అందమైన డ్రాగన్‌ను నేను!

హలో ఫ్రెండ్స్‌... బాగున్నారా?! ఏంటి అలా చూస్తున్నారు. నేను ఎవరనా? నా గురించి మీకు తెలియదు కదూ!! అందుకే నా మాటల్లోనే చెప్పి పోదామనే.. ఇదిగో ఇలా వచ్చాను. ఓకేనా ఫ్రెండ్స్‌!

Published : 09 Oct 2023 00:08 IST

హలో ఫ్రెండ్స్‌... బాగున్నారా?! ఏంటి అలా చూస్తున్నారు. నేను ఎవరనా? నా గురించి మీకు తెలియదు కదూ!! అందుకే నా మాటల్లోనే చెప్పి పోదామనే.. ఇదిగో ఇలా వచ్చాను. ఓకేనా ఫ్రెండ్స్‌!

నా పేరు గ్లాకస్‌ అట్లాంటికస్‌. పలకడానికి చాలా కష్టంగా ఉంది కదూ! ఎంచక్కా నన్ను మీరు ముద్దుగా బ్లూ డ్రాగన్‌ అని పిలుచుకోండి సరేనా! అన్నట్లు.. నాకు సీ స్లగ్‌ అనే మరో పేరు కూడా ఉందోచ్‌. నేనో సముద్ర జీవిని. ప్రపంచవ్యాప్తంగా నేను కనిపిస్తుంటాను. ముఖ్యంగా అట్లాంటిక్‌, పసిఫిక్‌, హిందూ మహాసముద్రాల్లో జీవిస్తుంటాను.

మా జనాభా ఎంతంటే....

ఈ భూగోళం మొత్తం మీద మా జనాభా ఎంతో.. కచ్చితంగా ఎవరికీ తెలియదు. ఎందుకంటే మేం చాలా చిన్న జీవులం కేవలం 1.2 అంగుళాల పొడవు వరకు మాత్రమే పెరుగుతాం. అయినా పరిమాణంలో మాకంటే పెద్ద జీవుల్ని కూడా హాం..ఫట్‌ చేసేస్తాం. మేం చిరుజీవులం, పైగా అందమైన జీవులం.. అయినా మమ్మల్ని పెంచుకోవడం చాలా కష్టం. ఎందుకంటే మేం తినే ఆహారాన్ని మాకు సమకూర్చడం మీకు చాలా కష్టంతో కూడుకున్న పని. పైగా మా జీవితకాలం కేవలం సంవత్సరం మాత్రమే. అది కూడా అన్నీ అనుకూలిస్తేనే!

పదునైన పళ్లు...!

మేం చిరుజీవులమే అయినప్పటికీ మాకు బలమైన దవడలు, పదునైన పళ్లుంటాయి. వీటితోనే మేం ఆహారంగా తీసుకోబోయే జీవులను కరకరలాడించేస్తాం. మాలో ఆడ జీవులు తీగల్లా గుడ్లను పెద్దసంఖ్యలో పెడతాయి. ఒక్కోతీగలో 20 గుడ్ల వరకు ఉంటాయి. ఇలా ఒక్క గంటలో ఒక్కో ఆడప్రాణి 50 వరకు గుడ్ల తీగలను పెట్టగలదు. మేం ప్రాణాంతకం కాదు కానీ.. మిమ్మల్ని కుడితే మాత్రం.. మీరు కరెంట్‌ షాక్‌ కొట్టిన అనుభూతిని పొందుతారు. కుట్టినచోట మీకు మంటలా అనిపిస్తుంది. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ మా విశేషాలు. ఇక ఉంటామరి బై.. బై!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు