సముద్రం శిరస్సున సరస్సు!

‘తెలిసింది గోరంత... తెలియాల్సింది కొండంత...’ ప్రకృతి వింతలకు ఈ వాక్యం సరిగ్గా సరిపోతుంది. మన చుట్టూనే ఎన్నో చిత్రవిచిత్రాలు, మరెన్నో అద్భుతాలుంటాయి.

Published : 20 Sep 2023 00:09 IST

‘తెలిసింది గోరంత... తెలియాల్సింది కొండంత...’ ప్రకృతి వింతలకు ఈ వాక్యం సరిగ్గా సరిపోతుంది. మన చుట్టూనే ఎన్నో చిత్రవిచిత్రాలు, మరెన్నో అద్భుతాలుంటాయి. మనకు తెలిసినవి కొన్నే! తెలుసుకోవాల్సినవి చాలానే ఉన్నాయి. అలాంటి ఓ వింత గురించే ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. నేస్తాలూ! మరి మీరు సిద్ధమేనా!! ‘ఓ.. సిద్ధం!’ అనేసి ఊరుకుంటే సరిపోదు!! మీరు మరో చిన్న పని కూడా చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్‌. అదేంటంటే ఎంచక్కా ఈ కథనాన్ని చదివేయడమే..! అంతే!! మరి ఇంకెందుకాలస్యం..!

సాధారణంగా నదులు ప్రవహించి చివరికి సముద్రాల్లో కలుస్తాయి కదా! కానీ సర్వాగ్‌ స్వాటన్‌ అనే సరస్సు మాత్రం సముద్రం శిరస్సునే ఉండి.. ఓ జలపాతంలా ప్రవహించి చివరికి కడలిలో కలుస్తుంది. ఈ వింత సరస్సు డెన్మార్క్‌లోని ఫోరే ద్వీపంలో ఉంది. ఈ జలవనరు విస్తీర్ణం దాదాపు 3.4 చదరపు కిలోమీటర్లు. ఇది సర్వాగూర్‌, వాగర్‌ అనే రెండు ప్రాంతాల మధ్య ఉంది.

పేరులోనూ వివాదం!

ఈ సరస్సే ఒక వింత అనుకుంటే...! మళ్లీ దీని పేరు విషయంలోనూ వివాదం ఉంది. కొందరేమో దీని పేరు సర్వాగ్‌ స్వాటన్‌ అని, ఇంకొందరేమో లైటీస్వాటన్‌ అని వాదిస్తుంటారు. మరో విశేషం ఏంటంటే.. వీళ్లంతా స్థానికులే. కానీ ఎక్కువగా సర్వాగ్‌ స్వాటన్‌ అనే పేరే వాడుకలో ఉంది!

కడలికి కిరీటంలా...!!

ఈ విచిత్ర సరస్సు ఉపరితలం సముద్రమట్టానికి దాదాపు 40 మీటర్ల ఎత్తులో ఉంటుంది. కానీ దూరం నుంచి చూస్తే మాత్రం ఇంకా చాలా ఎత్తులో ఉన్నట్లు భ్రమను కలిగిస్తుంది. చుట్టూ ఉన్న ఎత్తైన కొండలు ఈ సరస్సును సముద్రం నుంచి వేరు చేస్తున్నాయి. ఈ శిఖరాల వల్ల సరస్సులోని నీరంతా ఒకేసారి సముద్రంలో కలవకుండా నిల్వ ఉంటోంది. దీంతో ఇది కడలికి కిరీటంలా కనువిందు చేస్తోంది. చివరికి ఓ జలపాతం ద్వారా కొద్ది కొద్దిగా సరస్సు నీరు సముద్రంలో కలుస్తోంది.

శత్రువుల కంటపడకుండా...!

ఈ ఫోరే దీవులకు చారిత్రక నేపథ్యం కూడా ఉంది. రెండో ప్రపంచయుద్ధ సమయంలో వీటిని బ్రిటీష్‌ వారు ఆక్రమించారు. జర్మన్‌ సైనికులను సమర్థంగా ఎదుర్కొనేందుకు వ్యూహాత్మకంగా ఈ దీవులను వారు ఉపయోగించుకున్నారు. సీ ప్లెయిన్‌ల కోసం ఓ స్టేషన్‌ను కూడా నిర్మించారు. శత్రువుల కంటపడకుండా, వారి మీద అకస్మాత్తుగా దాడి చేయాలనే ఉద్దేశంతోనే ఇలా చేశారు. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ వింత సరస్సు విశేషాలు. భలే ఉన్నాయి కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని