రింగు రింగుల తోక జీవిని..!

హాయ్‌ నేస్తాలూ..! బ్లాక్‌ అండ్‌ వైట్‌ గీతలతో ఉండే జంతువులు ఏంటబ్బా.. అని ఆలోచించగానే మనకు టక్కున గుర్తొచ్చేది జీబ్రా.. అంతే కదా!

Published : 03 Oct 2023 00:07 IST

హాయ్‌ నేస్తాలూ..! బ్లాక్‌ అండ్‌ వైట్‌ గీతలతో ఉండే జంతువులు ఏంటబ్బా.. అని ఆలోచించగానే మనకు టక్కున గుర్తొచ్చేది జీబ్రా.. అంతే కదా! అలాంటి రంగులోనే ఇంకో జంతువు కూడా ఉంది కానీ దాని తోక మాత్రమే నలుపు, తెలుపు రంగుల్లో ఉంటుంది. వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదూ..! అయితే, ఇంకెందుకాలస్యం ఈ కథనం చదివి.. ఆ జీవి గురించి దాని మాటల్లోనే తెలుసుకోండి..!

నాపేరు రింగ్‌ టెయిల్డ్‌ లేమర్‌. కాస్త నక్కలా కనిపించే నేను.. ఎక్కువగా ఆఫ్రికా అడవుల్లో ఉంటాను. నా శరీరం బూడిద రంగు, కళ్లేమో పసుపు రంగులో ఉంటాయి. చూడటానికి కాస్త భయంకరంగానే ఉన్నా.. నేను వేటకు చాలా దూరం. ఆకులు, గడ్డి తిని బతికేస్తాను. అప్పుడప్పుడు మాత్రమే ఎక్కడైనా చిన్నచిన్న పక్షులు కనిపిస్తే తినడానికి ప్రయత్నిస్తా.  
తోకే ప్రత్యేకం..!

నా శరీరంలో తోక చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఎందుకంటే దానికి ఎవరో నలుపు, తెలుపు రంగులను వలయాల్లా చక్కగా అద్దినట్లు ఉంటుంది. ఈ వర్ణాలతో రింగురింగులుగా ఉండే తోక చూపరులను ఆశ్చర్యపరుస్తుంది. మరో విశేషమేంటంటే.. శరీరం కంటే నా తోక పొడవే ఎక్కువ.

కళ్ల రంగు మారుతుంది..!

నేను పగటి సమయంలోనే ఆహారాన్ని వెతుక్కుంటాను. ఎంత పెద్ద చెట్లయినా అలవోకగా ఎక్కేయగలను. నేను తోకని ముడుచుకొని దాని మీదే పడుకుంటా. నా అరచేతులు, వేళ్లు.. మీ మనుషుల్లాగే ఉంటాయి. అందుకే నా చేతులు మంచి పట్టును కలిగి ఉంటాయి. మాలో అప్పుడే పుట్టిన జీవి కళ్లు నీలి రంగులో ఉంటాయి. అవి పెరిగే క్రమంలో వాటి రంగు మెల్లమెల్లగా పసుపు వర్ణంలోకి మారుతుంది.

అన్నీ అనుకూలిస్తే....

ఉదయాన్నే కొలనులోనో, చెరువులోనో స్నానం చేసేటప్పుడు చిన్న చిన్న యోగాసనాలు కూడా వేస్తుంటాను తెలుసా..! నా బరువు 2.5 నుంచి 3.5 కిలోల వరకు ఉంటుంది. సాధారణంగా అయితే పదిహేనేళ్లు బతుకుతాను. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే 33 ఏళ్లైనా జీవిస్తాను. గంటకు 20 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలను. కొన్ని కారణాల వల్ల మా సంఖ్య రోజురోజుకి తగ్గిపోతోంది.. నేస్తాలూ... మొత్తానికి ఇవీ నా విశేషాలు.. భలే ఉన్నాయి కదూ.. ఉంటా మరి బై.. బై..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని