చిట్టి చేతులు... గట్టి చేతలు!

పలకా బలపం పట్టే చేతులతోనే సముద్రాన్ని జల్లెడ పట్టింది. సముద్ర జీవులకు ప్రాణాంతకంగా మారుతున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఏరివేస్తోంది. మన ఇల్లు, వీధి, ఊరిని ఎలాగైతే పరిశుభ్రంగా చూసుకుంటామో, సముద్రాన్ని కూడా అంతే స్వచ్ఛంగా ఉంచాల్సిన బాధ్యత మనుషులుగా మనదేనని చాటి చెబుతోంది.

Updated : 15 Sep 2023 00:39 IST

పలకా బలపం పట్టే చేతులతోనే సముద్రాన్ని జల్లెడ పట్టింది. సముద్ర జీవులకు ప్రాణాంతకంగా మారుతున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఏరివేస్తోంది. మన ఇల్లు, వీధి, ఊరిని ఎలాగైతే పరిశుభ్రంగా చూసుకుంటామో, సముద్రాన్ని కూడా అంతే స్వచ్ఛంగా ఉంచాల్సిన బాధ్యత మనుషులుగా మనదేనని చాటి చెబుతోంది. ఎంతో మందికి అవగాహన కల్పిస్తూ... వారిని చైతన్యవంతులుగా మారుస్తోంది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరు? తనలో ఈ స్ఫూర్తి నింపింది ఎవరో తెలుసుకుందామా ఫ్రెండ్స్‌!

బుడతా భక్తిగా పర్యావరణ పరిరక్షణకు తనవంతు కృషి చేస్తోన్న, చెన్నైకి చెందిన ఈ తొమ్మిదేళ్ల చిన్నారి పేరు థారాగై ఆరాధన. అయిదేళ్ల వయసున్నప్పటి నుంచే తన చిట్టి చేతులతో సముద్రం నుంచి ప్లాస్టిక్‌ వ్యర్థాలను వేరు చేస్తోంది. ఇందుకోసం ఈ చిన్నారి డైవింగ్‌ సైతం నేర్చుకుంది.

నాన్న స్ఫూర్తితో....

థారాగై వాళ్ల నాన్న పేరు అరవింద్‌ తరుణ్‌శ్రీ. ఆయన స్కూబా డైవింగ్‌లో నిపుణుడు. శిక్షణ కూడా ఇస్తుంటాడు. చాలా సంవత్సరాలుగా సముద్రం నుంచి ప్లాస్టిక్‌ వ్యర్థాలను వెలికితీస్తూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారు. అరవింద్‌ తన కూతురికి చిన్నతనంలోనే స్కూబా డైవింగ్‌లో శిక్షణ ఇచ్చారు. ఆ చిన్నారి తన తండ్రితోపాటే కలిసి సముద్ర జలాల పరిరక్షణకు కృషి చేస్తోంది.

తండ్రికి తగ్గ తనయ!

అరవింద్‌ ఇప్పటి వరకు దాదాపు 10,000 కిలోల ప్లాస్టిక్‌ వ్యర్థాలను సముద్రం నుంచి వెలికి తీశారు. వాటిని రీసైక్లింగ్‌ యూనిట్లకు తరలించారు. థారాగై తన తండ్రి సాయంతో ఇప్పటికే దాదాపు 1,000 కిలోల ప్లాస్టిక్‌ సీసాలను సముద్రం నుంచి వెలికి తీసింది. వీటిని అమ్మగా వచ్చిన డబ్బును తమిళనాడు రాష్ట్ర పర్యావరణ శాఖకు విరాళంగా అందిస్తోంది.

చిరుప్రాయంలోనే ఈత  

థారాగై తనకు రెండున్నరేళ్ల వయసున్నప్పుడే ఈత నేర్చుకుంది. అయిదేళ్ల ప్రాయానికి స్కూబా డైవింగ్‌లో ప్రావీణ్యం సాధించింది. అలాగే సముద్ర ఆవులు అనే పేరున్న డుగోంగ్‌ల పరిరక్షణకూ కృషి చేస్తోంది. సామాన్యులకూ అవగాహన కలిగించాలన్న ఉద్దేశంతో కొంతకాలం క్రితం ఈ చిన్నారి కేవ్‌లాంగ్‌ నుంచి నీలంకరి వరకు దాదాపు 19 కిలోమీటర్ల దూరాన్ని ఈది రికార్డు సృష్టించింది. ఒకవైపు చదువుల్లో రాణిస్తూనే... మరో వైపు పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తోంది. నేస్తాలూ.. మొత్తానికి థారాగై చాలా గ్రేట్‌ కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు