పర్వతాలపైన ఇంద్రధనుస్సు!

హాయ్‌ నేస్తాలూ..! మనకు పర్వతాలు అనగానే హిమాలయాలు గుర్తుకొస్తాయి. అవి ప్రపంచంలోనే ఎత్తయినవైనా, ఈ భూమి మీద విభిన్న ప్రత్యేకతలు కలిగినవీ ఉన్నాయి.

Updated : 05 Sep 2023 05:02 IST

హాయ్‌ నేస్తాలూ..! మనకు పర్వతాలు అనగానే హిమాలయాలు గుర్తుకొస్తాయి. అవి ప్రపంచంలోనే ఎత్తయినవైనా, ఈ భూమి మీద విభిన్న ప్రత్యేకతలు కలిగినవీ ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అలాంటి పర్వతాల గురించే.. రంగురంగుల్లో కనువిందు చేసే అవి ఎక్కడున్నాయో, వాటి విశేషాలేంటో తెలుసుకుందామా.!

చైనాలో ‘జాంగ్యే డాన్క్సియా ల్యాండ్‌ఫార్మ్‌’ పేరిట ఓ పార్క్‌ ఉంది. దానికి దగ్గర్లోనే ‘రెయిన్‌బో మౌంటెయిన్స్‌’ ఉన్నాయి. పేరు చదవగానే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా..! దూరం నుంచి చూస్తే ఆ పర్వతాలకు ఎవరైనా రంగులేశారేమో అన్నట్టుగా కనిపిస్తాయి. దగ్గరకెళ్లి చూసిన వారంతా నోరెళ్లబెడుతున్నారట. ఎరుపు, ఆకుపచ్చ, పసుపు, నీలం రంగుల్లో మెరుస్తూ.. ఆ పర్వతాలు ఎంతో అబ్బురపరుస్తాయి. అవి ఎక్కువ శాతం ముదురు ఎరుపు రంగును కలిగి ఉంటాయట.  

హిమాలయాల కంటే ముందే..

ఈ ‘రెయిన్‌బో మౌంటెయిన్స్‌’ కొన్ని వందల ఏళ్ల క్రితమే ఏర్పడ్డాయి. ఓ రకమైన ఇసుక, కొన్ని అరుదైన ఖనిజాలు ఈ ప్రాంతంలో మాత్రమే లభిస్తాయట. ‘మరి ఇంతకీ కొండలకు ఆ రంగులెలా వచ్చాయి?’ అనే కదా మీ సందేహం.. ఆ ఖనిజాలు, ఇసుకలోని చిన్న చిన్న రాళ్లతో కలవడంతో వివిధ రంగులు ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు తేల్చారు. అవి కాస్తా.. వర్షపు నీటి వల్ల చుట్టుపక్కలకూ వ్యాపించి.. ఇప్పుడున్న స్థితికి కారణమయ్యాయి. ఇంకో విషయం ఏంటంటే.. ఈ పర్వతాలు హిమాలయాల కంటే ముందే ఏర్పడ్డాయని కొందరు పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాదు నేస్తాలూ.. చైనాలో ఉన్న అద్భుతమైన ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి.  

యునెస్కో గుర్తింపు..

ఈ పర్వతాలు అంత పురాతనమైనవి కాబట్టే 2009 సంవత్సరంలో యునెస్కో నుంచి ‘వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌’గా ఈ ప్రదేశానికి గుర్తింపు దక్కింది. ఈ ప్రాంతానికి చైనీయులతోపాటు ఇతర దేశాల నుంచి కూడా వేలాదిగా పర్యాటకులు తరలివెళ్తుంటారట. ఈ సహజసిద్ధ పర్వతాలు దాదాపు 2000 నుంచి 3800 మీటర్ల ఎత్తు ఉంటాయి. సుమారు 40 కిలోమీటర్ల వెడల్పుతో, 5 నుంచి 10 కిలోమీటర్ల పొడవులో ఇవి విస్తరించి ఉంటాయి. ఇక్కడికి వచ్చే పర్యాటకులకు వసతులు కల్పించడం కోసం 2014 సంవత్సరంలో అక్కడి ప్రభుత్వం దాదాపు రూ.115 కోట్లు ఖర్చు చేసింది. నేస్తాలూ.. ఇంద్రధనుస్సు పర్వతాల వివరాలివీ.. ఫొటోలతోపాటు వాటి వివరాలూ భలే ఉన్నాయి కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని