ది గ్రేట్‌ ‘ఇరాన్‌ మాల్‌’..!

హలో నేస్తాలూ.. సెలవు రోజుల్లో మనం సినిమాకో, ఏదైనా కొనుగోలు చేసేందుకో షాపింగ్‌ మాల్స్‌కు వెళ్తుంటాం కదూ! మరి, మీకెప్పుడైనా ‘ప్రపంచంలోనే అతి పెద్ద షాపింగ్‌ మాల్‌ ఏది?’ అనే సందేహం వచ్చిందా? ఎప్పుడో ఒకసారి వచ్చే ఉంటుంది కదా..

Updated : 22 Sep 2023 05:15 IST

హలో నేస్తాలూ.. సెలవు రోజుల్లో మనం సినిమాకో, ఏదైనా కొనుగోలు చేసేందుకో షాపింగ్‌ మాల్స్‌కు వెళ్తుంటాం కదూ! మరి, మీకెప్పుడైనా ‘ప్రపంచంలోనే అతి పెద్ద షాపింగ్‌ మాల్‌ ఏది?’ అనే సందేహం వచ్చిందా? ఎప్పుడో ఒకసారి వచ్చే ఉంటుంది కదా.. ఇప్పుడు మనం ఆ విశేషాలే తెలుసుకోబోతున్నాం..

షాపింగ్‌ మాల్స్‌ అనగానే మనకు అమెరికా, దుబాయ్‌ తదితర ప్రాంతాలే గుర్తుకొస్తాయి. కానీ, విస్తీర్ణపరంగా ప్రపంచంలోనే అతిపెద్ద షాపింగ్‌ మాల్‌ ఇరాన్‌లో ఉంది. ఇది కాస్త ఆశ్చర్యం కలిగించేదే అయినా కానీ, నిజమే నేస్తాలూ.. టెహరాన్‌ నగరానికి సమీపంలో ఉన్న ‘ఇరాన్‌ మాల్‌’ దాదాపు 1.35 మిలియన్‌ చదరపు మీటర్ల విస్తీర్ణంలో, ఏడు అంతస్తుల్లో నిర్మితమైంది. త్వరలోనే మరో 1.60 మిలియన్‌ చదరపు మీటర్లు విస్తరించనున్నారట.

ఏడు వందలకు పైగా స్టోర్లు

ఈ మాల్‌ నిర్మాణ పనులను 2014లో ప్రారంభించారు. దాదాపు 1200 మంది కాంట్రాక్టర్లు, పాతిక వేల మంది కార్మికులు రేయింబవళ్లు కష్టపడి, 2018లో మొదటి దశ పనులను పూర్తి చేశారు. ఇందులో మొత్తం వివిధ కంపెనీలకు చెందిన 708 దుకాణాలు ఏర్పాటయ్యాయి. వీటిలో అంతర్జాతీయ బ్రాండ్లకు సంబంధించిన స్టోర్లూ ఉన్నాయట. అదే సంవత్సరంలో ఈ మాల్‌కు గిన్నిస్‌ రికార్డు కూడా వచ్చింది. వరసగా ఆరు రోజుల పాటు కాంక్రీటును పోస్తూ.. పనులను నిర్వహించినందుకు ఈ ఘనత దక్కిందట.

చారిత్రక కళ ఉట్టిపడేలా..  

ఇరాన్‌ మాల్‌లో వినోదానికి ఏ లోటూ లేదు. ఇందులో డజను సినిమా స్క్రీన్లు ఉన్నాయి. వాటితోపాటు 2000 సీట్ల సామర్థ్యంతో స్టేట్‌ ఆఫ్‌ ఆర్ట్‌ థియేటర్‌, ఆన్‌సైట్‌ మ్యూజియం, వివిధ ఆర్ట్‌ గ్యాలరీలు ఉన్నాయట. అంతేకాదు నేస్తాలూ.. ఈ మాల్‌లో అమ్యూజ్‌మెంట్‌ పార్కు, రూఫ్‌టాప్‌ టెన్నిస్‌ కోర్టు, భారీ కన్వెన్షన్‌ సెంటర్‌, రెస్టరంట్లు, కాన్ఫరెన్సు హాళ్లు.. ఇలా హంగులకు లెక్కే లేదట. త్వరలోనే ఒక ఫైవ్‌స్టార్‌ హోటల్‌తోపాటు స్పోర్ట్స్‌ సెంటర్‌నూ అందుబాటులోకి తీసుకురానున్నారు. ఏదైనా భవనం అనగానే ముఖ్యంగా దాని డిజైనే ముందు గుర్తుకొస్తుంది. ఈ మాల్‌లోనూ కొన్ని ప్రదేశాలను పర్షియన్‌ సంస్కృతి ఉట్టిపడేలా తీర్చిదిద్దారట. మరికొన్నింటిని పామ్‌ చెట్లు, ఫౌంటెయిన్లతో ముస్తాబు చేశారు.

బోలెడు ప్రత్యేకతలు..

ఇలా చెప్పుకొంటూ వెళ్తే, ఈ మాల్‌లో బోలెడు ప్రత్యేకతలున్నాయి. వాటన్నింటిలోకెల్లా ‘మిర్రర్‌ హాల్‌’ను తప్పకుండా చూసి తీరాల్సిందేనట. ఎందుకూ అంటే.. దాదాపు 38 లక్షలకు పైగా వేర్వేరు అద్దాల ముక్కలతో దీన్ని తీర్చిదిద్దారట. ఇక్కడి లైబ్రరీలో సుమారు 45 వేల పుస్తకాలు ఉన్నాయి. వాటితోపాటు వివిధ అంశాలకు సంబంధించిన డాక్యుమెంట్లనూ ఇక్కడ భద్రపరిచారు. నేస్తాలూ.. అతి పెద్ద షాపింగ్‌ మాల్‌ విశేషాలివీ.. చదువుతుంటేనే అవాక్కయ్యేలా ఉంది కదూ..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని