అలా ఎలా అలల్లా కట్టారో!

హాయ్‌ నేస్తాలూ...! మీరంతా ఇప్పటి వరకు రకరకాల వంతెనలు చూసి ఉంటారు. అన్నింట్లోకెల్లా కొంత వింతగా అనిపించేవి గాజు వంతెనలు.

Updated : 26 Sep 2023 01:12 IST

హాయ్‌ నేస్తాలూ...! మీరంతా ఇప్పటి వరకు రకరకాల వంతెనలు చూసి ఉంటారు. అన్నింట్లోకెల్లా కొంత వింతగా అనిపించేవి గాజు వంతెనలు. ఈ మధ్య అయితే వీటి పేరు ఎక్కువగా వినిపిస్తోంది కదా..! అలాంటి గాజు వంతెనే ఒకటి చైనాలో కూడా ఉంది. అయితే అది ఇంకాస్త ప్రత్యేకమైంది. ఆ వివరాలు ఏంటో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా.. అయితే వెంటనే ఈ కథనం చదివేయండి.. సరేనా!

చైనా అనగానే ఎన్నో వింతైన, విశేషమైన పర్యాటక ప్రాంతాలు గుర్తొస్తాయి. అందులో ఇప్పుడు మనం చెప్పుకోబోయే వంతెన కూడా ఒకటి. దాని పేరే ‘రుయి బ్రిడ్జి’. పచ్చని ప్రకృతిలో రెండు కొండలను కలుపుతున్నట్లు ఎంతో అద్భుతంగా కనిపిస్తుందీ గాజు వంతెన. ఆ ప్రాంతానికి వెళ్లినవాళ్లు కొందరు ఈ వంతెన మూడు అలలు కదులుతున్నట్లుగా ఉంటుందనీ.. మరి కొందరు ఆకాశానికి, భూమికీ మధ్యలో ఉన్న ఒక కన్నులా కనిపిస్తోందని చెబుతున్నారు. దీన్ని చైనాలోని జెజియాంగ్‌ ప్రావిన్స్‌లోని షెంజియాంజ్‌ దగ్గర నిర్మించారు.

మెట్లూ ఉన్నాయి

ఈ అద్భుతమైన గాజు వంతెనకు రూపకర్త ‘హీ యున్‌చాంగ్‌’ అనే ఓ ప్రఖ్యాత ఇంజినీర్‌. ఈ వంతెనను ఓచోట మూడు దారులుగా విభజించారు. మళ్లీ ఇంకోచోట కలిపినట్లుగా భలే అద్భుతంగా నిర్మించారు. అంతేకాకుండా దీనిపై సులువుగా నడవటానికి మెట్లు కూడా ఉన్నాయి. మొత్తానికి మేఘాలకు హాయ్‌ చెబుతూ... ఎంచక్కా ఈ వంతెన మీద నడవడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు.సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటూ సోషల్‌ మీడియాలో తెగ అప్‌లోడ్‌ చేస్తున్నారు.

లక్షల్లో పర్యాటకులు..!

రుయి వంతెన నిర్మాణం 2017లో మొదలుపెట్టారు. 2020 సెప్టెంబరులో దీన్ని ప్రారంభించి, పర్యాటకులకు అనుమతి కల్పించారు. అతి తక్కువ సమయంలో దీనికి మంచి ఆదరణ లభించింది. నెల రోజుల్లోనే దాదాపు రెండు లక్షల మంది సందర్శకులు ఇక్కడికి వచ్చారు. ఇంకో విషయం ఏంటంటే స్థానికులు ఆ వంతెనను ‘బెండింగ్‌ బ్రిడ్జి’ అని పిలుస్తారట. దీని ఎత్తు 140 మీటర్లు. పొడవేమో 100 మీటర్లు. నేస్తాలూ... మొత్తానికి ఇవీ ఈ గాజు వంతెన విశేషాలు. భలే ఉన్నాయి కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని