ఐస్‌క్రీంల ఫౌంటెయిన్‌.. కేకుల్లాంటి బెంచీలు!

హాయ్‌ నేస్తాలూ.. పార్కుకి వెళ్లడమంటే మనకు ఎక్కడలేని సంబరం. ఇక అక్కడికి వెళ్లాక రకరకాల ఆటలు ఆడుతూ..

Published : 07 Oct 2023 00:31 IST

హాయ్‌ నేస్తాలూ.. పార్కుకి వెళ్లడమంటే మనకు ఎక్కడలేని సంబరం. ఇక అక్కడికి వెళ్లాక రకరకాల ఆటలు ఆడుతూ.. మనకెంతో ఇష్టమైన ఐస్‌క్రీంలు, కేకులు, పాప్‌కార్న్‌ కొనుక్కొని తినేస్తుంటాం. అయితే, మనకు నచ్చిన ఆయా చిరుతిళ్ల ఆకృతులతోనే ఓ పార్కు ఉంటే.. అవే ఆట బొమ్మలైతే.. ఊహించుకుంటేనే ‘వావ్‌’ అనిపిస్తోంది కదూ.. అలాంటి పార్కు నిజంగానే ఉంది. అదెక్కడో, దాని వివరాలేంటో తెలుసుకుందామా!

ప్పటి వరకు మనం రకరకాల థీమ్‌ పార్కులు చూసుంటాం కదా! థాయ్‌లాండ్‌లోని పట్టాయలో ఐస్‌క్రీం థీమ్‌తో ఏర్పాటు చేసిన పార్కు మనకు చాలా బాగా నచ్చుతుంది. దాని పేరు ‘గ్రేట్‌ అండ్‌ గ్రాండ్‌ స్వీట్‌ డెస్టినేషన్‌’. ఈ ఉద్యానవనంలో ఎటు చూసినా ఐస్‌క్రీంలు, కేకులు, డోనట్స్‌, లాలీపాప్స్‌.. ఇలా పిల్లలకు నచ్చే పదార్థాల్లాంటి ఆకారాలే కనిపిస్తాయి. వాటి మీది నుంచి ఎక్కి దిగుతూ.. జారుడు బండలా జర్రున జారుతూ.. బోలెడు ఆటలు ఆడుకోవచ్చు. కేకు ఆకారంలో టేబుళ్లు, డోనట్‌లాంటి ప్రవేశ ద్వారం, ఐస్‌క్రీం, చెర్రీలతో రూపొందించిన చిన్న చిన్న ఇళ్లు ఎంతగానో ఆకట్టుకుంటాయి. అందుకే ఈ పార్కుకు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. వారాంతాలు, ప్రత్యేక రోజుల్లోనైతే ఒకరోజు ముందే టికెట్లు బుక్‌ చేసుకోవాలట. ఇంకో విషయం ఏంటంటే.. చిన్నపిల్లలకైతే వారి ఎత్తును బట్టి టికెట్‌ ధర ఉంటుందట. ఫొటోషూట్లకూ ఈ పార్కు ఎంతో ఫేమస్‌. నేస్తాలూ.. ఈ ఐస్‌క్రీం పార్కు భలే ఉంది కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని