ఇది అత్యంత అరుదైన మొక్క!

హాయ్‌ నేస్తాలూ! మనం ఈ రోజు ఓ మొక్క గురించి తెలుసుకోబోతున్నాం. అది ప్రపంచంలోనే అత్యంత అరుదైంది. ఒకానొక సమయంలో ఈ మొక్క భూమిపై అంతరించిపోయిందనుకున్నారు.

Updated : 04 Oct 2023 04:11 IST

హాయ్‌ నేస్తాలూ! మనం ఈ రోజు ఓ మొక్క గురించి తెలుసుకోబోతున్నాం. అది ప్రపంచంలోనే అత్యంత అరుదైంది. ఒకానొక సమయంలో ఈ మొక్క భూమిపై అంతరించిపోయిందనుకున్నారు. కానీ, ఇటీవల మళ్లీ కనిపించడంతో ఆశలు చిగురించాయి. అయినా, ఇప్పటికీ ఈ మొక్క ముప్పు ముంగిటే ఉంది. మరి దాని పేరేంటి? ఇతర విశేషాలేంటో చకచకా తెలుసుకుందామా!  

కులేమో పత్తి మొక్కను, పువ్వేమో కాస్త మందారాన్ని పోలి ఉన్న ఈ మొక్క పేరు కోకియా కుకీ. మోలోకాయ్‌ ట్రీకాన్‌, కుక్స్‌ కోకియో, మొలోకాయ్‌ కోకియా అనే పేర్లూ దీనికి ఉన్నాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన మొక్క. కేవలం హవాయి దీవుల్లోని పశ్చిమ మొలోకాయ్‌ ద్వీపం లోతట్టు ప్రాంతాల్లోనే పెరుగుతాయి. ఒకప్పుడు వీటి సంఖ్య పెద్ద ఎత్తున ఉండేది. కానీ కొన్ని వందల సంవత్సరాల క్రితం వ్యవసాయం కోసం అడవుల్ని విపరీతంగా నరికేశారు. దీంతో వీటి సంఖ్య వేగంగా పడిపోయింది. ప్రస్తుతం ఈ మొక్కల మనుగడ ప్రమాదంలో పడింది.

మొదట మూడంటే.. మూడే!

ఈ కోకియా కుకీ మొక్కను మొట్టమొదట 1860లో కనుగొన్నారు. కానీ కేవలం మూడు మొక్కలను మాత్రమే గుర్తించగలిగారు. 1950లో చివరిగా మిగిలి ఉన్న మొక్క నశించినప్పుడు, దీన్ని అంతరించిపోయినదిగా భావించారు. కానీ చివరకు 1970లో ఓ ఎస్టేట్‌లో ఒకే ఒక మొక్క కనబడింది. దురదృష్టవశాత్తూ ఈ మొక్క కూడా 1978లో అగ్నిప్రమాదానికి గురైంది. కానీ అంతకు ముందే అంటుకట్టే పద్ధతి ద్వారా కొన్ని మొక్కలను సృష్టించారు. ప్రస్తుతం మాత్రం అధికారిక లెక్కల ప్రకారం ఈ కోకియా కుకీ మొక్కలు 23 మాత్రమే ఉన్నాయట! వీటిలో మొలకెత్తే శాతం తక్కువగా ఉండటం, పరిమిత ప్రాంతంలోనే ఇవి మనుగడ సాగిస్తున్న కారణంగా, వీటి సంఖ్య పెద్దగా పెరగడం లేదు. అందుకే ఇప్పటికీ అంతరించిపోయే ప్రమాదం ఉన్న మొక్కల జాబితాలోనే ఉన్నాయి. నేస్తాలూ మొత్తానికి ఇవీ ప్రపంచంలోనే అత్యంత అరుదైన కోకియా కుకీ మొక్క విశేషాలు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని