బాబోయ్‌.. బాహుబలి ‘డోనట్‌ కేక్‌’!

హాయ్‌ నేస్తాలూ.. ఇంట్లో అన్నం తినమని అమ్మ ఎంత బతిమిలాడినా, మనం మొండికేస్తుంటాం. అదే బర్గర్లు, పిజ్జా, కేకుల్లాంటి జంక్‌ఫుడ్‌ అనగానే ఎగిరి గంతేస్తాం.

Published : 21 Sep 2023 01:49 IST

హాయ్‌ నేస్తాలూ.. ఇంట్లో అన్నం తినమని అమ్మ ఎంత బతిమిలాడినా, మనం మొండికేస్తుంటాం. అదే బర్గర్లు, పిజ్జా, కేకుల్లాంటి జంక్‌ఫుడ్‌ అనగానే ఎగిరి గంతేస్తాం. అయితే, ఇప్పుడిదంతా ఎందుకూ అంటే.. ఇటీవలే ఓ ఇద్దరు చెఫ్‌లు కలిసి ప్రపంచంలోనే అతిపెద్ద డోనట్‌ కేక్‌ను తయారు చేశారు. మరి ఆ విశేషాలేంటో తెలుసుకుందామా..!

మెరికాకు చెందిన నిక్‌ డిజియోవన్నీ అలియాస్‌ లిన్‌ డవిస్‌ అనే ఓ చెఫ్‌ యూట్యూబ్‌లో తన వంటల వీడియోలతో అలరిస్తుంటాడు. రకరకాల పదార్థాలను వండుతూ.. కోట్లల్లో వీక్షకులను సంపాదించుకున్నాడు. కాస్త వెరైటీ కోసం జపాన్‌కు చెందిన మరో చెఫ్‌ లింజాతో కలిసి అతి పెద్ద బాహుబలి డోనట్‌ కేక్‌ను తయారు చేయాలని అనుకున్నాడు. డోనట్‌ అంటే తెలుసు కదా.. గుండ్రంగా ఉండి, పైన చాక్లెట్‌ తదితర ఫ్లేవర్లను పూతలా పోస్తారు. దాదాపు ఎనిమిది గంటలు కష్టపడి మరీ, ‘వరల్డ్‌ లార్జెస్ట్‌ డోనట్‌ కేక్‌’ను తయారు చేశారు. అంతేకాదు.. ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లోనూ స్థానం దక్కించుకున్నారు.  

ఒక్కో వరస పూర్తి చేస్తూ..  

మొదట కేక్‌ ముక్కలను ట్రేలల్లో బేక్‌ చేసి, వాటన్నింటినీ గుండ్రంగా అమర్చారు. అలా మొత్తం వందకు పైగా ట్రేలను సిద్ధం చేశారు. వాటిపైన క్రీమ్‌ను రాస్తూ.. ఒక అడుగు ఎత్తున్న డోనట్‌ కేక్‌ను తయారు చేశారు. మన దగ్గరి బేకరీల్లో అరచేతిలో ఇమిడిపోయే చిన్న డోనట్‌లను మీరు చూసే ఉంటారు.. అలాంటివి 1500 కలిస్తే, ఎంత పెద్దగా ఉంటుందో.. ఈ అంకుల్స్‌ కలిసి రూపొందించింది అంత భారీగా ఉంటుందట. దాని బరువు 102.5 కిలోలు. ఈ వరల్డ్‌ లార్జెస్ట్‌ డోనట్‌ కేక్‌ తయారీకి ఆయిల్‌, బ్రౌన్‌ షుగర్‌, గుడ్లు, క్రీమ్‌లాంటివి వినియోగించారు. దీని తయారీకి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసిన కొన్ని నిమిషాల్లోనే లక్షల మంది వీక్షించారట.

ముక్కలుగా చేసి..  

ఈ ఇద్దరు చెఫ్‌లకు గిన్నిస్‌ రికార్డు రావడం ఇది మొదటిసారి కాదట. గతంలో ‘లార్జెస్ట్‌ కేక్‌పాప్‌’, ‘లార్జెస్ట్‌ చికెన్‌ నగ్గెట్‌’, ‘లార్జెస్ట్‌ సూషి రోల్‌’ తయారు చేసి.. గిన్నిస్‌లో చోటు దక్కించుకున్నారు. మరి, ‘ఆ డోనట్‌ కేక్‌ను ఏం చేశారబ్బా?’ అనే సందేహం మీకు వచ్చే ఉంటుంది కదా.. రికార్డు నమోదు చేసిన తర్వాత, దాన్ని ముక్కలుగా కోసి రోడ్లపైన నివసించే వారికి పంచిపెట్టారట. పిల్లలూ.. ‘వరల్డ్‌ లార్జెస్ట్‌ డోనట్‌ కేక్‌’ విశేషాలివీ.. మీకు ఈపాటికే నోరూరిపోయి ఉంటుంది కదూ.. కానీ, ఇవన్నీ ఆరోగ్యానికి అంత మంచివి కాదని వైద్యులు చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని