కొరకరాని కొయ్యను నేను!

హాయ్‌ నేస్తాలూ... బాగున్నారా?! ఏంటి నన్ను చూసి అలా భయపడుతున్నారు. మరేం ఫరవాలేదు. నేనేం మీకు హాని చేయను. విషపూరితం కూడా కాను.

Published : 27 Sep 2023 02:07 IST

హాయ్‌ నేస్తాలూ... బాగున్నారా?! ఏంటి నన్ను చూసి అలా భయపడుతున్నారు. మరేం ఫరవాలేదు. నేనేం మీకు హాని చేయను. విషపూరితం కూడా కాను. ‘మరి నీకు ఒంటి నిండా ఆ కొమ్ములెందుకు?’ అని మీరు నన్ను అడగాలనుకుంటున్నారు కదూ! మీ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి, మీ సందేహాలు తీర్చడానికే... ఇదిగో ఇలా మీ ముందుకు వచ్చాను. మరి ఇంకెందుకాలస్యం? నా గురించి తెలుసుకుంటారా?!

నా పేరు ఫ్రైనోసోమా కార్నటమ్‌. వినడానికి వింతగా... పలకడానికి ఇబ్బందిగా ఉంది కదూ! నన్ను ‘టెక్సాస్‌ హార్డ్న్‌ లిజర్‌్్డ’ అని కూడా పిలుస్తారు. మీరు ఎంచక్కా కొమ్ముల బల్లి అని పిలుచుకోండి సరేనా! నేను ఉత్తర అమెరికాకు చెందిన జీవిని. మెక్సికోలో ఎక్కువగా కనిపిస్తుంటాను. చూడ్డానికి కొమ్ములతో భయంకరంగా కనిపిస్తుంటాను కానీ.. చాలా అమాయకపు జీవిని. నేనేంటో నా పనేంటో... అన్నట్లు బతికేస్తాను. ఎవరి జోలికీ వెళ్లను. అలా అని నా జోలికి వస్తే మాత్రం ఊరుకోను. పోనీ నేను దాడి చేస్తానా.. అనుకుంటే అదీ పొరపాటే. కేవలం ఆత్మరక్షణ చేసుకుంటానంతే.

విచ్చుకుంటాయి.. గుచ్చుకుంటాయి!

నా శరీరాన్ని నేను పెద్దదిగా చేసుకుంటాను. దీంతో కొమ్ములు విచ్చుకుంటాయి. అప్పుడు నా శత్రువుకు నన్ను మింగడం చాలా కష్టం అవుతుంది. అయినా మొండిగా ప్రయత్నించాయనుకోండి.. నా కొమ్ముల వల్ల ఆ జీవి నోట్లో తీవ్రగాయాలవుతాయి. అందుకే పాములు, పెద్ద పెద్ద తొండలు, నక్కలు, పిల్లులు, అడవికుక్కల్లాంటి జంతువులకు నేను కొరకరాని కొయ్యనే! మరో విషయం ఏంటంటే.. ఆపద సమయంలో కళ్లు, నోటి నుంచి రక్తాన్ని చిమ్ముతాను. రక్త సరఫరాను నియంత్రించి బీపీ పెరిగేలా చేసుకుంటా. కళ్లు, నోటిలోని చిన్న చిన్న రక్తనాళాలు చిట్లి, రక్తం చిమ్మేలా ప్రతిస్పందిస్తాను. దీంతో నా శత్రువులు ఒక్కసారిగా ఉలిక్కిపడతాయి. తీవ్ర అయోమయానికి గురవుతాయి. నేను చిమ్మే ఈ రక్తం కూడా వికారపు వాసనను కలిగి ఉంటుంది. దీంతో ఆ జంతువులు నన్ను తినేందుకు వెనకాడతాయి. కానీ గద్దలు, డేగల్లాంటి పక్షుల దగ్గర నా ట్రిక్కులు పనిచేయవు. ప్చ్‌... నేను ఎంత ప్రయత్నించినా అవి ఎలాగోలా నన్ను కరకరలాండిచేస్తాయి.

ఎండంటే మాకు ప్రాణం..!

మాకు ఎండంటే ప్రాణం. పొద్దుణ్నే నిద్రలేచి, సూర్యకాంతి కోసం ఎదురు చూస్తుంటాం. ఎందుకంటే మేం ఎండలో ఉంటేనే మా శరీరంలో విటమిన్‌ - డి తయారవుతుంది. మేం వరసగా కొన్ని రోజులు ఎండలో లేకుంటే మాలో ‘డి’ విటమిన్‌ లోపం తలెత్తుతుంది. దీంతో జబ్బు పడతాం. అందుకే పగటిపూట ఎక్కువ సమయం సూర్యకాంతిలో ఉండేందుకే ఇష్టపడతాం. చీమలు, చెద పురుగులు, మిడతల్లాంటి చిన్న చిన్న కీటకాలను ఆహారంగా తీసుకుంటాం. మేం తినేదానిలో ప్రధానభాగం మాత్రం హార్వెస్టర్‌ చీమలే. మా ఆహారంలో దాదాపు 70 శాతం వరకు ఇవే ఉంటాయి.

చకచకా తవ్వేస్తాం...

నేలను తవ్వడంలోనూ మేం వేగంగానే ఉంటాం. శత్రువుల నుంచి రక్షించుకోవడంలో భాగంగానూ మేం ఇలా చేస్తాం. మా అక్రమ రవాణా, అడవుల నరికివేత, వ్యవసాయంలో పురుగుల మందు వినియోగం, మాకు ఎంతో ఇష్టమైన హార్వెస్టర్‌ చీమల లభ్యత తగ్గడం.. మాకు పెనుముప్పుగా మారుతోంది. కొన్ని సంవత్సరాలుగా మా సంఖ్య వేగంగా పడిపోతోంది. మా రక్షణ కోసం స్థానిక యంత్రాంగాలు చర్యలు తీసుకుంటున్నాయి. ప్చ్‌... అయినప్పటికీ మా సంఖ్య అనుకున్నస్థాయిలో పెరగడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే కొంతకాలం తర్వాత మేం అంతరించిపోతామేమో అన్న భయమూ కలుగుతోంది. నేస్తాలూ... మొత్తానికి ఇవీ మా విశేషాలు. ఇక ఉంటామరి బై... బై...!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని