కుందేలు... పంది... కంగారూ.. ఇవన్నీ కలగలిస్తే నేను!

హాయ్‌ నేస్తాలూ... బాగున్నారా?! ఏంటి నన్ను అలా వింతగా చూస్తున్నారు. నేను ఎవరనా?! ఆ సంగతులు చెప్పి పోదామనే ఇదిగో ఇలా వచ్చాను. నన్ను చూడగానే మీకు ఓ మూడు జంతువులు గుర్తుకు వచ్చి ఉంటాయి కదూ! నా చెవులేమో కుందేలు చెవుళ్లా ఉంటాయి.

Published : 04 Sep 2023 02:12 IST

హాయ్‌ నేస్తాలూ... బాగున్నారా?! ఏంటి నన్ను అలా వింతగా చూస్తున్నారు. నేను ఎవరనా?! ఆ సంగతులు చెప్పి పోదామనే ఇదిగో ఇలా వచ్చాను. నన్ను చూడగానే మీకు ఓ మూడు జంతువులు గుర్తుకు వచ్చి ఉంటాయి కదూ! నా చెవులేమో కుందేలు చెవుళ్లా ఉంటాయి. ఇక మూతేమో పంది మూతిలా ఉంటుంది. తోకేమో అచ్చం కంగారూ తోకలా దృఢంగా ఉంటుంది. కానీ నేనేమీ వీటికి బంధువును కాదు. నేను వేరు..నా రూటే... సపరేటు!

నా పేరు ఆర్డ్‌వర్క్‌. నేను చేస్తాను చాలా హార్డ్‌వర్క్‌! ఆఫ్రికా ఖండానికి చెందిన జీవిని.  దాదాపు ఒకటిన్నర మీటర్ల వరకు పొడవు పెరుగుతాను. నా కండరాలు చాలా శక్తిమంతంగా ఉంటాయి. ఇక తోకేమో ఏకంగా 70 సెంటీమీటర్ల పొడవు వరకు పెరుగుతుంది. గోధుమ రంగులో ఉంటాను. నా వెంట్రుకలు ముళ్లలా గట్టిగా ఉంటాయి.

నేనూ బాహుబలినే!

నేను కాస్త నిదానంగా నడుస్తాను కానీ... నాలో మాత్రం చాలా శక్తి ఉంటుంది. ముఖ్యంగా నా కాళ్లు చాలా దృఢంగా ఉంటాయి. కేవలం అయిదు నిమిషాల్లోనే ఒక మీటరు లోతు వరకు నేలపై రంధ్రాన్ని చేయగలను. నేను నిశాచర జీవిని. అంటే పగటిపూట విశ్రాంతి తీసుకుని, రాత్రిపూట సంచరిస్తూ ఉంటానన్నమాట. ఒక్క రాత్రిలో దాదాపు 10 నుంచి 12 కిలోమీటర్ల వరకు నడగలను.

జుర్రుకుంటాను!

నాకు చీమలు, చెదపురుగులంటే చాలా ఇష్టం. అందుకే అవి కనిపిస్తే చాలు నా మూతిని నేల మీదకు వంచి చాలా గట్టిగా గాలిని లోపలికి పీల్చుకుంటాను. అప్పుడు చీమలు, చెదపురుగులు ఎంచక్కా నాకు చిక్కుతాయి. కీటకాలు కనిపించినా కరకరలాడించేస్తా. చెదపురుగుల పుట్టలు నాకు కనిపిస్తే నేను వాటిని నా బలమైన ముందు కాళ్లతో తవ్వేస్తాను. పొడవైన నాలుక, జిగటైన లాలాజలం సాయంతో నేను వాటిని జుర్రుకుంటాను. మొత్తానికి తిండి తినడంలో నాకు నేనే పోటీ. నాకు ఎవరూ లేరు సాటి! బ్రేవ్‌... ఎందుకంటే నేను కేవలం ఒక్క రాత్రిలోనే దాదాపు 50 వేల కీటకాలను గుటకాయ స్వాహా చేయగలను.

శత్రువులే... శత్రువులు!

నాకు చాలానే శత్రువులున్నాయి. నాపై ఎక్కువగా సింహం, చిరుత, హైనాలు, అడవి కుక్కలు దాడి చేస్తాయి. మీ మనుషులు కూడా మమ్మల్ని వేటాడతారు. నాకు ప్రమాదం ఉందనిపిస్తే అప్పటికప్పుడు గోతిని తవ్వుకుని అందులోకి వెళ్లిపోతా. ఆ సమయమూ లేదనుకోండి నా బలమైన ముందుకాళ్లతో నా శత్రువు మీద దాడి చేయడానికి చూస్తాను. నాకు భయం వేసినప్పుడు చాలా గట్టిగా అరుస్తాను. మాలో ఆడవి తమ పిల్లలకు సుమారు నాలుగు నెలల వరకు పాలిస్తాయి. ఏడు నెలల వరకు ఆలనాపాలనా చూస్తాయి. తర్వాత ఆ పిల్లలు ఇక స్వతంత్రంగా జీవిస్తాయి. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ నా విశేషాలు. ఇక ఉంటామరి... బై.. బై...!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని