కరిగినా.. తరగనంత ఐస్‌క్రీం..!

హాయ్‌ నేస్తాలూ.. ‘మీరు ఐస్‌క్రీం తింటారా? ఎక్కువగా ఏ ఫ్లేవర్‌ నచ్చుతుంది?’ అని అడిగితే.. ‘ఐస్‌క్రీం అయితే చాలు.. మారు మాట్లాడకుండా తినేస్తాం’ అంటారు.. అంతేనా.!! అయినా, ఐస్‌క్రీం నచ్చనివాళ్లు ఎవరుంటారు.. ఇప్పుడీ ఐస్‌క్రీం గోల ఎందుకంటే.. మనం ప్రపంచంలోనే అతిపెద్ద ఐస్‌క్రీం గురించి చెప్పుకోబోతున్నాం కాబట్టి.. మరి ఆ విశేషాలేంటో మీరే చదివేయండి!

Updated : 30 Sep 2023 05:23 IST

హాయ్‌ నేస్తాలూ.. ‘మీరు ఐస్‌క్రీం తింటారా? ఎక్కువగా ఏ ఫ్లేవర్‌ నచ్చుతుంది?’ అని అడిగితే.. ‘ఐస్‌క్రీం అయితే చాలు.. మారు మాట్లాడకుండా తినేస్తాం’ అంటారు.. అంతేనా.!! అయినా, ఐస్‌క్రీం నచ్చనివాళ్లు ఎవరుంటారు.. ఇప్పుడీ ఐస్‌క్రీం గోల ఎందుకంటే.. మనం ప్రపంచంలోనే అతిపెద్ద ఐస్‌క్రీం గురించి చెప్పుకోబోతున్నాం కాబట్టి.. మరి ఆ విశేషాలేంటో మీరే చదివేయండి!

ఇప్పటి వరకు మనం మన చేతిలో పట్టుకుని తినేంత సైజులో ఉన్న ఐస్‌క్రీంలనే చూసుంటాం కదూ! అమెరికాలోని కొలరాడోకు చెందిన మాథ్యూ బీమ్‌ అనే అన్నయ్య యూట్యూబర్‌. వివిధ వీడియోలు చేస్తూ, వాటిని తన ఛానల్‌లో అప్‌లోడ్‌ చేసి.. చిన్న చిన్న ఛాలెంజ్‌లు కూడా విసురుతుంటాడు. అలా కోట్లలో వీక్షకులను సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో ఒకసారి ఐస్‌క్రీం తయారీలో రికార్డు సాధించాలని అనుకున్నాడతను. దానికోసం ఐస్‌క్రీంలు, చాక్లెట్లు తయారుచేసే ‘మడ్డీ బైట్స్‌’ అనే సంస్థ సాయం తీసుకున్నాడు. ఇటీవలే ప్రపంచంలోనే అతిపెద్ద ఐస్‌క్రీం కోన్‌ని తయారుచేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.  

తొందరగా కరిగిపోకుండా..

ఈ ఐస్‌క్రీం కోసం ముందుగా అల్యూమినియం కడ్డీలతో కోన్‌ ఆకారాన్ని తయారు చేశారు. ఆ తరువాత ప్రత్యేకంగా తయారుచేసిన మిశ్రమాన్ని అందులో పోసి కోన్‌ ఆకారాన్ని తీసుకొచ్చారు. ఎక్కువ సమయం వరకు ఐస్‌క్రీం కరిగిపోకుండా ఉండేందుకు, తయారీలో డ్రై ఐస్‌ను వినియోగించారట.  

అంతకుమించి..  

ఈ అతిపెద్ద ఐస్‌క్రీం తయారీలో 45.5 కిలోల వాఫిల్‌ కోన్‌, 136 కిలోల చాక్లెట్‌ సిరప్‌ను ఉపయోగించారు. ఈ భారీ కోన్‌ను 453.5 కిలోల వెనీలా ఫ్లేవర్‌ ఐస్‌క్రీంతో నింపేశారు. ఈ కోన్‌ ఐస్‌ మొత్తం ఎత్తు 11 అడుగులు. ఇంకో విషయం ఏంటంటే.. ఇంతకు ముందు అతిపెద్ద ఐస్‌క్రీంగా గిన్నిస్‌ బుక్‌లోకి ఎక్కిన ఐస్‌క్రీం ఎత్తు కేవలం 10 అడుగులే. అంటే, ఇది ఆ రికార్డును బద్దలు కొట్టిందన్నమాట. కానీ, ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’ ప్రతినిధులు ఇంకా దీన్ని అధికారికంగా గుర్తించలేదు. వివరాల నమోదు అనంతరం ఈ భారీ ఐస్‌క్రీంను అక్కడికి వచ్చిన వారికి పంచిపెట్టారట. నేస్తాలూ..
ఈ ఐస్‌క్రీం విశేషాలు భలే ఉన్నాయి కదూ.. ఎంత ఇష్టమైనా మరీ ఎక్కువగా తింటే.. ఆరోగ్యకరం కాదన్న విషయం గుర్తుంచుకోండి.. సరేనా!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని