అంకెలు, అక్షరాలతో బొమ్మలు!

కేరళలోని త్రివేండ్రానికి చెందిన జియా జయేశ్‌కు ప్రస్తుతం ఆరు సంవత్సరాలు. సాధారణంగా ఈ వయసు వారంతా ఎంచక్కా క్లాసులో కూర్చొని చిన్ని చిన్ని కథలు, బుజ్జి బుజ్జి లెక్కలతోపాటు రకరకాల యాక్టివిటీస్‌ చేస్తుంటారు.

Updated : 12 Sep 2023 01:07 IST

హాయ్‌ నేస్తాలూ.. మనలో చాలామంది ఎంతో ఇష్టంగా బొమ్మలు వేస్తుంటారు. స్కూళ్లలో, ఇతర కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించే పోటీల్లోనూ పాల్గొంటూ బహుమతులు సాధిస్తుంటారు. ఖాళీ సమయం దొరికితే చాలు.. డ్రాయింగ్‌ షీట్లతోపాటు ఇంట్లోని గోడలపైనా వారి ప్రతిభను ప్రదర్శిస్తుంటారు. అందరిలా గీస్తే గొప్ప ఏముంటుందని అనుకుందేమో.. ఓ నేస్తం మాత్రం అంకెలు, అక్షరాలతో బొమ్మలు వేస్తూ ఔరా అనిపిస్తోంది. మరి ఆ వివరాలేంటో తెలుసుకుందామా..!

కేరళలోని త్రివేండ్రానికి చెందిన జియా జయేశ్‌కు ప్రస్తుతం ఆరు సంవత్సరాలు. సాధారణంగా ఈ వయసు వారంతా ఎంచక్కా క్లాసులో కూర్చొని చిన్ని చిన్ని కథలు, బుజ్జి బుజ్జి లెక్కలతోపాటు రకరకాల యాక్టివిటీస్‌ చేస్తుంటారు. వర్క్‌ బుక్‌లోని బొమ్మలకు రంగులూ వేస్తుంటారు. వాటిని అందరికీ చూపించి ముచ్చటపడుతుంటారు. జియాకు కూడా చిన్నప్పటి నుంచి బొమ్మలు గీయడమంటే చాలా ఇష్టం. ‘అందులో కొత్త ఏముంది?’ అని అనుకోకండి నేస్తాలూ.. అంకెలు, అక్షరాలతో రకరకాల బొమ్మలను చకచకా గీసేస్తుంది. అంతేకాదు.. అలా బొమ్మలు గీస్తూ ఏకంగా ‘ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లోనూ స్థానం సంపాదించింది.  

కొత్తగా ఉండాలని..  

ప్రతి రోజూ స్కూల్‌ నుంచి రాగానే, గబగబా హోంవర్క్‌ పూర్తి చేసేస్తుందట జియా. ఆ తర్వాత పుస్తకాల్లో ఉన్న బొమ్మలను చూస్తూ గీస్తుంది. అలా మామూలు బొమ్మలు వేస్తూనే.. అంకెలు, ఆంగ్ల అక్షరాలతో ప్రాక్టీస్‌ చేయసాగింది. చాలా తక్కువ సమయంలోనే అంకెలు, అక్షరాలు ఉపయోగించి పక్షులు, జంతువుల బొమ్మలు గీయడం నేర్చేసుకుంది. మనం రోజూ టీవీల్లో చూసే కార్టూన్‌ సీరియళ్లలోని బొమ్మలనూ అచ్చు దింపేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే.. ప్రస్తుతం కేవలం గీతలతోనే బొమ్మలు గీయడం నేర్చుకుంటోందట. ఈ నేస్తం ఇటీవల ఓ పోటీలో 65 బొమ్మలను కేవలం 21 నిమిషాల 29 సెకన్లలోనే గీసేసి, మొదటి బహుమతి దక్కించుకుంది. పిల్లలూ.. ఈ నేస్తం ప్రతిభ భలే ఉంది కదూ..! అందుకే, మనమూ ఏదైనా కొత్తగా చేసి, గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం.. సరేనా!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని