నేను ‘అంబా...’ అనని ఆవునోచ్‌!

ఏంటి నేస్తాలూ... అలా అవాక్కై చూస్తున్నారు. ‘‘ఆవును అంటోంది. పైగా ‘అంబా..’ అనను అంటోంది. కానీ చూడ్డానికేమో కాస్త డాల్ఫిన్‌లా... ఇంకాస్త బుజ్జి తిమింగలంలా ఉంది.

Updated : 06 Sep 2023 05:11 IST

ఏంటి నేస్తాలూ... అలా అవాక్కై చూస్తున్నారు. ‘‘ఆవును అంటోంది. పైగా ‘అంబా..’ అనను అంటోంది. కానీ చూడ్డానికేమో కాస్త డాల్ఫిన్‌లా... ఇంకాస్త బుజ్జి తిమింగలంలా ఉంది. ఇంతకీ ఏంటబ్బా... దీని సంగతి?!’’ అని ఆలోచిస్తున్నారు కదూ! ఆ వివరాలు చెప్పిపోదామనే ఇదిగో ఇలా వచ్చాను ఫ్రెండ్స్‌.

నా పేరు డుగోంగ్‌. నన్ను ‘సముద్ర ఆవు’ అని కూడా పిలుస్తుంటారు. నేను చాలా అరుదైన సముద్ర జీవిని. కచ్చితంగా మేం ఎంతమందిమి ఉన్నామనే లెక్కలు మీకు తెలియదు కానీ..., మొత్తానికైతే మేం అతి తక్కువ సంఖ్యలోనే ఉన్నాం. డాల్ఫిన్‌లానే నేను కూడా సముద్ర క్షీరదాన్ని. 18వ శతాబ్దంలో విపరీతంగా వేటాడటం వల్ల మా సంఖ్య చాలా తగ్గిపోయింది.

గడ్డి తింటాను...!

నేను గడ్డి తింటాను. వినడానికి కాస్త వింతగా ఉన్నా.. నేను చెప్పేది నిజంగా నిజం. అయితే మీ నేల మీద పెరిగే గడ్డి మాత్రం కాదు. నేను మా సముద్రంలో పెరిగే గడ్డి, ఆల్గేను తింటాను. ఇతర జీవుల జోలికి దాదాపు అస్సలు పోను. నేను పూర్తి శాకాహారిని. అందుకే నన్ను మీరు ముద్దుగా ‘సముద్ర ఆవు’ అని పిలుచుకుంటారు. నేను ఎక్కువగా హిందూ మహాసముద్రం, పసిఫిక్‌ మహాసముద్రంలో కనిపిస్తుంటాను. దాదాపు 40 దేశాలకు చెందిన తీరప్రాంతాలు నాకు ఆవాసాలు. ఆస్ట్రేలియా, సింగపూర్‌, కంబోడియా, చైనా, ఈజిప్టు, భారతదేశం, ఇండోనేషియా, జపాన్‌, జోర్డాన్‌, కెన్యా, మడగాస్కర్‌, మారిషస్‌, మొజాంబిక్‌, ఫిలిప్పీన్స్‌, సోమాలియా, వనాటు, వియత్నాం ఈ దేశాల తీరప్రాంతాల్లో నేను ఎక్కువగా కనిపిస్తుంటాను.

సంచార జీవిని...

నేను ఎప్పుడూ స్థిరంగా ఒకే చోట ఉండను. ఎందుకంటే మాకు ఆహారం ఒకే ప్రాంతంలో పెద్ద మొత్తంలో దొరకదు. అందుకే మేం సముద్ర గడ్డి, ఆల్గే ఉన్న ప్రాంతాలను వెతుక్కుంటూ వెళ్తుంటాం. ఎక్కువగా తీరానికి దగ్గరగా ఉన్న సముద్రం అడుగున బురద ప్రాంతాల్లో ఉంటాం. మరో విషయం ఏంటంటే నాకు సిగ్గెక్కువ. అందుకే నేను ఎక్కువగా డైవర్ల కంటపడను. సముద్రంలో ఓడలు, పడవలు, మనుషుల ఉనికిని గుర్తించగానే చాలా దూరంగా వెళ్లిపోతా. ఈ కారణంగానే నా గురించి మీకు ఎక్కువగా తెలియదు.

ఈల వేస్తా...

నేను ప్రమాదాలను గుర్తించినప్పుడు ఈలలాంటి ప్రత్యేక శబ్దాలు చేస్తాను. నా తోటి డుగోంగ్‌లను అప్రమత్తం చేయడానికే ఇలా చేస్తుంటా. నా జీవిత కాలం దాదాపు 70 సంవత్సరాలు. వాతావరణ మార్పులు, పర్యావరణ కాలుష్యం, సముద్ర జలాలు కలుషితం కావడం, సముద్ర గడ్డి లభ్యత తగ్గిపోవడం తదితర కారణాల వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే మా సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. నేస్తాలూ! మొత్తానికి ఇవీ నా విశేషాలు. భలే ఉన్నాయి కదూ! ఇక ఉంటామరి బై... బై...!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని