అరరే... ఇది అందమైనది!

నేస్తాలూ...! పంచవన్నెలతో నది జాలువారితే... ఆ ప్రకృతి వింతను చూడ్డానికి రెండు కళ్లూ చాలవు కదూ! ‘ప్చ్‌.. అయినా అది ఊహల్లో, కవితల్లో మాత్రమే సాధ్యం.

Published : 17 Sep 2023 00:11 IST

నేస్తాలూ...! పంచవన్నెలతో నది జాలువారితే... ఆ ప్రకృతి వింతను చూడ్డానికి రెండు కళ్లూ చాలవు కదూ! ‘ప్చ్‌.. అయినా అది ఊహల్లో, కవితల్లో మాత్రమే సాధ్యం. వాస్తవానికి అది అసాధ్యం’ అనుకుంటున్నారు కదా! అయితే మీరు నదిలో కాలేసినట్లే! ఎందుకంటే అయిదు వర్ణాలతో ఆకట్టుకునే నది నిజంగా ఉంది. ఇదంతా నిజంగా నిజం ఫ్రెండ్స్‌. ఈ కథనం చదివేయండి.. అసలు విషయం మీకే తెలుస్తుంది.

కానో క్రిస్టల్స్‌... అదేంటి నది అన్నారు. అయిదు రంగులు అంటున్నారు. మళ్లీ క్రిస్టల్స్‌ ఏంటబ్బా! అని ఆశ్చర్యపోకండి. ఇది ఆ వింత నది పేరు. ఇది కొలంబియాలో ఉంది. సెరానియా డిలా మకరేనాలో ఉన్న ప్రధాన పర్వత శ్రేణి నుంచి వేరైన పర్వతాల్లో పుట్టింది. ఇది గుయాబెరో నదికి ఉపనది.

అప్పుడెప్పుడో 1969లో...

కానో క్రిస్టల్స్‌ నదిని పశువుల పెంపకందారులు 1969వ సంవత్సరంలో కనుగొన్నారు. జులై చివరి నుంచి నవంబరు వరకు ఈ నది పసుపు, ఆకుపచ్చ, నీలం, నలుపు, ఎరుపు రంగుల్లో కనువిందు చేస్తుంది. అందుకే దీన్ని ముద్దుగా ‘అయిదు రంగుల నది’, ‘లిక్విడ్‌ రెయిన్‌బో’ అని పిలుస్తారు.  

మొక్కే కదా అని...

ఈ నది ఇలా అయిదు రంగుల్లో మెరిసిపోవడానికి ప్రధాన కారణం ‘రైన్‌కోలాసిస్‌ క్లావిగెరా’. ‘అయ్య బాబోయ్‌! మళ్లీ ఇదేంటి. పలకడానికి నోరు కూడా తిరగడం లేదు’ అని అలా బుంగమూతి పెట్టుకోకండి నేస్తాలు. ఇది నాచులా ఉండే పుష్పించే ఓ మొక్కజాతి పేరు. దీని వల్లే ఈ నది పంచవర్ణాల్లో కనువిందు చేస్తోంది.

స్వచ్ఛమే... ఇది స్వచ్ఛమే!

రైన్‌కోలాసిస్‌ క్లావిగెరా అనే మొక్క ముందు ఆకుపచ్చగా ఉంటుంది. తర్వాత పసుపు, నీలం, నలుపు రంగులోకి మారుతుంది. ఇక ఆఖరుగా ఎరుపురంగులో కనిపిస్తుంది. ఈ మొక్కలు రాళ్లను ఆనుకొని పెరుగుతాయి. కానో క్రిస్టల్స్‌ నదిలో నీళ్లు చాలా స్వచ్ఛంగా ఉంటాయి. అందుకే అక్కడి నీళ్లలో వివిధ దశల్లో ఉన్న మొక్కలు అయిదు వర్ణాలుగా కనువిందు చేస్తాయి. ఈ నదిలో నీళ్లు చాలా వేగంగా ప్రవహిస్తాయి. జలపాతాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. నీటి ప్రవాహాల వల్ల ఏర్పడిన, జెయింట్‌ కెటిల్స్‌ అనే పేరున్న చిన్న చిన్న వృత్తాకార గుంతలూ ఉన్నాయి. ఇవన్నీ కానో క్రిస్టల్స్‌ను ప్రపంచంలోనే అందమైన నదిగా మార్చాయి. అందుకే ఈ ప్రకృతి వింతను చూడ్డానికి వేల సంఖ్యలో దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. ఈ నది అందాలను చూస్తూ మైమరిచిపోతుంటారు. నేస్తాలూ మొత్తానికి ఈ అయిదు రంగుల నది సంగతులు.. భలే ఉన్నాయి కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని