చేపా.. చేపా.. గుట్టు చెప్పవా.?

అమెరికాలో శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలోని ఓ అక్వేరియంలో ఉన్న లంగ్‌ఫిష్‌ ‘మెతుసెలా’ ఇటీవల వార్తల్లో నిలిచింది. ఎందుకూ అంటే.. ప్రపంచవ్యాప్తంగా అక్వేరియాల్లో ఉన్న చేపలన్నింటిలోకెల్లా ఇదే వయసులో అతి పెద్దదట.

Updated : 28 Sep 2023 05:58 IST

హలో ఫ్రెండ్స్‌.. చేపల్లో అనేక రకాల గురించి పుస్తకాల్లో చదువుకునే ఉంటాం. వాటిల్లో వింతైనవీ, ఖరీదైనవీ పత్రికల్లోనో, టీవీల్లోనో చూస్తుంటాం. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయేది మాత్రం అత్యంత వృద్ధ చేప గురించి.. ఇంతకీ అది ఎక్కడుందో, దాని వివరాలేంటో తెలుసుకుందామా.!!

అమెరికాలో శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలోని ఓ అక్వేరియంలో ఉన్న లంగ్‌ఫిష్‌ ‘మెతుసెలా’ ఇటీవల వార్తల్లో నిలిచింది. ఎందుకూ అంటే.. ప్రపంచవ్యాప్తంగా అక్వేరియాల్లో ఉన్న చేపలన్నింటిలోకెల్లా ఇదే వయసులో అతి పెద్దదట. దీని వయసు దాదాపు 92 నుంచి 101 సంవత్సరాల మధ్యలో ఉంటుందని చెబుతున్నారు.

ఆస్ట్రేలియా నుంచి వచ్చి..

1938 ప్రాంతంలో ఆస్ట్రేలియా నుంచి ఒక పడవలో దాదాపు 230 చేపలు అమెరికాకు వచ్చాయట. వాటిల్లో ‘మెతుసెలా’ కూడా ఒకటి. అందులో ఇంకా మిగిలి ఉంది కూడా ఇదొక్కటేనట. చిన్న పిల్లగా ఉన్నప్పుడు వచ్చిన ఈ చేప.. ఓ అక్వేరియంలో స్థిరపడిపోయింది. దానికి ఆ వాతావరణం బాగా అనుకూలించడంతో ఇప్పటికీ పూర్తి ఆరోగ్యంగా ఉంది. 2017లో దీని వయసును 84గా లెక్కగట్టి, అనధికారికంగా ‘ప్రపంచంలోనే అత్యంత వృద్ధ అక్వేరియం చేప’గా నిర్ధారించారు. కానీ, ఇటీవల పరిశోధనల్లో దాని వయసు 92 నుంచి 101 ఏళ్లకు దగ్గరగా ఉంటుందని శాస్త్రవేత్తలు తేల్చారు.

అలా తెలుస్తుందన్నమాట..

‘చెట్లకైతే వాటి కాండం మధ్యలోని వృత్తాల ఆధారంగా వయసును లెక్కిస్తారు.. మరి, చేపలకెలా కనుక్కుంటారు?’ అనే అనుమానం మీకు వచ్చే ఉంటుంది కదా.. అయితే, చేపల వయసును వాటి ‘ఇయర్‌ బోన్స్‌’ ఆధారంగా చెప్పొచ్చట. ఈ లంగ్‌ఫిష్‌ చేపల ఇయర్‌ బోన్స్‌ మిగతా వాటికంటే చాలా భిన్నంగా.. మనుషులు, ఆవులను పోలి ఉంటాయట.

అదో ప్రత్యేకత..

నీటి బయట ఉన్నప్పుడు లేదా నీటి నాణ్యతలో తేడా వచ్చినప్పుడు.. ఈ లంగ్‌ఫిష్‌లు ఒక్క ఊపిరితిత్తితోనే గాలిని పీల్చుకోగలవట. ఈ రకం చేపల అంతర్గత శరీర నిర్మాణం సైతం ప్రత్యేకంగా ఉంటుందట. కొందరు శాస్త్రవేత్తలు వయసులో ఉన్న చేపలతో ఈ వృద్ధ చేపను పోల్చి చూశారు. అయితే, సాధారణంగా వయసు పైబడిన చేపల్లో కనిపించే వెన్నుపాములో మార్పు, బరువు తగ్గడం, కళ్లు పొడిబారడం తదితర లక్షణాలు ‘మెతుసెలా’లో ఒక్కటీ కనిపించలేదట. ఈ రకం చేపల్లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయని, వాటిపైన శాస్త్రవేత్తలు చాలా పరిశోధనలు చేయొచ్చని అక్వేరియం నిర్వాహకులు గొప్పగా చెబుతున్నారు. నేస్తాలూ.. మన తాతలు, ముత్తాతల వయసున్న చేప విశేషాలివీ... దాని గుట్టు ఏంటో మనకూ తెలిస్తే బాగుండునని అనిపిస్తోంది కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని