బుజ్జీ డాల్ఫిన్‌... బుల్లీ డాల్ఫిన్‌!

ఇదో బుజ్జి డాల్ఫిన్‌... ఇదో బుల్లి డాల్ఫిన్‌... అత్యంత అందమైన డాల్ఫిన్‌..! అంతేకాదు.. అరుదైంది కూడా!! ఇంతకీ దీని పేరేంటి? ఇది ఎక్కడుంటుంది? ఇలాంటి వివరాలన్నీ మీకు తెలుసుకోవాలని ఉంది కదూ!

Published : 02 Oct 2023 00:25 IST

ఇదో బుజ్జి డాల్ఫిన్‌... ఇదో బుల్లి డాల్ఫిన్‌... అత్యంత అందమైన డాల్ఫిన్‌..! అంతేకాదు.. అరుదైంది కూడా!! ఇంతకీ దీని పేరేంటి? ఇది ఎక్కడుంటుంది? ఇలాంటి వివరాలన్నీ మీకు తెలుసుకోవాలని ఉంది కదూ! అయితే ఇంకెందుకాలస్యం చకచకా ఈ కథనం చదివేయండి సరేనా!

మామూలు డాల్ఫిన్లకు కాస్త భిన్నంగా ఉన్న దీని పేరు సెఫలోరిన్చస్‌ హెక్టోరి. ముద్దుగా హెక్టర్‌ డాల్ఫిన్‌ అని పిలుచుకుంటారు. ఇది కేవలం న్యూజిలాండ్‌లో మాత్రమే కనిపిస్తుంది. దీనిలో మళ్లీ రెండు ఉపజాతులు కూడా ఉన్నాయి. ఇవి అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్నాయి.

చిన్ని ముక్కుతో...

ఇవి సాధారణంగా మూడు అడుగుల నుంచి అయిదు అడుగుల వరకు పొడవు పెరుగుతాయి. బరువేమో 40 నుంచి 60 కిలోల మధ్య తూగుతాయి. వీటిలో మగవాటికన్నా, ఆడవి కాస్త పొడవుగా పెరుగుతాయి. మామూలు డాల్ఫిన్లతో పోల్చుకుంటే వీటి ముక్కు చాలా చిన్నగా ఉంటుంది. ఇవి లేత బూడిద, నలుపు రంగులో కనువిందు చేస్తాయి. అప్పుడే పుట్టినప్పుడు...!

ఈ డాల్ఫిన్లు పుట్టినప్పుడు కేవలం 60 నుంచి 80 సెంటీమీటర్ల పొడవుంటాయి. బరువేమో సుమారు 8 నుంచి 10 కిలోగ్రాముల వరకు ఉంటాయి. ఇవి వేసవికాలంలో లోతులేని సముద్ర తీరాల్లో ఎక్కువగా సేదతీరుతుంటాయి. శీతాకాలంలో మాత్రం సముద్రలోతుల్లోకి వెళ్లిపోతాయి. తిరిగి వేసవి వచ్చేనాటికి, సరిగ్గా అవి తమ ప్రయాణాన్ని ఎక్కడ ప్రారంభించాయో, తిరిగి అక్కడికే చేరుకుంటాయి.

చేపలంటే ఇష్టం...

ఈ బుజ్జి డాల్ఫిన్లు చేపలు కనబడితే చాలు కరకరలాడించేస్తాయి. తనకంటే చిన్నవైన కొన్ని సముద్ర జీవులనూ ఈ డాల్ఫిన్లు ఆహారంగా తీసుకుంటాయి. సముద్రాల్లో చేపల వేట వల్ల వీటికీ ముప్పు వాటిల్లుతోంది. ఇవి కూడా చిన్న జీవులే కాబట్టి కొన్నిసార్లు వలల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోతున్నాయి.

చుట్టుముట్టే ముప్పులు!

వాతావరణ మార్పులు, కాలుష్యం ఎలాగూ ఉండనే ఉన్నాయి. ఈ కారణంగానే వీటి సంఖ్య వేగంగా పడిపోతోంది. దీనికి తోడు వీటికి అంటువ్యాధులు కూడా ఎక్కువగానే వస్తాయి. ఈ కారణాల వల్ల వీటి సంఖ్య వేగంగా పడిపోతోంది. ప్రస్తుతం ఈ డాల్ఫిన్ల పరిరక్షణకు స్థానిక యంత్రాంగం కృషి చేస్తోంది. అయినా ఈ జీవుల సంఖ్య ఆశించిన స్థాయిలో మాత్రం పెరగడం లేదు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వీటి జనాభా దాదాపు 14,000 మాత్రమే ఉంటుందని శాస్త్రవేత్తల అంచనా. నేస్తాలూ... మొత్తానికి ఇవీ చిన్ని డాల్ఫిన్‌ విశేషాలు! భలే ఉన్నాయి కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని