ఆగుతూ.. సాగుతూ..!

హలో ఫ్రెండ్స్‌.. సాధారణంగా ఎవరైనా కొత్త ఇంటి నిర్మాణాన్ని ఏడాదిలోనో, రెండేళ్లలోనో పూర్తి చేస్తుంటారు.

Updated : 13 Sep 2023 00:55 IST

హలో ఫ్రెండ్స్‌.. సాధారణంగా ఎవరైనా కొత్త ఇంటి నిర్మాణాన్ని ఏడాదిలోనో, రెండేళ్లలోనో పూర్తి చేస్తుంటారు.

అదే పెద్ద పెద్ద గేటెడ్‌ కమ్యూనిటీల్లాంటివైతే నాలుగైదేళ్లు పడుతుంది. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే భవన నిర్మాణం మాత్రం దశాబ్దాలుగా సాగుతూనే ఉంది. ఇంతకీ అదెక్కడ ఉందో, ఆ వివరాలేంటో తెలుసుకుందామా..!!

ఉత్తర కొరియా అంటేనే మనకు అణ్వాయుధ ప్రయోగాలు, నియంత మాదిరి వ్యవహరించే ఆ దేశ అధ్యక్షుడు కిమ్‌ గుర్తొస్తారు. అక్కడి ప్యాంగాంగ్‌ నగరంలో ‘రుయాంగ్‌’ పేరిట ఓ భారీ హోటల్‌ నిర్మాణాన్ని 1987లో చేపట్టారు. కానీ, ఇప్పటికీ దాన్ని ప్రారంభించలేదు.

అనుకోవడం.. ఆగిపోవడం..

దాదాపు 1,080 అడుగుల ఎత్తయిన హోటల్‌ కట్టాలనే ప్రణాళికతో, 36 సంవత్సరాల క్రితం పనులను ప్రారంభించారు. మొదట 1992లో ఆర్థిక కారణాలతో ఈ నిర్మాణం ఆగిపోయింది. అప్పటికి కాంక్రీట్‌ పనులు మొత్తం అయిపోయాయి. మళ్లీ 2008లో పనులను చేపట్టినా, మూడేళ్లలో అద్దాలు అమర్చి బయటకు కనిపించే హంగులను పూర్తి చేశారట. అలా 2012లో దాన్ని ప్రారంభించాలని అనుకున్నా, ఏదో కారణంలో ఏడాదిపాటు వాయిదా పడింది. మళ్లీ 2018లో ఆ భవనానికి ఒకవైపు ఎల్‌ఈడీ దీపాలు అమర్చారు. అప్పటి నుంచి రాజకీయ అంశాలతోపాటు సినిమా ఫొటోలను ప్రదర్శించేందుకే దాన్ని పరిమితం చేశారు.

రికార్డుల్లోకీ ఎక్కేసింది..

ఇన్నేళ్లు నిర్మాణంలో ఉండి, ఇప్పటికీ అందుబాటులోకి రాకపోవడంతో ప్రపంచంలోనే ‘టాలెస్ట్‌ అన్‌ఆక్యుపైడ్‌ బిల్డింగ్‌’గా రికార్డు సాధించింది. ఒకవేళ అనుకున్న సమయానికి ఇది నిర్మాణం పూర్తి చేసుకొని ఉంటే, ప్రపంచంలోనే అతి ఎత్తయిన హోటల్‌గా నిలిచేది. ఇందులో గుండ్రంగా తిరిగే అయిదు రెస్టరంట్లతోపాటు మొత్తంగా 3000 గదులు ఉన్నాయట. ఇవేగాక, ఇందులో వ్యాపార సముదాయాలూ, నివాసాలనూ నిర్మించారు. నేస్తాలూ.. ఆగుతూ సాగుతూ పనులు పూర్తి చేసినా, ఇంకా ప్రారంభానికి నోచుకోని భవనం వివరాలివీ.. భలే వింతగా ఉన్నాయి కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు