చేపలు కనిపిస్తే అంతే...!

హాయ్‌ నేస్తాలూ.. ఎలా ఉన్నారు..? నేనైతే చాలా బాగున్నా..  ఇప్పటి వరకూ మీరు చాలా రకాల జంతువులు, పక్షుల గురించి చదువుకొని ఉంటారు.

Updated : 07 Sep 2023 05:08 IST

హాయ్‌ నేస్తాలూ.. ఎలా ఉన్నారు..? నేనైతే చాలా బాగున్నా..  ఇప్పటి వరకూ మీరు చాలా రకాల జంతువులు, పక్షుల గురించి చదువుకొని ఉంటారు. టీవీల్లోనూ చూసే ఉంటారు. కానీ, నాలాంటి లక్షణాలు ఉన్న పక్షిని మాత్రం చూసి ఉండరు. ఇంతకీ నేనెవరో చెప్పనేలేదు కదూ.. ఆ విశేషాలు చెప్పిపోదామనే ఇలా వచ్చాను..!

నా పేరు ‘ఆస్ట్రేలియన్‌ పెలికాన్‌’. ‘పెలికానిడే’ జాతి పక్షుల్లో నేనే అతి పెద్ద జీవిని. ఎక్కువగా ఆస్ట్రేలియా, గినియా, ఇండోనేషియా, న్యూజిలాండ్‌ సముద్రతీర ప్రాంతాల్లో కనిపిస్తుంటాను. నా శరీరమంతా తెలుపు, రెక్కలు నలుపు, కాళ్లేమో నీలం, ముక్కు లేత గులాబీ రంగులో ఉంటుంది. ఎక్కువగా చేపలను ఆహారంగా తీసుకుంటాను. అందుకే తీరప్రాంతాల్లో ఉండటానికే ఇష్టపడతా. చేప కనిపిస్తే చాలు.. చాలా ఏకాగ్రతతో మా పొడవైన ముక్కు సాయంతో గుటుక్కుమనిపిస్తాం. ఇంకో విషయం ఏంటంటే.. ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే మేం గుంపులుగానే వెళ్తాం. ఒక్కోసారి మా గుంపులో దాదాపు 40 వేల వరకూ పక్షులు ఉంటాయి తెలుసా..!

చాలా దూరం వెళ్తాం..!

నా నోటితో చిన్న చిన్న శబ్దాలు చేస్తూ.. ముక్కుతో, రెక్కలతో కొన్ని సైగలు చేస్తూ.. నా హావభావాలను కూడా తెలుపుతాను. నీళ్ల కోసం ఎంత దూరమైనా సరే వెళ్తుంటాను. ఇంకో గొప్ప విషయం ఏంటంటే.. ఏమాత్రం అలసిపోకుండా, ఎక్కడా ఆగకుండా ఒక రోజంతా ఎగరగలను. మరో ఆశ్చర్యకర మాట చెప్పనా.. నా ముక్కులో దాదాపు 9 నుంచి 13 లీటర్ల నీటిని నిల్వ ఉంచగలను. పెద్ద ముక్కు కలిగిన పక్షిని కావడం నా మరో ప్రత్యేకత. ఇంకా నేను రోజుకు సుమారు 1.8 కిలోగ్రాముల చేపలను ఆహారంగా తీసుకుంటాను.

ఎముకల బరువు తక్కువే..

నేను చూడటానికి ఆకారంలో కాస్త పెద్దగా కనిపిస్తున్నా కదూ.. కానీ, నా ఎముకల బరువు.. శరీర బరువు మొత్తంలో 10శాతం మాత్రమే ఉంటుంది. మాలో చిన్న పక్షులు జన్మించిన 28 రోజుల్లోనే గుంపులో చేరిపోతాయి. అలాగని పూర్తిగా వదిలేయం. మూడు నెలల వరకు తల్లి సంరక్షణలోనే ఉంటాయవి. గాలిలో దాదాపు మూడు కిలోమీటర్ల ఎత్తు వరకు ఎగరగలం. ప్రస్తుతం మా సంఖ్య కాస్త బాగానే ఉన్నా.. రాబోయే రోజుల్లో మిగతా జీవుల్లానే తగ్గిపోతుందేమోనని భయపడుతున్నా. నా పొడవు దాదాపు 1.6 నుంచి 1.9 మీటర్లు ఉంటుంది. బరువేమో 4.5 నుంచి 7.7 కిలోలు తూగుతాను. గంటకు 56 కిలోమీటర్ల వేగంతో ఎగరగలను. పదిహేనేళ్ల వరకూ జీవిస్తాను. పరిస్థితులు అనుకూలిస్తే 25 ఏళ్ల వరకు కూడా బతుకుతాను. నేస్తాలూ.. ఇవీ నా విశేషాలు.. భలే ఉన్నాయి కదూ.. అదిగో నాకో చేప కనిపిస్తుంది.. శబ్దం చేయకుండా మెల్లిగా వెళ్లి, దాన్ని పట్టేసుకోవాలి.

ఇక ఉంటా మరి బై.. బై..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని