అరుదైన జిరాఫీకి పేరు పెట్టారోచ్‌..!

అమెరికాలోని టెన్నెసె జూలో ఇటీవల ఓ జిరాఫీ బిడ్డకు జన్మనిచ్చింది. దాన్ని చూడగానే జూ సిబ్బందితోపాటు పర్యాటకులూ అవాక్కయ్యారట. ఎందుకూ అంటే.. అప్పుడే పుట్టిన ఆ బుజ్జి జిరాఫీ చర్మం, మిగతా వాటిలా కాకుండా ముదురు రంగులో ఉందట.

Published : 14 Sep 2023 00:00 IST

హలో ఫ్రెండ్స్‌.. మనకు జిరాఫీలు అనగానే శరీరంపైన అరచేయంత మచ్చలతో, పెద్ద మెడతో, అంతెత్తు ఉండే వాటి రూపం గుర్తుకొస్తుంది కదా! కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయేది మాత్రం అందుకు భిన్నం. ఇంతకీ ఆ జిరాఫీ ప్రత్యేకత ఏంటో మీరే చదివేయండి మరి..!

అమెరికాలోని టెన్నెసె జూలో ఇటీవల ఓ జిరాఫీ బిడ్డకు జన్మనిచ్చింది. దాన్ని చూడగానే జూ సిబ్బందితోపాటు పర్యాటకులూ అవాక్కయ్యారట. ఎందుకూ అంటే.. అప్పుడే పుట్టిన ఆ బుజ్జి జిరాఫీ చర్మం, మిగతా వాటిలా కాకుండా ముదురు రంగులో ఉందట. సాధారణంగా ఆ జాతి జీవులకు ఉండే అరచేయంత మచ్చలూ లేవట. ఇలా ముదురు రంగు చర్మం ఉన్న జిరాఫీ ప్రపంచంలో ఇదొక్కటేనట.

ఓటింగ్‌తో పేరు..

ఈ అరుదైన జిరాఫీకి ఓ పేరు పెట్టాలని జూ నిర్వాహకులు అనుకున్నారు. వారే కొన్ని పేర్లతో ఓ జాబితాను రూపొందించారు. అందులోంచి నాలుగింటిని ఫైనల్‌ చేశారు. వాటిలో ఏది ఎంపిక చేసుకోవాలో తెలియక, అందుకోసం ఆన్‌లైన్‌లో ఓటింగ్‌ నిర్వహించాలని అనుకున్నారు. వెంటనే ఆ నాలుగు పేర్లను జూకి సంబంధించిన వెబ్‌సైట్‌లో ఉంచారు. ఈ ఓటింగ్‌లో ‘కిపెకె’ పేరుకు ఎక్కువ ఓట్లు రావడంతో దాన్నే ఖరారు చేశారు. ఆ పదానికి స్థానిక భాషలో ‘యూనిక్‌’ అని అర్థమట. శరీరంపైన ఎటువంటి మచ్చలు లేని ఓ జిరాఫీ, 1972లో జపాన్‌ దేశ రాజధాని టోక్యోలోనూ ఉండేదట.

అన్ని జాగ్రత్తలు..

నెలల వయసున్న ఈ ‘కిపెకె’ జిరాఫీ అప్పుడే ఆరు అడుగుల ఎత్తు ఉందట. అరుదైనది కావడంతో దాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నామని జూ సిబ్బంది చెబుతున్నారు. సాధారణంగా ఈ జీవుల శరీరంపైన ఉండే గడుల్లాంటి ఆకారాల వెనక సైన్స్‌ కూడా దాగి ఉందట. వాటి చర్మంపైన ఉండే ఒక్కో మచ్చ వెనక కొన్ని వందల రక్తనాళాలు ఉంటాయట. వాటిల్లోంచే శరీరంలోని వేడి బయటకు వెళ్తుందని జిరాఫీ కన్జర్వేషన్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులు పేర్కొంటున్నారు. నేస్తాలూ.. ఈ అరుదైన ముదురు రంగు జిరాఫీ విశేషాలివి..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని