అక్కుపక్షిని కాదు... నేనో ముక్కు పక్షిని!

హాయ్‌ ఫ్రెండ్స్‌! ఏంటి మీరు అలా నా ముక్కు వంకే చూస్తున్నారు. బాబోయ్‌... నాకు తెగ సిగ్గేస్తోంది. కాసేపు అలా గుచ్చిగుచ్చి చూడ్డం ఆపండి సరేనా. అయినా మీ అనుమానం ఏంటో నాకు అర్థమైంది.

Published : 18 Sep 2023 00:24 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌! ఏంటి మీరు అలా నా ముక్కు వంకే చూస్తున్నారు. బాబోయ్‌... నాకు తెగ సిగ్గేస్తోంది. కాసేపు అలా గుచ్చిగుచ్చి చూడ్డం ఆపండి సరేనా. అయినా మీ అనుమానం ఏంటో నాకు అర్థమైంది. ‘నీ ముక్కేంటి? ఇంత పొడవుగా ఉంది. అసలింతకీ నువ్వేం పక్షివబ్బా?’ అనేగా మీ సందేహం. మీరేం కంగారు పడకండి సరేనా! నా గురించి మీకు చెప్పి పోదామనే ఇదిగో ఇలా రెక్కలు కట్టుకుని మీ ముందుకు వచ్చి వాలాను. మరి నా సంగతులేంటో తెలుసుకుంటారా!

గుప్పెడంత కూడా లేని నేనో హమ్మింగ్‌బర్డ్‌ను. అలా అని మామూలు హమ్మింగ్‌బర్డ్‌ను కాదు... కత్తిలాంటి ముక్కున్న హమ్మింగ్‌బర్డ్‌ను. నన్ను స్వోర్డ్‌బిల్‌ అనికూడా పిలుస్తుంటారు. నేను దక్షిణ అమెరికాకు చెందిన పక్షిని. మా జాతి పక్షుల్లో నేనే కాస్త పెద్దదాన్ని. నేను నా ముక్కుతో కలిపి 13 నుంచి 14 సెంటీమీటర్ల వరకు పొడవు పెరుగుతాను. ఇక నా బరువేమో కేవలం 15 గ్రాములు ఉంటుంది. తోకను మినహాయిస్తే... నా శరీరం కంటే కూడా నా ముక్కే పొడవుగా ఉంటుంది.

స్ట్రాలా వాడతానోచ్‌!

నేను నా పొడవాటి ముక్కును ఎంచక్కా స్ట్రాలా ఉపయోగించుకుంటాను. దీని సాయంతోనే నేను హాయిగా పువ్వుల్లోని మకరందాన్ని పీల్చుకుంటాను. అన్నట్లు నేను కేవలం మకరందాన్ని మాత్రమే తాగి బతకను. చిన్న చిన్న పురుగుల్ని కూడా కరకరలాడించేస్తా. ఈ విషయంలోనూ పొడవాటి ముక్కు నాకు చక్కగా ఉపయోగపడుతుంది. ఓ రకంగా చెప్పాలంటే.. ముక్కే నా ఆయుధం.

ప్చ్‌... పెద్దగా కూయలేను!

‘పిట్ట కొంచెం... కూత ఘనం’ అంటుంటారు కదా! నా విషయంలో మాత్రం ఇది నిజం కాదు. ఎందుకంటే.. ప్చ్‌...! నేను పెద్దగా కూయలేను. చాలా చిన్న చిన్న శబ్దాలను మాత్రమే చేస్తాను. కొలంబియా, ఈక్వెడార్‌లలో ఎక్కువగా కనిపిస్తుంటాను. పెరూ నుంచి బొలీవియా వరకు ఉన్న అడవుల్లో  నివసిస్తుంటాను. పశ్చిమ వెనిజులాలోనూ నా ఉనికి ఉంది. నేను సముద్రమట్టానికి దాదాపు 1,700 నుంచి 3,500 మీటర్ల ఎత్తులో తేమతో కూడిన పర్వతప్రాంత అడవుల్లో జీవించడానికి ఇష్టపడతాను. నేను చిన్న చిన్న ప్రయాణాలు చేస్తాను కానీ... సాధారణంగా వలస మాత్రం పోను.

చిన్ని చిన్ని రెక్కలతో...

నేను కూడా హమ్మింగ్‌ బర్డ్‌నే కాబట్టి చక్కగా వెనక్కి కూడా ఎగరగలను. ప్రపంచంలో ఇక ఇతర పక్షులేవీ కూడా మాలా వెనక్కి ఎగరలేవు. మీకు ఈ విషయం ఇంతకు ముందే తెలుసు కదా!! పర్యావరణ మార్పులు, అడవుల నరికివేత వల్ల మా సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. మాలో ఆడపక్షులు ఒక్కసారికి కేవలం రెండు గుడ్లు మాత్రమే పెడతాయి. మా సంఖ్య ఎక్కువగా పెరగకపోవడానికి ఇది కూడా ఓ కారణం. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ మా విశేషాలు. ఇక ఉంటామరి.. బై.. బై..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని