కారు చీకట్లలో కాంతి రేఖలు వారు..!

వారు.. వీధి పాలు కాలేదు! తమబోటివారికి చిమ్మచీకట్లను చీల్చి వెలుగులు పంచే... వీధిదీపాలు అయ్యారు! విధి వెక్కిరిస్తే వీధి బాలలుగా మారిన అనాథలు.. అభాగ్యులు... వారు! కానీ... ఇది నాణేనికి ఓ వైపు. మరి మరో వైపు.. వారంతా క్రికెట్‌ వీరులు! ఆటుపోట్లతో రాటుదేలి... అలవోకగా సిక్సులు, ఫోర్లతో చెలరేగే క్రీడాకారులు వారు.

Updated : 06 Oct 2023 06:25 IST

వారు.. వీధి పాలు కాలేదు! తమబోటివారికి చిమ్మచీకట్లను చీల్చి వెలుగులు పంచే... వీధిదీపాలు అయ్యారు! విధి వెక్కిరిస్తే వీధి బాలలుగా మారిన అనాథలు.. అభాగ్యులు... వారు! కానీ... ఇది నాణేనికి ఓ వైపు. మరి మరో వైపు.. వారంతా క్రికెట్‌ వీరులు! ఆటుపోట్లతో రాటుదేలి... అలవోకగా సిక్సులు, ఫోర్లతో చెలరేగే క్రీడాకారులు వారు. నిప్పులు చెరిగే బంతులతో ఇక్కట్లనే వికెట్లను కూల్చే క్షిపణులు వారు. ప్రత్యర్థులు కొట్టిన బంతులు బౌండరీలకు చేరకుండా... చిరుతల్లా వాటిని మధ్యలోనే అడ్డుకునే ఫిరంగుల్లాంటి ఫీల్డర్లు వారు. క్రీడాక్షేత్రంలో వ్యూహాలకు, ప్రతివ్యూహాలు రచించే క్రికెట్‌ చాణక్యులు వారు. బరిలోకి దిగితే వార్‌ వన్‌సైడ్‌ చేసే చురకత్తులు వారు.  

మ్మానాన్నల్లేని అనాథ పిల్లలు.. విద్వేషాలు, వేధింపులకు గురై నరకయాతనలు అనుభవించి పారిపోయి వచ్చినవారు. ఎవరూ పట్టించుకోకపోతే చెత్తాచెదారాలు ఏరుకుంటూ, నాలుగు మెతుకులు తింటూ ఫుట్పాత్‌ల మీద కాలం వెల్లదీసేవారు! కానీ, వీరంతా సూపర్‌స్టార్లు అవుతున్నారు. అదీ క్రికెట్లో! ఇటీవల చెన్నైలో వీధిబాలల క్రికెట్ ప్రపంచకప్‌ జరిగింది. మైదానంలో వీరి ఆటే కాదు.. నిజ జీవితంలో వారు చూపిన స్ఫూర్తి, ఒకరినొకరు గౌరవించుకునే సంస్కృతి, తమ హక్కుల రక్షణకు పోరాడే నైజం ఆకట్టుకుంది.

అంతా సరి సమానం!

వీరిని వీధిబాలలే కదా అనే తీసేయొద్దు. వీరికోసం నాలుగేళ్లకోసారి క్రికెట్ ప్రపంచకప్‌ పోటీలే జరుగుతున్నాయి. ఈ అనాథ బాలల ఆటకు పెద్ద ఎత్తున స్పాన్సర్లూ వస్తున్నారు. ఐసీసీ ప్రపంచకప్‌ నిర్వహించడానికి కాస్త ముందే వీరి ప్రపంచకప్‌ కూడా పూర్తయ్యేలా షెడ్యూల్‌ చేశారు. ఇలా తాజాగా చెన్నై వేదికగా తొలిసారి ఈ పోటీలు జరిగాయి. ఈ పిల్లలు ఆడే క్రికెట్ ఫార్మాట్కు ‘స్ట్రీట్ 20’ అని పేరుపెట్టారు. పెద్దల క్రికెట్తో పోల్చితే వీరిది కాస్త భిన్నంగా ఉంటుంది. పిచ్‌ కేవలం 13 మీటర్లే ఉంటుంది. మ్యాచ్‌లో ఓవర్‌కు 4 బంతుల చొప్పున 5 ఓవర్లు మాత్రమే ఉంటాయి. జట్టులో 8 మంది ఆటగాళ్లుంటే.. అందులో నలుగురు అబ్బాయిలు, నలుగురు అమ్మాయిలు తప్పనిసరి. వికెట్ కీపర్‌ మినహా అందరూ ఆల్‌రౌండర్లే. ఆ వికెట్ కీపర్‌ కూడా అమ్మాయిలే ఉంటారు. లింగసమానత్వ నినాదంతో ఈ జట్లలో బాలబాలికలు సమానంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.

చిచ్చరపిడుగులు వీరు...

ఇంగ్లాండ్‌లో వీధిబాలల హక్కుల కోసం పోరాడుతున్న స్ట్రీట్ చైల్డ్‌ యునైటెడ్‌ (ఎస్‌సీయూ) సంస్థ వీరి ప్రపంచకప్‌ పోటీలకు నాంది పలికింది. తొలి ప్రపంచకప్‌ను 2019లో ఇంగ్లాండ్‌లోని లార్డ్స్‌ క్రికెట్ మైదానంలో జరిపారు. మహామహులు పోటీపడే ఈ మైదానంలో వీధి బాలలు ఆడటంతో అద్భుతంగా అనిపించింది. భారత్‌కు చెందిన పిల్లల జట్టు తొలి ప్రపంచకప్‌ను గెలుచుకుంది. రెండో ప్రపంచకప్‌ను ఎస్‌సీయూ సంస్థ.. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ సతీమణి లత ఆధ్వర్యంలోని శ్రీదయా ఫౌండేషన్‌తో కలిసి నిర్వహించింది. అమ్మానాన్న, కుటుంబం అనేదే లేక వీధినపడ్డ చిన్నారుల్ని వివిధ దేశాల్లోని స్వచ్ఛంద సంస్థలు చేరదీస్తున్నాయి. అలాంటి సంస్థల పరిధిలో ఉన్న పిల్లల్లోంచి నైపుణ్యం ఉన్న వారిని ఎంపిక చేసి క్రికెట్‌ జట్లను తయారు చేశారు. మొత్తం 13 దేశాల నుంచి 19 జట్లను ఎ, బి, సి గ్రూప్‌లుగా విభజించారు. ప్రత్యేకించి సి గ్రూప్‌లో భారత్‌కు చెందిన 7 జట్లు పాల్గొన్నాయి. ఈ జట్లలో చెన్నై, ముంబయి, కోల్‌కతా, దిల్లీకి చెందిన వీధిబాలలకు స్థానం దక్కింది. ప్రపంచకప్‌ తరహాలోనే లీగ్‌ దశలో పాయింట్లు, క్వార్టర్‌ ఫైనల్‌, సెమీ ఫైనల్‌, ఫైనల్స్‌ ఉంటాయి. రెండు భారత జట్లు క్వార్టర్స్‌, సెమీస్‌ దాకా వెళ్లాయి. ఫైనల్స్‌ జింబాబ్వే, ఉగాండా మధ్య జరగ్గా.. ఉగాండా రెండో ప్రపంచకప్‌ విజేతగా నిలిచింది.

శెభాష్‌ మోనిషా!

టోర్నీలో పాల్గొన్న ఇండియా టైగర్స్‌ జట్టుకు కెప్టెన్‌గా మోనిషా వ్యవహరించారు. తన తండ్రి 11 ఏళ్లకే చనిపోయారు. తల్లి చెత్త ఊడ్చేపని చేస్తుంటారు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని చదువు సైతం కష్టమనిపించే తరుణంలో చెన్నైలోని కరుణాలయ ఫౌండేషన్‌ ఆదుకుంది. 2019లో లార్డ్స్‌లో భారత్‌కు క్రికెట్ ప్రపంచకప్‌ అందించిన జట్టులో ఈమెది కీలకపాత్ర. ఇప్పుడు రెండో ప్రపంచకప్‌లోనూ పాల్గొని సత్తా చాటింది.

ఒకటే నినాదం.. ‘కాపాడండి’!

ఫోర్లు, సిక్సర్లతో మైదానాన్ని హోరెత్తించిన ఈ పిల్లలు ఆటను ఆటలాగే చూశారు. తామంతా ఒక్కటేనని.. ప్రపంచదేశాలు తమ హక్కులకు అండగా నిలవాలని స్ఫూర్తిని చాటారు. ఈ ప్రపంచకప్‌ వారిలో ప్రతిభను బయటికి తీసేందుకు మాత్రమే కాదు.. వారి బాధలు, ఆశలు, భవిష్యత్తు లక్ష్యాల్ని ప్రపంచానికి చాటేందుకు అని నిర్వాహకులు చెబుతారు. అనాథల్ని ఎవ్వరూ చులకనగా చూడొద్దని, ద్వేషాన్ని దూరం చేసి ప్రేమ పంచాలని ఈ టోర్నీలో పాల్గొన్న అనాథబాలలు వేడుకున్నారు. చాలామంది తమ గత అనుభవాలు చెబుతూ.. చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ... వెక్కివెక్కి ఏడ్చారు. తమను కాపాడాలని ప్రభుత్వాలను వేడుకున్నారు. వీరు ఆడిన ప్రతీ ఆటలో తమ హక్కులకు సంబంధించిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ టోర్నీని ముందుకు సాగించారు.

హిదాయతుల్లాహ్‌.బి, ఈనాడు, చెన్నై


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని