చేపలే మాకు ఎర... మేమే చేపలకు ఎర!

§సాధారణంగా చేపల్ని పట్టుకోవడానికి వానపాములను ఎరలా వాడతారు. కానీ, ఒక రకమైన పురుగునైన నన్ను పట్టుకోవడానికి మాత్రం చేపనే ఎరగా వాడతారు. ఇంతకీ నన్ను పట్టుకున్నాక ఏం చేస్తారో తెలుసా...!

Updated : 03 Sep 2023 06:49 IST

సాధారణంగా చేపల్ని పట్టుకోవడానికి వానపాములను ఎరలా వాడతారు. కానీ, ఒక రకమైన పురుగునైన నన్ను పట్టుకోవడానికి మాత్రం చేపనే ఎరగా వాడతారు. ఇంతకీ నన్ను పట్టుకున్నాక ఏం చేస్తారో తెలుసా...! మళ్లీ చేపల్ని పట్టుకోవడానికి ఎరగా ఉపయోగిస్తారు. చదువుతుంటే భలే తమాషాగా, కాస్త గందరగోళంగానూ ఉంది కదూ! అందుకే నా విశేషాలు మీతో పంచుకుందామనే... ఇదిగో.. ఇలా వచ్చా ఫ్రెండ్స్‌!

ఇంతకీ నా పేరేంటో తెలుసా..? అయినా నేను చెప్పకుండా నా పేరు మీకు ఎలా తెలుస్తుంది!! నన్ను ‘ఆస్ట్రలోను ఫిస్‌’ అంటారు. పలకడానికి చిన్నారులైన మీకు కాస్త ఇబ్బందిగా ఉంది కదూ! మరేం ఫర్వాలేదు... నాకు ‘ఆస్ట్రేలియన్‌ బీచ్‌ వార్మ్‌’ అనే మరో పేరు కూడా ఉంది. మీకు ఈ రెండింట్లో ఏది తేలిగ్గా ఉంటే దాన్నే వాడండి.. సరేనా. నేను ఒనుఫిడే కుటుంబానికి చెందిన పాలిచైటస్‌ అనెలిడ్‌ జాతికి చెందిని జీవిని.

తీర ప్రాంతాల్లో....

నేను ఎక్కువగా ఆస్ట్రేలియా తీరప్రాంత బీచుల్లో ఇసుక పొరల కింద నివసిస్తాను. నాకు చూపు ఉండదు. కానీ... అద్భుతంగా వాసనను గుర్తిస్తాను. తీరానికి కొట్టుకు వచ్చే చిన్న చిన్న జీవుల్ని ఆహారంగా తీసుకుంటాను. నేను చాలా పొడవు ఉంటాను. మాలో కొన్ని దాదాపు రెండు మీటర్ల వరకూ పెరుగుతాయి. ముందు మాలో ఒకేజాతి ఉంటుందని మీ శాస్త్రవేత్తలు అనుకున్నారు. కానీ తర్వాత రెండు రకాలున్నట్లు కనుగొన్నారు. క్వీన్స్‌ల్యాండ్‌, న్యూసౌత్‌ వేల్స్‌ మధ్య సముద్రతీరాల్లో మేం కొన్ని కోట్ల సంఖ్యలో జీవిస్తున్నామని తేలింది.

వాసన పసిగడతాం...

మామూలుగా మమ్మల్ని గుర్తించడం, పట్టుకోవడం చాలా కష్టం. అందుకే జాలర్లు కుళ్లిన మాంసం, చేపల్ని ఎరగా ఉపయోగిస్తారు. వీటి వాసన తెలియగానే... ఇసుక పొరల్లోంచి మా తలలను బయటకు పెడతాం. ఎంచక్కా వాటిని తినేద్దామని ఆశపడతాం. కానీ ఈలోపే మీ మనుషులు మమ్మల్ని చేతులతో పట్టుకుని బయటకు లాగేస్తారు. అలా మేం మీకు చిక్కుతాం. అసలు చేపల్ని ఎరగా వేసి మమ్మల్ని ఎందుకు పట్టుకుంటారో తెలుసా? మళ్లీ మమ్మల్ని ఎరగా వేసి మరిన్ని చేపల్ని పట్టుకోవడానికి! ఒకేసారి వందలు, వేల సంఖ్యలో మమ్మల్ని పట్టుకొని, చేపల వేటకు వెళతారు. మాలో కొంతభాగాన్ని గేలానికి గుచ్చి చేపలకు ఎరగా వేస్తారు. నేస్తాలూ... మొత్తానికి ఇవీ మా విశేషాలు.

ఇక ఉంటా మరి బై... బై...!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు