ఇదో ఎర్రనీటి సరస్సు!!

అదో సరస్సు...! దాని నీటి రంగు చూడగానే భయపెట్టేలా... రక్తంలా ఎరుపు వర్ణంలో ఉంటుంది. ఈ నీటిలో ఒక్క జీవి కూడా ఉండదు. కానీ ఫ్లెమింగోలు మాత్రం కనిపిస్తాయి.

Updated : 29 Sep 2023 05:16 IST

అదో సరస్సు...! దాని నీటి రంగు చూడగానే భయపెట్టేలా... రక్తంలా ఎరుపు వర్ణంలో ఉంటుంది. ఈ నీటిలో ఒక్క జీవి కూడా ఉండదు. కానీ ఫ్లెమింగోలు మాత్రం కనిపిస్తాయి. అవి ఎందుకు ఈ సరస్సులో ఉంటాయి. ఏ జీవీ లేని ఈ సరస్సులో అవి ఏం తిని బతుకుతాయి. అసలింతకీ ఈ జలాశయం ఎక్కడుందో తెలుసుకోవాలని ఉందా? అయితే వెంటనే ఈ కథనం చదివేయండి. మీ అనుమానాలన్నీ తీరిపోతాయి సరేనా!  

చిత్ర విచిత్రమైన ఈ సరస్సు పేరు నాట్రాన్‌. ఇది ఆఫ్రికా ఖండంలోని టాంజానియాలో ఉంది. దీన్ని స్థానికంగా ‘డెడ్లీ రెడ్‌ లేక్‌’ (ప్రాణాంతక ఎర్ర సరస్సు) అని పిలుస్తారు. ఈ నీటిలో మూలకాలు, ఉప్పు శాతం ఎక్కువగా ఉండటమే.. దీన్ని ఇలా పిలవడానికి కారణం. దీనికుండే ప్రత్యేక లక్షణాలతో పరిశోధకులు, సందర్శకులు, ఫొటోగ్రాఫర్లను తన వైపు ఆకర్షిస్తోంది.

ఇవీ ఖ‘నిజాలు’!.

ఈ సరస్సు నీటిలో ఎక్కువ మొత్తంలో ఖనిజాలు, లవణాలు ఉంటాయి. ముఖ్యంగా సోడియం కార్బొనేట్‌ అధికంగా ఉంటుంది. చుట్టుపక్కల ఉండే అగ్నిపర్వతాల వల్లే ఈ సరస్సు నీటిలో ఇవి పేరుకుపోయాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతుంటారు. కారణం ఏదైనా ఈ నీటిలో పీహెచ్‌ స్థాయి కూడా ఎక్కువగా ఉండటం వల్ల, సరస్సులో జలచరాలేవీ మనుగడ సాగించలేవు. ఈ సరస్సులో ఫ్లెమింగోలు మాత్రం కనిపిస్తాయని చెప్పుకున్నాం కదా! అవి మరణిస్తే వాటి మృతకళేబరాలు ఈ నీటిలోనే ఉండిపోయాయనుకోండి.. కొంతకాలం తర్వాత అవి రాళ్లలా మారిపోతాయి. దీనికి ఈ నీటిలో ఉండే ఖనిజాలు, లవణాలే కారణమట. ఈజిఫ్షియన్లు మమ్మీల తయారీ కోసం ఇలాంటి రసాయనాలే వాడారట.

వాటి మనుగడ ఎలా?

ఈ నాట్రాన్‌ సరస్సులో జలచరాలు ఏమీ ఉండవు. కానీ కొన్ని రకాల ఆల్గేలు, నాచు మొక్కలు మాత్రం జీవిస్తుంటాయి. ఫ్లెమింగోలు వీటిని తినే బతుకుతాయి. వీటి ద్వారా వాటి శరీరంలో అధిక మొత్తంలో చేరిన ఉప్పు శాతాన్ని, అవి తమ దేహాల్లోని ప్రత్యేక వ్యవస్థల ద్వారా బయటకు పంపిస్తాయి. ఈ మేరకు వాటి శరీరాల్లో అవి మార్పులు చేసుకున్నాయి. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ ఈ విచిత్ర సరస్సు విశేషాలు. భలే ఉన్నాయి కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు