదునుగా తయారయ్యాయని అంచనా. 2007లో ఈ ప్రాంతానికి యునెస్కో వారసత్వ గుర్తింపు లభించింది.

ఏడు భాగాలుగా...

ఈ శిలావనాన్ని ప్రధానంగా ఏడు భాగాలుగా విభజించారు. అవి లిజిజింగ్‌ స్టోన్‌ ఫారెస్ట్‌, నైగు స్టోన్‌ ఫారెస్ట్‌, జియున్‌ గుహ, లేక్‌ చాంగ్‌, మూన్‌లేక్‌, డాడిషుయ్‌ జలపాతం, కిఫెంగ్‌ గుహ. ఈ ప్రకృతి వింతను వీక్షించడానికి దేశవిదేశాల నుంచి సందర్శకులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. కేవలం శిలలే కాకుండా ఈ ప్రాంతంలో కొన్ని అరుదైన వృక్ష జాతులు కూడా ఉన్నాయి. నిజానికి కొన్ని కోట్ల సంవత్సరాలకు పూర్వం ఇక్కడ సముద్రం ఉండేది. క్రమంగా సముద్రం మాయమైంది. అప్పుడు ఈ శిలలు బయటపడ్డాయి. వీటిలో కొన్ని చెరువులు, జలపాతాలు, గుహలూ ఏర్పడ్డాయి. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ స్టోన్‌ఫారెస్ట్‌ విశేషాలు. భలే ఉన్నాయి కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని