‘ఇది ట్రక్కా... లేక టైటానిక్కా!’

ఫ్రెండ్స్‌.. మీరు ‘పడవంత కారు’ అనే మాట వినే ఉంటారు కదూ! చాలా పెద్దగా ఉండే కార్లను ఇలా పిలుస్తారన్నమాట. మరి అతిపెద్ద ట్రక్కునైన నన్ను చూస్తే మాత్రం మీరు... ‘ఇది ట్రక్కా... లేక టైటానిక్కా!’

Updated : 08 Sep 2023 05:25 IST

ఫ్రెండ్స్‌.. మీరు ‘పడవంత కారు’ అనే మాట వినే ఉంటారు కదూ! చాలా పెద్దగా ఉండే కార్లను ఇలా పిలుస్తారన్నమాట. మరి అతిపెద్ద ట్రక్కునైన నన్ను చూస్తే మాత్రం మీరు... ‘ఇది ట్రక్కా... లేక టైటానిక్కా!’ అని నోరెళ్లబెడతారు తెలుసా! నేను పరుగు పెడుతుంటే... ఓ భారీ భవంతి కదిలి వస్తున్నట్లే ఉంటుంది. ఇక నా హారన్‌ వింటే హర్రరే! భారీగా ఉండే నా చక్రాలను చూస్తే మీకు హడలే! ఇంతకీ నా పేరేంటి? నేను ఎక్కడ ఉంటానంటే...!!

ప్రపంచంలోనే అతిపెద్ద డంప్‌ట్రక్‌గా రికార్డు సృష్టించిన నా పేరు ‘బిలాజ్‌ 75710’. ఒకేసారి దాదాపు 450 టన్నుల బరువును మోసుకుపోగలను. ప్రస్తుతం నేను బెలారస్‌లో ఉన్నాను. నాకు ఎనిమిది చక్రాలున్నాయి. ఒక్కో చక్రం బరువు సుమారు 5,500 కిలోలు. మరి అంతంత బరువుల్ని మోయాలి అంటే చక్రాలు కూడా ఆ మాత్రం ఉండాల్సిందే. నేను దాదాపు రెండు పే..ద్ద బస్సులంత పొడవుంటాను. ఫార్ములా వన్‌ రేసింగ్‌ కార్లకంటే దాదాపు ఆరు రెట్లు శక్తిమంతం నేను. ఎయిర్‌ బస్‌ ఏ380 విమానం కన్నా నా బరువే ఎక్కువ.

బొగ్గు గనుల్లో...

సైబీరియాలోని ఓపెన్‌కాస్ట్‌ బొగ్గు గనుల్లో నేను విధులు నిర్వహిస్తున్నాను. నాకున్న టైర్లన్నీ ట్యూబ్‌లెస్సే. ఒక్కో టైరు 102 టన్నుల వరకు బరువును మోయగలదు. నేను భారీ వాహనాన్ని కదా.. నన్ను కదిలించడానికి ఒక్క ఇంజిన్‌ సరిపోదు. అందుకే నాలో 16 సిలిండర్‌ డీజిల్‌ ఇంజిన్లు రెండున్నాయి. ఇవే నేను ముందుకు కదలడానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి.

నాకు దాహం ఎక్కువ!

‘ఎంత చెట్టుకు అంత గాలి’ అన్నట్లు.. నా భారీ పరిమాణం వల్ల నేను ఇంధనాన్ని కూడా ఎక్కువగానే తాగేస్తా. 100 కిలోమీటర్లు ముందుకు కదలాలంటే.. దాదాపు 1,300 లీటర్ల డీజిల్‌ కావాల్సిందే! అంటే ‘ఎంత ట్రక్కుకు అంత డీజిల్‌’ అన్నమాట. అందుకే నేను బరువులు మోయనప్పుడు కేవలం ఒక్క ఇంజిన్‌ సాయంతోనే నడుస్తాను. అప్పుడు కాస్త డీజిల్‌ ఆదా అవుతుంది.

మలుపు తిరగాలంటే...

నన్ను నడపడం తేలికే. కానీ మలుపు తిప్పాలంటేనే చుక్కలు కనిపిస్తాయి. అంత త్వరగా మలుపు తిరగలేను. ఇక నా ఎత్తు  26 అడుగులు. నేను ఖాళీగా ఉన్నప్పుడు గరిష్ఠంగా గంటకు 64 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయగలను. బరువులు మోసేట ప్పుడు మాత్రం ఆ వేగం 40 కిలోమీటర్లకు పడిపోతుంది. అయినా ఇది తక్కువ వేగమేమీ కాదు తెలుసా. నేస్తాలూ మొత్తానికి ఇవీ నా విశేషాలు. భలే ఉన్నాయి కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని