తాటి, అరటి కలగలిస్తే నేను!

హాయ్‌ నేస్తాలూ... బాగున్నారా! నా ఆకులను చూసి మీరు అరటి చెట్టు అనుకున్నా, నా కాండాన్ని చూసి తాటి చెట్టు అనుకున్నా... మీరు తప్పులో కాలేసినట్లే!

Published : 01 Oct 2023 00:06 IST

హాయ్‌ నేస్తాలూ... బాగున్నారా! నా ఆకులను చూసి మీరు అరటి చెట్టు అనుకున్నా, నా కాండాన్ని చూసి తాటి చెట్టు అనుకున్నా... మీరు తప్పులో కాలేసినట్లే! ఎందుకంటే నేను అరటిని కానూ, తాటిని కూడా కాదు. మరింతకూ నేను ఎవరిని?! మీకు తెలియదు కదూ! అందుకే నా గురించి మీకు చెప్పిపోదామనే ఇదిగో ఇలా వచ్చాను.

ఫ్రెండ్స్‌.. నా పేరు ‘రావెనాల మడగాస్కారియోన్సిస్‌’. కాస్త పెద్దగా ఉంది కదూ! పలకడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది కదా! మీరేం దిగులు పడకండి. ‘ట్రావెలర్స్‌ ట్రీ’, ‘ఫ్యాన్‌ అరటి చెట్టు’ అని కూడా పిలుస్తారు. చెట్టు పైభాగం విసనకర్రలా, ఆకులేమో అరటిలా ఉంటాయి కాబట్టే నన్ను ఇలా పిలుస్తారు. పూర్వకాలంలో బాటసారులకు అత్యవసరంగా నీరు అవసరమైతే నా ఆకుల మొదళ్లలో వెతికేవారు. ఎందుకంటే వాన నీటిని నేను ఒడిసిపట్టి, అక్కడ నిల్వ చేస్తుంటాను. ఆ నీటినే బాటసారులు ఎంచక్కా తాగడానికి ఉపయోగించుకునే వారు. అందుకే నాకు ‘ట్రావెలర్స్‌ ట్రీ’ అనే పేరు వచ్చింది.

పక్షులకు ఎంత ఇష్టమో!

నా స్వస్థలం మడగాస్కర్‌. నేను పెద్దయిన తర్వాత కాండం తాటి చెట్టును తలపిస్తుంది. కొత్తవారెవరైనా నన్ను చూస్తే నేను తాటిచెట్టునో, అరటి చెట్టునో అర్థంకాక బుర్రలు గోక్కుంటారు. దాదాపు 10 మీటర్ల ఎత్తు వరకు చేరుకోగలను. చూడ్డానికి అరటి చెట్టులా కనిపించినా, దాని కన్నా చాలా బలంగా ఉంటాను. ఓ మోస్తరు గాలులను కూడా తట్టుకుని పెరుగుతాను. మరో విషయం ఏంటంటే.. నాకు అందమైన పూలు పూస్తాయి. గోధుమ రంగులో గుళికల్లాంటి కాయలు కాస్తాయి. వీటిని పక్షులు ఎంతో ఇష్టంగా తింటాయి.

ఎంచక్కా కుండీల్లోనూ...

మేం చాలా ఎత్తు వరకు పెరుగుతామని ఫొటోల్లో తెలుస్తుంది కదా.. కానీ, విచిత్రంగా మేం కుండీల్లోనూ పెరగగలం. కానీ వేరు కుళ్లు తెగుళ్లలాంటివి రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మీ దేశంలోనూ నేను అక్కడక్కడా పార్కుల్లో ఉన్నాను తెలుసా. కాకపోతే అవి అచ్చంగా నేను కాదు. నాలో వచ్చిన హైబ్రిడ్‌ రకాలు. అవి నా అంత ఎత్తు పెరగవు.  

విత్తనాలూ.. పిలకలూ!

మా విత్తనాలను నాటి కొత్త మొక్కలు పెరిగేలా చేయొచ్చు. కానీ ఇది చాలా ఆలస్యం అవుతుంది. విత్తనం నుంచి మొలకలు బయటకు రావాలంటే కొన్ని నెలలు పట్టొచ్చు. అరటి చెట్టు చుట్టూ పిలకలు వచ్చినట్లే, నా చుట్టూ కూడా పిలకలు వస్తాయి. వీటి ద్వారా కూడా కొత్త మొక్కలు వచ్చేలా నాటుకోవచ్చు. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ నా విశేషాలు. భలే ఉన్నాయి కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని