అయ్యబాబోయ్‌... ఇదో ఏఐ బైక్‌!

నేస్తాలూ..! టెక్నాలజీ రోజురోజుకూ పెరుగుతోంది కదూ! ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఏఐ అనే మాటే వినిపిస్తోంది. అది బైక్‌లకూ పాకబోతోంది!

Updated : 08 Oct 2023 06:30 IST

నేస్తాలూ..! టెక్నాలజీ రోజురోజుకూ పెరుగుతోంది కదూ! ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఏఐ అనే మాటే వినిపిస్తోంది. అది బైక్‌లకూ పాకబోతోంది! ఇప్పటికే ఓ ప్రముఖ బైక్‌ తయారీ కంపెనీ ఇలాంటి ఓ ద్విచక్రవాహనాన్నీ తయారు చేసింది. దాని మీద ఇంకా ప్రయోగాలు జరుగుతున్నాయి. మరి ఆ విశేషాలేంటో క్లుప్తంగా తెలుసుకుందామా ఫ్రెండ్స్‌!

ఈ సూపర్‌ బైక్‌ను యమహా కంపెనీ వాళ్లు రూపొందించారు. దీనికి వాళ్లు మోటరాయిడ్‌ అని పేరు పెట్టారు. ఈ ద్విచక్రవాహనం సెల్ఫ్‌ బ్యాలెన్సింగ్‌ చేసుకోగలదు. అంతేకాదు ఫ్రెండ్స్‌.. ఇదో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఎ.ఐ.) బైక్‌. తన ఓనర్‌ ఎవరో కూడా ఇది గుర్తిస్తుంది. యజమానిని చూడగానే తోక ఊపుకుంటూ వచ్చే కుక్కలా.. ఇది కూడా పార్కింగ్‌ స్థలం నుంచి తన యజమాని దగ్గరకు రాగలదు. అలాగే తనకు తానే స్వయంగా పార్కింగ్‌ కూడా చేసుకోగలదు.

ఎన్నో ఏళ్ల కృషి...

కొన్ని సంవత్సరాలకు పూర్వం నుంచే పలు బైక్‌ కంపెనీలు ఆధునిక ద్విచక్రవాహనాలపై ప్రయోగాలు చేస్తున్నాయి. ఈ మోటరాయిడ్‌ను సిద్ధం చేయడానికి ఇంజినీర్లకు తలప్రాణం తోకకు వచ్చింది. ఎన్నోసార్లు విఫలమయ్యారు కూడా. అయినా పట్టువిడవకుండా, నిద్రాహారాలు మానేసి మరీ ప్రయోగాలు చేశారు. చివరికి అనుకున్నది సాధించారు.

రోబో తయారీదారులతో...

యమహా కంపెనీ ఈ ఏఐ బైక్‌కు ప్రాణం పోయడం కోసం ఓ రోబో తయారీ కంపెనీతో కలిసి పనిచేసింది. ఆ సంస్థ సైంటిస్టులే ఏఐ పరిజ్ఞానాన్ని బైక్‌కు అనుసంధానం చేశారు. అంటే ఈ ద్విచక్రవాహనం.. ఓ రకంగా స్వతంత్రంగా ఆలోచించే మరమనిషిలానూ మారిందన్నమాట.

ఎంత ‘పట్టు’దలో!  

ఈ ఏఐ బైక్‌ మామూలుది కాదు. రోడ్డు మీద ఎన్ని ఎత్తుపల్లాలు ఉన్నా..., మలుపులున్నా.. అస్సలు తన పట్టును కోల్పోదని తయారీదారులు చెబుతున్నారు. దీనిలో ఉన్న సెన్సర్ల సాయంతో ఎప్పటికప్పుడు ఈ ద్విచక్రవాహనం అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. కేవలం సంజ్ఞలతో యజమాని ఈ ఏఐ బైక్‌ను నియంత్రించవచ్చు. ప్రస్తుతానికైతే ఈ సూపర్‌ బైక్‌ ఇంకా అందుబాటులోకి రాలేదు. వస్తే మాత్రం అదుర్సే కదా! నేస్తాలూ... మొత్తానికి ఇవీ ఏఐ బైక్‌ విశేషాలు. భలే ఉన్నాయి కదూ!

నేస్తాలూ..! టెక్నాలజీ రోజురోజుకూ పెరుగుతోంది కదూ! ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఏఐ అనే మాటే వినిపిస్తోంది. అది బైక్‌లకూ పాకబోతోంది! ఇప్పటికే ఓ ప్రముఖ బైక్‌ తయారీ కంపెనీ ఇలాంటి ఓ ద్విచక్రవాహనాన్నీ తయారు చేసింది. దాని మీద ఇంకా ప్రయోగాలు జరుగుతున్నాయి. మరి ఆ విశేషాలేంటో క్లుప్తంగా తెలుసుకుందామా ఫ్రెండ్స్‌!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని