బుజ్జీ పిట్ట.. బుల్లీ పిట్ట..!

అమెరికా, మెక్సికో మధ్యనున్న అటవీ ప్రాంతంలో శాస్త్రవేత్తలు ఇటీవలే ఓ చిన్న గుడ్లగూబ జాతిని గుర్తించారు. వాటి మీద పరిశోధనలు చేస్తే, వారికో ఆశ్చర్యకర విషయం తెలిసిందట.

Published : 11 Sep 2023 00:03 IST

హలో ఫ్రెండ్స్‌.. గుడ్లగూబలంటేనే మనలో చాలా మందికి భయం. కానీ, తెలివితేటల్లో మిగతావేవైనా వాటి తర్వాతేనని స్కూళ్లలో టీచర్లు చెప్పే ఉంటారు. అవి పగలంతా నిద్రపోయి, రాత్రిపూట మాత్రమే వేటాడతాయని మీకు తెలిసే ఉంటుంది. అయితే, ఇప్పుడు మనం ప్రపంచంలోనే అతి చిన్న గుడ్లగూబ గురించి తెలుసుకుందాం..!

అమెరికా, మెక్సికో మధ్యనున్న అటవీ ప్రాంతంలో శాస్త్రవేత్తలు ఇటీవలే ఓ చిన్న గుడ్లగూబ జాతిని గుర్తించారు. వాటి మీద పరిశోధనలు చేస్తే, వారికో ఆశ్చర్యకర విషయం తెలిసిందట. అదేంటంటే.. వాటి పేరు ‘ఎల్ఫ్‌ ఔల్‌’ అనీ, అవి ప్రపంచంలోనే అతి చిన్న గుడ్లగూబలని కనిపెట్టారు.

తక్కువ అంచనా వేయొద్దు..

అరచేతిలో ఇమిడిపోయేంత చిన్నగా కనిపించే ఈ బుల్లి గుడ్లగూబలు.. అయిదున్నర అంగుళాలు పొడవు మాత్రమే ఉంటాయట. అంటే, మన దగ్గర కనిపించే పిచ్చుకలంత అన్నమాట. అలాగని వీటిని తక్కువ అంచనా వేయకండి నేస్తాలూ.. ‘బుజ్జివే కదా.. వాటి చిట్టి పొట్టకు ఎంత ఆహారం అవసరం?’ అనుకుంటే మనం పొరపాటు పడినట్లే. అవి చూసేందుకు చిన్నగానే ఉన్నా, ఆహారం మాత్రం బాగానే తీసుకుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చిన్న చిన్న పురుగులు, కీటకాలు కనిపిస్తే చాలు.. గుటుక్కుమనిపిస్తాయట. గోల్ఫ్‌ బంతి కంటే చిన్నగా ఉండే ఇవి పరిశోధనలకు కూడా చాలా మంచి అంశమట.

అవే ప్రత్యేకం..

ఈ బుజ్జి గుడ్లగూబల తోక, శరీరంపైనుండే ఈకలు మిగతా వాటికంటే భిన్నంగా, చాలా మృదువుగా ఉంటాయట. ఈ జాతి జీవులు చాలా దూరాలు ప్రయాణిస్తాయి. వేసవి కాలంలో అరిజోనా నుంచి టెక్సాక్‌ వరకూ ఉన్న ఎడారులు, కొండల ప్రాంతాల్లో నివసిస్తాయి. శీతాకాలంలో మాత్రం మెక్సికో చుట్టుపక్కల ప్రదేశాల్లోకి వలస వెళ్లిపోతాయట. ఇవి మిగతా వాటిలాగే చెట్ల కాండాలకు రంధ్రాలు చేసుకొని, వాటిల్లోనే నివసిస్తాయి. అవి దాదాపు 13 అంగుళాల లోతు ఉంటాయి. ద్వారం మాత్రం అవి పట్టేంత పరిమాణంలో రెండు అంగుళాలే ఉంటుందట. వీటిలో ఆడవి ఒకటి నుంచి అయిదు గుడ్లు పెడతాయి. సూర్యుడి వేడి, వరదలు, ఇతర పక్షుల నుంచి ముప్పు తప్పించుకునేందుకు కొన్నిసార్లు వడ్రంగి పిట్టలు వదిలి వెళ్లిన గూళ్లనే, వాటి స్థావరంగా మార్చుకుంటాయట. ఇవి కూడా రాత్రి వేళల్లోనే వేటకు వెళ్తాయి. మగవి మాత్రం వివిధ శబ్దాలు చేస్తూ, వాటి ఉనికిని చాటుతూ ఉంటాయి. నేస్తాలూ.. బుజ్జి గుడ్లగూబల విశేషాలివీ..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని