అరుదైన జీవిని నేను!

హాయ్‌ నేస్తాలూ... బాగున్నారా?! నేను ఎవరో మీకు తెలుసా? చూడ్డానికి కాస్త టోపీలా కనిపిస్తున్న నేను, నిజానికి ఓ ఆక్టోపస్‌ను! నేను చాలా అరుదైన జీవిని. నాకు తెలిసి మీరు ఇప్పటి వరకు నన్ను చూసి ఉండరు.

Published : 25 Sep 2023 00:02 IST

హాయ్‌ నేస్తాలూ... బాగున్నారా?! నేను ఎవరో మీకు తెలుసా? చూడ్డానికి కాస్త టోపీలా కనిపిస్తున్న నేను, నిజానికి ఓ ఆక్టోపస్‌ను! నేను చాలా అరుదైన జీవిని. నాకు తెలిసి మీరు ఇప్పటి వరకు నన్ను చూసి ఉండరు. అందుకే నా విశేషాలు మీకు చెప్పిపోదామని, ఇదిగో ఇలా వచ్చాను. ఇంకెందుకాలస్యం నా గురించి తెలుసుకోండి మరి.

నా పేరు గ్రిమ్పోటీథిస్‌. మీకు పలకడానికి ఇబ్బందిగా ఉంది కదూ! ఎంచక్కా డంబో ఆక్టోపస్‌ అని పిలుచుకోండి ఫర్లేదు. మాలో మళ్లీ 17 జాతులు ఉన్నాయి. మా జీవిత కాలం కేవలం మూడు నుంచి అయిదు సంవత్సరాలు మాత్రమే. 8 నుంచి 12 అంగుళాల వరకు పెరుగుతాం. దాదాపు 6 కిలోల వరకు బరువు తూగుతాం. మేం దాదాపు ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాం. సముద్రాల్లో సుమారు 1000 నుంచి 7000 మీటర్ల లోతుల్లో జీవిస్తాం. ఒరెగాన్‌, ఫిలిప్పీన్స్‌, మార్తాస్‌ వెన్యార్డ్‌, అజోర్స్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, కాలిఫోర్నియా, గల్ఫ్‌ఆఫ్‌ మెక్సికో, పాపువా, న్యూగినియా తీరాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాం. సముద్రంలో అత్యంత లోతున జీవించే ఆక్టోపస్‌లం మేమే. అలా అని మేం ఎప్పుడూ లోతులోనే ఉండిపోం. అప్పుడప్పుడూ అలా సరదాగా తీరాల్లోకీ వస్తుంటాం. మాకు చెవుల్లా ఉండే రెక్కలుంటాయి. వేగంగా ఈదడానికి, దిశ మార్చుకోవడానికి ఇవి చక్కగా ఉపయోగపడతాయి. మేం చిన్న చిన్న చేపల్ని, ఇతర సముద్ర జీవుల్ని ఆహారంగా తీసుకుంటాం. మీకో విషయం తెలుసా.. మేం వాటిని నమలం.. అమాంతం మింగేస్తాం

మాది నీలి రక్తం...

గతంతో పోల్చుకుంటే మా సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. పెద్ద పెద్ద చేపలు, షార్క్‌లు, తిమింగలాలు, సీల్స్‌ మమ్మల్ని ఎక్కువగా వేటాడుతాయి. మీ మనుషుల వల్ల కూడా మేం తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటున్నాం. అందుకే మా సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. మా రక్తం నీలి రంగులో ఉంటుంది. కాపర్‌ పరిమాణం ఎక్కువగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. అలాగే మాకు మూడు గుండెలుంటాయి.

చీకట్లోనూ చూస్తాం...

మాకున్న పెద్ద పెద్ద కళ్ల సాయంతో మేం చీకట్లోనూ చక్కగా చూడగలుగుతాం. ప్రమాదంలో ఉన్నప్పుడు మిగతా ఆక్టోపస్‌లు ఇంక్‌లాంటి ద్రవాన్ని చిమ్మి శత్రువు నుంచి తప్పించుకుంటాయి. కానీ దురదృష్టవశాత్తూ.. మాకు అలాంటి ఏర్పాటు లేదు. అందుకేనేమో మేం శత్రువుల కంటపడకుండా ఉండేందుకు ఎక్కువగా సముద్రలోతుల్లోనే తచ్చాడుతుంటాం. అన్నట్లు మేం ఊసరవెల్లిలా రంగులూ మార్చగలం తెలుసా. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ మా విశేషాలు. ఇక ఉంటామరి.. బై.. బై...!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని