ఇంక్‌లోనే ఉన్నదంతా..!

హలో నేస్తాలూ.. మన బ్యాగులో రంగురంగుల పెన్సిళ్లూ, రకరకాల పెన్నులూ ఉంటాయి కదా! అయినా, ఏదైనా కొత్త పెన్ను కనిపిస్తే చాలు.. వెంటనే కొనాలని అనుకుంటాం.

Updated : 02 Sep 2023 05:09 IST

హలో నేస్తాలూ.. మన బ్యాగులో రంగురంగుల పెన్సిళ్లూ, రకరకాల పెన్నులూ ఉంటాయి కదా! అయినా, ఏదైనా కొత్త పెన్ను కనిపిస్తే చాలు.. వెంటనే కొనాలని అనుకుంటాం. ఇప్పుడిదంతా ఎందుకూ అంటే.. ప్రపంచంలోనే అత్యంత నల్లగా రాసే ఓ జెల్‌ పెన్నును ఇటీవల తయారు చేశారు. మరి దాని ప్రత్యేకతను తెలుసుకుందాం..!

పాన్‌కు చెందిన ఓ సంస్థ ఇటీవల తయారు చేసిన బ్లాక్‌ జెల్‌ పెన్ను.. ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లో చోటు దక్కించుకుంది. ప్రపంచం మొత్తంలో అత్యంత నల్లగా రాసే జెల్‌ ఇదేనట. ఈ ఇంక్‌ లోపలి నిర్మాణం ముద్దగా కాకుండా.. చిన్న చిన్న బిందువుల మాదిరి ఉంటుంది. దాంతో అవి రంగు సహజత్వాన్ని ఏమాత్రం కోల్పోనివ్వవట.

కాగితం పీల్చుకోదు..

మనం కాగితంపైన పెన్నులతో రాస్తుంటాం కదా.. సాధారణంగా ఆ ఇంక్‌లో కొంత మొత్తాన్ని కాగితంలో ఉండే సన్నటి రంధ్రాలు పీల్చుకుంటాయి. కానీ, ఈ కొత్తగా కనిపెట్టిన జెల్‌ పెన్నులోని ఇంక్‌ను కాగితం పీల్చుకోలేదట. దాంతో అదంతా కాగితంపైనే ముద్దగా ఏర్పడి, మిగతా పెన్నుల కంటే మరింత నల్లగా కనిపిస్తుందట.

లాభమేంటంటే..

‘మిగతా పెన్నుల కంటే నల్లగా రాస్తే ప్రయోజనం ఏంటి?’ అనే సందేహం మీకు వచ్చే ఉంటుంది కదా.. దానికీ ఆ సంస్థ తయారీదారులు సమాధానం చెబుతున్నారు. ఏమనీ అంటే.. ముందుగా వాళ్లు కొన్ని పరిశోధనలు చేశారట. అందులో ఈ సంస్థ కనిపెట్టిన కొత్త తరహా ఇంక్‌తోపాటు వేరే బ్లాక్‌ ఇంక్‌లతో రాసిన అక్షరాలనూ పరీక్షించారు. అన్నింటితో పోలిస్తే ఈ సరికొత్త ఇంక్‌తో రాసినవే ఎక్కువగా గుర్తున్నాయట. అంటే.. నలుపు తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటే.. చూసినవీ, చదివినవీ మనకు అంతగా గుర్తుంటాయన్నమాట. ఇదంతా తయారీదారులు చెబుతున్నదే.

రాయగానే ఆరిపోతుంది..

అంతేకాదు.. ఈ ఇంక్‌లో వాడిన ముడి పదార్థాలు, మనం రాసిన వెంటనే అక్షరాలు ఆరిపోయేలా చేస్తాయట. దాంతో మన రాత కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇటీవలే ఈ సంస్థ ప్రతినిధులు.. గిన్నిస్‌ బుక్‌ నిర్వాహకుల నుంచి అధికారిక ధ్రువపత్రం సైతం అందుకున్నారు. నేస్తాలూ.. ఇవీ ప్రపంచంలోనే అత్యంత నల్లటి ఇంక్‌ విశేషాలు.. మీరు దీన్ని చదివి వదిలేయకుండా, స్నేహితులకూ చెప్పి చూడండి. ‘చాలా మంచి విషయం చెప్పావు’ అంటూ పొగడ్తలు అందుకోండి. సరేనా!!

సాధారణ ఇంక్‌  సరికొత్త ఇంక్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని